ధనుంజాయ్ తో చిట్‌చాట్..
‘భాజే.. భాజే.. డోలు భాజే...’ ఇటీవలే వచ్చిన గోపాల గోపాల చిత్రంలోని పాపులర్ పాట. విన్న ప్రతి ఒక్కరికి చిత్రంలో పవన్‌కళ్యాణ్‌లా చిందేయాలనిపించేంత ఊపున్న పాట. ఇంత రిథమిక్ పాటను పాడింది ధనుంజయ్ సీపాన. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. సంగీతం మీద మక్కువతో ఎంతో కష్టపడి ప్లేబ్యాక్ సింగర్‌గా ఎదిగాడు. ఇప్పుడు స్టార్ హీరోల చిత్రాల పాటలు పాడుతూ అందరి మన్ననలు పొందుతున్న ధనుంజయ్ పరిచయం అతని మాటల్లోనే.. ..సత్య గడేకారి, శ్రీనగర్‌కాలనీ
నేను పుట్టింది..పెరిగింది విజయనగరంలోనే. విద్యాభ్యాసం కూడా అక్కడే. వైజాగ్‌లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేశాను. చిన్నతనం నుండే సంగీతమన్నా... పాటలన్నా అమితమైన ఇష్టం. అందుకే లక్ష్మీరామ్‌దాస్‌గారి దగ్గర త్యాగరాజ సంగీతం నేర్చుకున్నాను. సంగీతంతో అనుబంధం ఆనాటిదే. మా నాన్న భాస్కర్‌రావు, అమ్మ చిన్నమ్మడు నాకు అన్నింట్లో సపోర్ట్‌గా నిలిచారు.
లౌక్యంతో బ్రేక్
చదివింది ఎమ్మెస్సీ కెమిస్ట్రీ అయినా మనసంతా సంగీతం మీదనే ఉండేది. ఆ ఇష్టంతోనే 2010లో హైదరాబాద్‌కు వచ్చేశా. ఇక్కడే ఎంఏ మ్యూజిక్ ఇన్ కర్నాటిక్ ఓకల్ పూర్తి చేశాను. ఆధ్యాత్మిక ఆల్బమ్స్‌తోపాటు పలు సినిమా పాటలకు కోరస్ పాడాను. నెమ్మదిగా ప్లేబ్యాక్ సింగింగ్ అవకాశాలొచ్చాయి. అయితే నాకు బ్రేక్ వచ్చింది లౌక్యం చిత్రంలోని ‘సూడు.. సూడు’ పాటతోనే. ఆ తరువాత ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘చిన్నదాన నీకోసం’, ‘భీమవరం బుల్లోడు’, ‘అడా’్డ, ‘రఘువరన్ బి.టెక్’ సినిమాల్లో పాడాను. ఈ ప్రయాణంలో సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ నాకెంతో సహకారం అందించారు.
గోపాల గోపాలలో అవకాశం
నా మీద నమ్మకంతో అనూప్‌గారు నన్ను మెదట ‘భాజే.. భాజే’ ట్రాక్ పాడటానికి పిలిచారు. అనంతరం అదే పాటను పలు సింగర్స్‌తో పాడించినా సెట్ అవకపోవడంతో చివరకు నాతోనే పాడించారు. పాట విన్న చిత్ర యూనిట్ బాగా పాడావని అభినందించడం చాలా సంతోషాన్నిచ్చింది. చిత్రంలో ఈ పాటే హైలెట్ కావడంతో నా ఆనందానికి అవధులు లేవు. టెంపర్ సినిమాలోనూ పాడాను. తెలుగువాళ్లు గర్వపడేలా పాటలను పాడాలనేదే నా ఆకాంక్ష..