
ఆచితూచి సినిమాలు చేస్తున్న సీనియర్ హీరో వెంకటేష్ గురు లాంటి హిట్ సినిమా తరువాత మరోసారి గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం కథలు ఫైనల్ చేసే పనిలో ఉన్న వెంకీ ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఘనవిజయం సాధించిన దర్శకుడు తేజ మరోసారి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా వెంకటేష్ హీరోగా తెరకెక్కనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 13న ప్రారంభించనున్నారు.
ఈ సినిమాతో పాటు మరో సినిమాకు కూడా వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. రాజా ది గ్రేట్ సినిమా సక్సెస్‌తో హ్యాట్రిక్ సాధించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ ఓ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఎఫ్ 2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) అనే టైటిల్‌ను ఫైనల్ చేశారట. ఈ సినిమాను కూడా 2018 మొదట్లోనే ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. అంటే తేజ సినిమా సెట్స్ మీద ఉండగానే అనిల్ రావిపూడి సినిమా ప్రారంభంకానుంది. మరి స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్న వెంకీ.. రెండు సినిమాలను ఒకేసారి చేస్తాడో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment