వెంకటేశ్ మహా
‘‘నేను డైరెక్టర్ అవుతానంటే నా చుట్టూ ఉన్నవాళ్లు నమ్మలేదు. కానీ నా గోల్ పట్ల నాకు క్లారిటీ ఉంది. తెలుగు పరిశ్రమకే స్టిక్ అవ్వాలనుకోవడం లేదు. ఇంటర్నేషనల్ ఫిల్మ్‌మేకర్ అవ్వాలనుకుంటున్నాను. ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా నా లైఫ్‌లో ‘కేరాఫ్ కంచరపాలెం’ మార్పు తీసుకువచ్చింది’’ అన్నారు వెంకటేశ్ మహా. నూతన నటీనటులతో ఆయన దర్శకత్వంలో రానా దగ్గుబాటి సమర్పణలో పరుచూరి విజయ ప్రవీణ నిర్మించిన చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’. ఈ రోజు సినిమా విడుదలవుతున్న సందర్భంగా వెంకటేశ్ మహా చెప్పిన విశేషాలు.
► మాది విజయవాడ. అక్కడి గాంధీనగర్ వీధుల్లో పెరిగాను. కొంత కాలం మిర్యాలగూడలో కూడా ఉన్నా. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాను. సినిమాలపై ఇష్టంతో సెట్‌బాయ్‌గా స్టార్ట్ అయ్యా. టెలివిజన్ షోస్‌కి వర్క్ చేశాను. ప్రాక్టీస్ కోసం షార్ట్ ఫిల్మ్స్ చేశా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశా. యాక్టర్‌గానూ ట్రై చేశా. రచయితగా నా ఫ్రెండ్‌తో కలసి ఓ సినిమాకు వర్క్ చేశాను. కానీ అది సెట్స్‌పైకి వెళ్లలేదు. ఆ తర్వాత ఓ కథ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగాను. వర్కౌట్ కాలేదు. ఓ ఆఫీసులో ‘నిన్ను ఎవరు పంపించారు’ అని అడిగారు. అప్పటికే బాగా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న నేను ‘జాగ్రత్తగా వెళ్లి రా అని మా అమ్మ పంపించింది సార్’ అని చెప్పి వచ్చాను. కంచరపాలెంలో నేను 8 నెలలు ఉన్న రోజులు గుర్తుకువచ్చాయి. అక్కడికి వెళ్లి రిలాక్స్ అవ్వాలని నా ఫ్రెండ్‌కి కాల్ చేశాను. అక్కడికి వెళ్లాక ఇక్కడే ఎందుకు సినిమా తీయకూడదనిపించింది. ఆ ఆలోచన మరుసటి రోజుకు బలపడింది. అలా ‘కేరాఫ్ కంచరపాలెం’ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది.
► నటీనటులుగా కంచెరపాలెంలో ఉండేవాళ్లే బాగుంటుందనుకున్నాను. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ముందుకు వెళ్దామనుకున్నా. ఈ సినిమా ప్లాట్‌ఫామ్, ఐడియాను నా బ్లాగ్‌లో పోస్ట్ చేశాను. ఒకరి ద్వారా ఆ పోస్ట్‌ను యూఎస్‌లో కార్డియాలజిస్ట్‌గా ఉన్న ప్రవీణగారు చూసి నన్ను కాంటాక్ట్ చేశారు.
► సహజమైన సినిమా తీయాలనుకున్నాను. నా ఫ్రెండ్ సాయంతో కంచరపాలెంలోని కొందరికి తెలియకుండానే వాళ్ల ఫొటోలు తీశాను. ఆ తర్వాత వారికి చూపించి నటించడానికి ఒప్పించాను. ఇందులో దాదాపు 86 మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరికీ ముందు నేను నటించి, ఆ తర్వాత వాళ్లను యాక్ట్ చేయమని చెప్పాను. ప్రవీణ మంచి పాత్ర చేశారు. ఇందులో నటించినవాళ్లు సినిమా చూసి ఎగై్జట్ అయ్యారు. ఓవర్‌నైట్ స్టార్స్ అయ్యామన్న ఫీలింగ్‌లో ఉన్నారు (నవ్వుతూ).
► ప్రివ్యూస్ వేశాం. మంచి స్పందన వచ్చింది. ప్రవీణగారు సురేశ్‌బాబుగారిని కలుద్దా మన్నారు. ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట సిద్ధారెడ్డిగారి ద్వారా కలిశాం. మా కాన్ఫిడెన్స్, ఎగై్జట్‌మెంట్ చూసి సురేశ్‌బాబుగారు రిలీజ్‌కు ఒప్పుకున్నారు.
► ప్రస్తుతం మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ సైన్ చేయలేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించి యూఎస్‌లో ఓ క్రాష్ కోర్స్ చేద్దామనుకుంటున్నాను. సినీ ప్రముఖులు మా సినిమాను మెచ్చుకోవడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment