'ఒక్క హిట్ తీయన్నా.. చచ్చిపోతున్నామన్నా' | i am fear of god, says pawan kalyan | Sakshi
Sakshi News home page

'ఒక్క హిట్ తీయన్నా.. చచ్చిపోతున్నామన్నా'

Published Sun, Jan 4 2015 10:13 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

'ఒక్క హిట్ తీయన్నా.. చచ్చిపోతున్నామన్నా' - Sakshi

'ఒక్క హిట్ తీయన్నా.. చచ్చిపోతున్నామన్నా'

హైదరాబాద్: దేవుడంటే తనకు చాలా భయమని హీరో పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను నమ్మే దేవుడికి ఆకారం లేదని, నిరాకారుడైన దేవున్ని సంపూర్తిగా నమ్ముతానని వెల్లడించారు. శిల్పాకళావేదికలో ఆదివారం జరిగిన 'గోపాల గోపాల' సినిమా ఆవిష్కరణ కార్యక్రమంలో హీరో వెంకటేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

పవన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
'చిన్నప్పటి నుంచి ఏమవ్వాలో తెలిసేదికాదు. చదవు పెద్దగా చదవలేదు. ఏమయ్యాలో తెలియక నేను, నా స్నేహితుడు ఆనందసాయి శ్రీశైలం అడువుల్లోకి పారిపోదామనుకున్నాం. అప్పుడే హైదరాబాద్ నుంచి అన్నయ్య ఫోన్ చేశారు. వెంటనే బయలుదేరి హైదరాబాద్ రమ్మన్నారు. సాయిని వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయాను. ధ్యానం, యోగ నేర్చుకున్నాను, అందులోపడి మొత్తం బాధ్యతలు వదిలేశాను.

ఇంట్లో అన్నయ్యకు కథలు చెబుతుండేవాడిని. సంపాదించే అన్నయ్య, అమర్చిపెట్టే వదిన ఉంటే ఎన్నికథలైనా చెబుతావని అన్నయ్య అన్నారు. అన్నయ్య అన్న మాటలతో చెంపమీద కొట్టినట్టయింది. అన్నయ్య పడిన కష్టం సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసొచ్చింది. ఖుషీ సినిమా రేపు రిలీజ్ అనగా రాబోయే కొన్ని సంవత్సరాలు కష్టాలు ఉంటాయని నాకు మనసులో అనిపించింది. అది తర్వాత నిజమైంది. దేవుణ్ని ఎప్పుడు ఏమీ కోరలేదు. జీవితంలో మొదటిసారి అభిమానుల కోసం ఒక కోరిక కోరాను.

ఒక్క హిట్ తీయన్నా.. చచ్చిపోతున్నామన్నా.. బయట తలెత్తుకుని తిరగలేకపోతున్నామన్నా అంటూ ఒక అభిమాని నాతో అన్నాడు. అప్పుడు ఒక్క హిట్ ఇమ్మని దేవుణ్ని కోరుకున్నా. మొట్టమొదటిసారి విజయం కోసం ప్రార్థించా. నా మొర ఆలకించి భగవంతుడు హిట్ ఇచ్చాడు. అన్నివదిలేసి వెళ్లిదామనుకున్న సమయంలో నన్ను సినిమాల్లోకి తీసుకొచ్చాడు. మీ అందరి ముందు ఇలా నిలిపాడు. చాలా భయంతో ఈ సినిమాలో భగవంతుడి కేరెక్టర్ చేశాను. ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి' అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement