రాంబాబు కుటుంబానికి దిష్టి తగిలింది : వెంకటేశ్
‘‘ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా చేసిన పాత్రలే చేసినట్లు అనిపించింది. ఏదైనా విభిన్న కోణంలో ఉన్న పాత్ర వస్తే బాగుంటుందనుకుంటున్న సమయంలో ‘దృశ్యం’ చూశాం. చాలా నచ్చింది. నేను కొత్త రకం నటన కనబర్చడానికి ఆస్కారం ఉంటుందని ఈ చిత్రం చేశాను. తన కుటుంబంతో హాయిగా ఉంటాడు రాంబాబు. అతని కుటుంబానికి దిష్టి తగులుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది సినిమాలో చూడాల్సిందే’’ అని వెంకటేశ్ చెప్పారు. మలయాళ చిత్రం ‘దృశ్యం’ని అదే పేరుతో వెంకటేశ్, మీనా జంటగా సురేష్‌బాబు, రాజ్‌కుమార్ సేతుపతి తెలుగులోకి పునర్నిర్మించిన విషయం తెలిసిందే.
నటి శ్రీప్రియ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 11న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డి. రామానాయుడు మాట్లాడుతూ -‘‘ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రచార చిత్రాలు ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్నాయి’’ అన్నారు. సురేష్‌బాబు మాట్లాడుతూ -‘‘శంకరాభరణం, త్రీ ఇడియట్స్ లాంటి చిత్రాలు ఆర్టిస్టిక్‌గా ఉండే కమర్షియల్ ఎంటర్‌టైనర్స్. మలయాళ ‘దృశ్యం’ కూడా ఆ తరహా సినిమానే. మూడు ఫైట్లు, కొన్ని కామెడీ సీన్లు, ఐదు పాటల ఫార్మాట్‌కి అలవాటు పడిపోయాం.
కానీ, అందుకు భిన్నంగా ఉండే సినిమా ఇది’’ అని చెప్పారు. సంసారానికి రాముడుగా ఉండే రాంబాబు అనే వ్యక్తి.. అదే సంసారాన్ని కాపాడుకోవడానికి కృష్ణుడిగా కూడా ఎలా మారతాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుందని, మొగుడు, మగాడు ఎలా ఉండాలో చెప్పే చిత్రమని పరుచూరి బ్రదర్స్ చెప్పారు. ఇంకా నరేశ్, బెనర్జీ కూడా మాట్లాడారు.