
వెంకీ, పవన్ ఆ పాత్రల్లో ఎలా ఉంటారో
ప్రస్తుతం సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘గోపాల గోపాల’. ఈ చిత్రానికి ఇంత క్రేజ్ రావడానికి కారణం.. వెంకటేశ్, పవన్‌కల్యాణ్ కలిసి నటించడమే. మల్టీస్టారర్లు వెంకీకి కొత్తకాదు. పవన్‌కల్యాణ్ మాత్రం మరో హీరోతో కలిసి నటించడం ఇదే ప్రథమం. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపయ్యింది. హిందీ చిత్రం ‘ఓ మైగాడ్’... దీనికి మాతృక అనే విషయం తెలిసిందే. ఆ కథలోని కేరక్టరైజేషన్స్ తెలిసిన వారికి... ‘వెంకీ, పవన్ ఆ పాత్రల్లో ఎలా ఉంటారో’ అనే ఆసక్తి...సినిమాపై ఆసక్తి పెంచడానికి మరో కారణమైంది. డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ ఈ చిత్రానికి నిర్మాతలు.
కొంచెం ఇష్టం-కొంచెం కష్టం, తడాఖా చిత్రాలతో ప్రతిభగల దర్శకునిగా అభినందనలందుకున్న కిషోర్‌కుమార్ పార్థసాని(డాలీ) దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అతి త్వరలో ‘గోపాల గోపాల’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. అనూప్ రూబెన్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను డిసెంబర్‌లో విడుదల చేసి, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తామని వారు తెలిపారు. ఈ చిత్రనిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం వస్తున్న కథలకు పూర్తి భిన్నమైన కథాంశమిది. వెంకటేశ్, పవన్‌కల్యాణ్ కెరీర్లలో ఈ తరహా పాత్రలు ఇప్పటివరకూ చేయలేదని కచ్చితంగా చెప్పొచ్చు.
వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, అందులోని సంభాషణలు వినోదభరితంగా, ఆలోచింపజేసే రీతిలో, మనసులను మెలిపెట్టే విధంగా ఉంటాయి. దర్శకుడు డాలీ జనరంజకంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, భూపతిరాజా స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి ప్రధాన బలాలు’’ అని తెలిపారు. సురేశ్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.