
బాబు... కామెడీయే వేరు!
హీరోలు ఫైట్లు చేస్తారు... డ్యాన్స్‌లు చేస్తారు... డైలాగులు చెబుతారు. ఇది కామన్. మరి, మంచి టైమింగ్‌తో కామెడీ చేయడం?
హీరోలు ఫైట్లు చేస్తారు... డ్యాన్స్‌లు చేస్తారు... డైలాగులు చెబుతారు. ఇది కామన్. మరి, మంచి టైమింగ్‌తో కామెడీ చేయడం? అది అందరూ చేసేదీ కాదు... చేయగలిగిందీ కాదు. చక్కటి టైమింగ్ సెన్స్‌తో తెరపై కామెడీ పండించడంలో మన హీరోల్లో కొందరు మహా దిట్టలు. అలాంటివారిలో ఒకరైన వెంకటేశ్ ఇప్పుడు మరోసారి వినోదాల విందు వడ్డించేందుకు సిద్ధమవుతున్నారు.
ఆ మధ్య ‘దృశ్యం’, ‘గోపాల... గోపాల’ లాంటి విభిన్న కథాచిత్రాల్లో చేసిన ఆయన ఇప్పుడు ఒక మంచి రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో మళ్ళీ కనిపించనున్నారు. యువ దర్శకుడు మారుతి నిర్దేశకత్వంలో హీరోయిన్ నయనతారతో కలసి కనువిందు చేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ, పి.డి.వి. ప్రసాద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సమర్పకులు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రానికి ‘బాబు... బంగారం’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. చిత్ర యూనిట్ మాత్రం ఇంకా అధికారికంగా టైటిల్ ప్రకటించలేదు. ఇది ఇలా ఉండగా, ఈ ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమా మొదటి లుక్‌ను విడుదల చేయనున్నారు. ‘‘వెంకటేశ్ గారి కామెడీ టైమింగ్‌ను మనసులో పెట్టుకొని మరీ దర్శకుడు మారుతి డైలాగ్స్ రాశారు. జూలైలో విడుదల చేయాలని ప్లాన్.
వెంకటేశ్, నయనతారల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘లక్ష్మీ’, ‘తులసి’ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ముచ్చటగా ఈ మూడో చిత్రం కూడా అదే తరహాలో విజయం సాధిస్తుందని భావిస్తున్నాం’’ అని చిత్ర నిర్మాతలు అన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో చకచకా సాగుతోంది. బ్రహ్మానందం, బ్రహ్మాజీ, ‘వెన్నెల’ కిశోర్, పృథ్వి, మురళీశర్మ, దేవ్ గిల్, జయప్రకాశ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రధారులు. రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రాహకుడు.
‘ఉత్తమ విలన్’, ‘చీకటి రాజ్యం’ లాంటి విభిన్న తరహా చిత్రాల ఫేమ్ జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ‘‘జిబ్రాన్ మంచి బాణీలు కట్టారు. పాటలన్నీ వినగానే హమ్ చేసుకొనేలా ఉంటాయి. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకొనేలా మారుతి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు’’ అని నిర్మాతలు వివరించారు. మరి, ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మరొక్క రోజు ఆగితే సరి!