వెండితెర సీతమ్మ ఇక లేరు | Veteran actor Anjali Devi passes away | Sakshi
Sakshi News home page

వెండితెర సీతమ్మ ఇక లేరు

Published Mon, Jan 13 2014 11:21 PM | Last Updated on Fri, Aug 3 2018 2:51 PM

Veteran actor Anjali Devi passes away

‘శ్రీరామచంద్రా... ఎంత నిర్దయుడవయ్యావ్. మనసు ఎలా రాయి చేసుకున్నావ్. ఇంకా నీకు నాపై అనుమానమేనా!’.. విషాదానికి పరాకాష్ట అంటే ఏంటో అప్పుడు చూశారు జనాలు. కన్నీరు కట్టలు తెగింది. తాము చూస్తున్నది సినిమా అన్న సంగతే మరచారు. సాక్షాత్తూ సీతనే చూస్తున్నట్లు ఫీలైపోయారు. ఆ గొప్పతనం ఎవరిది? ... ‘అంజలీదేవి’ది. ఏ పాత్రలో పోస్తే... ఆ పాత్రగా మారిపోయే అభినయామృతం అంజలి. తెలుగు తెరపై ఆమెది చెరగని సంతకం.



పాత్ర పోషణలో శారీరకభాష ప్రాధాన్యత చాలా ఉంటుంది. అందుకే... అన్నీ పాత్రలూ అందరికీ నప్పవ్. కానీ ఆ విషయంలో అంజలి మినహాయింపు. ఆమె చేయని పాత్ర లేదు. ఆ మాటకొస్తే చేయలేని పాత్ర కూడా లేదు. ఓ సారి అంజలి కెరీర్‌ని విశ్లేషించుకుంటే.. అది ఎంత నిజమో అర్థమవుతుంది.‘గొల్లభామ’(1945) చిత్రంతో  అంజలి సినీ ప్రస్థానం మొదలైంది. కాంచనమాల, భానుమతి రాజ్యమేలుతున్న రోజులవి. ‘డాన్స్’ అనే ప్రక్రియను కథానాయికలు అప్పుడప్పుడే అలవాటు చేసుకుంటున్నారు. అలాంటి టైమ్‌లో వచ్చిన అంజలి... డాన్స్ అంటే ఏంటో తెరకు రుచి చూపించారు. ‘నాట్యతార’గా వినుతికెక్కారు.

అంజలి కెరీర్‌లో మేలి మలుపు అంటే ‘కీలుగుర్రం’(1949) సినిమానే. అందులో చేసిన మోహిని పాత్ర అంజలిని స్టార్‌ని చేసేసింది. కథ రీత్యా అందులో ఉంటే మూడు రాక్షసుల్లో అంజలి ఓ రాక్షసి. దాంతో ప్రేక్షకుల  హృదయాల్లో ‘అందాల రాక్షసి’గా నిలిచిపోయారామె. ‘పరదేశి’(1951) తర్వాత అంజలి పిక్చర్స్ పతాకంపై ఆమె భర్త ఆదినారాయణరావు ‘అనార్కలి’(1955) చిత్రాన్ని నిర్మించారు. ప్రేమించిన పాపానికి జీవసమాధికి గురయ్యే ప్రేమికురాలు అనార్కలిగా అంజలి నటించిన తీరు ప్రేక్షకుల్ని విస్మయానికి గురి చేసింది. ‘కీలుగుర్రం’లోని పాత్రకు ఇది పూర్తి భిన్నమైన పాత్ర. నటిగా అంజలిలోని మరో కోణం ‘సువర్ణసుందరి’(1957). తెలుగు, తమిళ, హిందీ... మూడు భాషల్లోనూ విజయదుందుభి మోగించిన సినిమా ఇది. ఓ వైపు దేవకన్యగా, మరోవైపు మహాసాధ్విగా, ఇంకోవైపు ఓ బిడ్డకు తల్లిగా రకరకాల డైమన్షన్లను చూపించారు ఇందులో అంజలి.

సాధ్విగా నటించి మెప్పించడం ఓ ఎత్తు. అందుకు పూర్తి భిన్నంగా నెగిటివ్ రోల్‌తో ‘అందాల రాక్షసి’గా మెరిపించడం ఓ ఎత్తు. కానీ... ఈ రెండింటి మధ్య ఉండే పాత్ర... మామూలు గృహిణి పాత్ర. నా ఇల్లు, నా  భర్త, నా పిల్లలు, నా ఆస్తి. ఈ క్రమంలో అత్తమామల్ని కూడా నిర్లక్ష్యం చేస్తుందా పాత్ర. అటు మంచిది అనలేం, ఇటు చెడ్డదీ అనలేం. నిజంగా కత్తిమీద సామే. కానీ అంజలికి ఏ పాత్రయినా కరతలామలకం. అందుకు నిదర్శనమే ‘పాండురంగ మహాత్మ్యం’(1957) చిత్రంలో పుండరీకుని భార్య పాత్ర.
‘చెంచులక్ష్మి’(1958)లో శ్రీమహాలక్ష్మిగా అంజలిని చూస్తే... అచ్చంగా కేలండర్లో లక్ష్మీదేవిలాగే ఉంటారు. అందులో కూడా లక్ష్మిగా, చెంచులక్ష్మిగా రెండు కోణాలను సమర్థవంతంగా ఆవిష్కరించారామె.


‘జయభేరి’(1959) అంజలి నటవైదుష్యానికో మెచ్చుతునక.‘భట్టి విక్రమార్క’(1960)లో ప్రభావతిగా అంజలీదేవి అభినయం నిజంగా అనితర సాధ్యమే. విక్రమార్కుని ప్రేయసిగా అంజలి అభినయం ఒక ఎత్తు అయితే... శాపకారణంగా మాటలు రాని వృద్ధురాలిగా మారినప్పుడు ఆమె పలికించిన ఆర్థ్రతాపూరిత అభినయం మరో ఎత్తు. అంజలి చేసిన ఛాలెంజింగ్ రోల్స్ అంటే ముందు చెప్పుకోవాల్సింది.. ‘భీష్మ’(1962) సినిమాలో శిఖండి పాత్ర. ఆ కేరక్టర్‌లో ఎన్నో కోణాలు కనిపిస్తాయి. ఆ టైమ్‌లో ఏ కథానాయిక కూడా ఆ పాత్ర చేయడానికి ముందుకు రాలేదు. దటీజ్ అంజలి. ఇక ‘లవకుశ’(1963)లో ‘సీత’ పాత్ర సరేసరి. తెలుగువారికి సీత అంటే అంజలే. ఆ పాత్రను ఎంతమంది పోషించినా.. ఆమె దరిదాపులక్కూడా రాలేకపోయారు. ‘బడిపంతులు’(1972) చిత్రంలో ఎన్టీఆర్‌తో కలిసి ఆమె పలికించిన అభినయాన్ని కూడా తేలిగ్గా మరిచిపోలేం.

తెలుగు సినిమా స్వర్ణయుగం చూస్తున్న రోజుల్లో ‘లేడీ హీరోలు’ ఇద్దరు ఉండేవారు. వారిలో ఒకరు భానుమతి రామకృష్ణ అయితే... రెండోవారి అంజలీదేవి. ఆ రోజుల్లోనే పలు స్త్రీ ప్రాధాన్యతా చిత్రాల్లో నటించిన ఘనత వీరిద్దరిది. అంజలీదేవి- ఎన్టీఆర్, అంజలీదేవి- ఏఎన్నార్ అని టైటిల్స్ పడ్డ సినిమాలు చాలానే ఉన్నాయి. ఎన్టీఆర్ తొలి హీరోయిన్ అంజలీదేవే. ‘పల్లెటూరి పిల్ల’ వీరిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం. అలాగే నిర్మాతగా ఎన్టీఆర్ తొలి విజయం ‘జయసింహ’లో కథానాయిక అంజలీదేవి. మరో విషయం ఏంటంటే... తొలినాళ్లలో అక్కినేని, ఆదినారాయణరావు కలిసి ‘మాయలమారి’ చిత్రాన్ని

నిర్మించారు. అంటే... నిర్మాతగా అక్కినేని తొలి నాయిక కూడా అంజలీదేవే. ఆ విధంగా ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు విజయతార అంజలి.  అంజలీదేవి సరసన ఎక్కువ చిత్రాల్లో నటించిన కథానాయకుడు ఎన్టీఆర్ అయితే... ఆమె సొంత నిర్మాణ సంస్థ ‘అంజలి పిక్చర్స్’లో ఎక్కువ చిత్రాల్లో నటించిన కథానాయకుడు మాత్రం అక్కినేనే. అనార్కలి(1955), సువర్ణసుందరి(1957), రుణానుబంధం(1960), భక్తతుకారం(1975), మహాకవి క్షేత్రయ్య(1976) లాంటి చిత్రాలను అక్కినేని కథానాయకునిగా తన భర్త ఆదినారాయణరావుతో  కలిసి నిర్మించారు అంజలి. ఎన్టీఆర్ నటించిన ఏకైక అంజలి పిక్చర్స్ చిత్రం ‘స్వర్ణమంజరి’(1962).

తెలుగులో అంజలీదేవి కథానాయకులు అంటే... ఎన్టీఆర్, ఏఎన్నార్ పేర్లనే ఎవరైనా చెబుతారు. వారిద్దరి సరసనే ఆమె ఎక్కువ చిత్రాల్లో నటించారు కూడా. కానీ అంజలి మరొకరికి కూడా హిట్ పెయిర్. ఆయనే ఎస్వీరంగారావు. ‘భట్టివిక్రమార్క’లో ప్రచండుడుగా ఎస్వీఆర్, ప్రభావతిగా అంజలి నటించిన తీరు ప్రేక్షకుల్ని మంత్రముగ్థుల్ని చేసింది. ‘బాలనాగమ్మ’లో టైటిల్ రోల్ అంజలిది అయితే... ఎస్వీఆర్ మాయలపకీర్. అయితే... ఈ రెండు సినిమాల్లో అంజలి కథానాయిక, ఎస్వీఆర్ విలన్. వాటి తర్వాత భక్తప్రహ్లాద(1967), లక్ష్మీనివాసం(1968), తాతామనవడు(1972)... తదితర చిత్రాల్లో అంజలి, ఎస్వీఆర్ భార్యాభర్తలుగా నటించారు. ఒకరికొకరికి ఏమాత్రం ఇక పొంతన లేని నటులకు హిట్ పెయిర్‌గా నిలిచిన ఘనత కూడా అంజలీదేవిదే.

తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, తమిళంలో ఎమ్జీఆర్, శివాజి గణేశన్, జెమినీ గణేశన్‌లతో కలిసి ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించారామె. కథానాయికలందరూ కాలక్రమంలో కేరక్టర్ ఆర్టిస్టులే. అయితే... కేరక్టర్ అర్టిస్టులైన తర్వాత కూడా హీరోయిన్ల పోకడలు చాలామందిని విడిచిపెట్టవ్. ఆ విషయంలో కూడా అంజలి మినహాయింపే. కాలంతో ప్రయాణం చేయడం, కాలానుగుణంగా మారడం అంజలికి మాత్రమే సాధ్యమైంది. కేరక్టర్ నటిగా కూడా అత్యద్భుతమైన ప్రస్థానాన్ని సాగించారామె. ఏ హీరోల పక్కన కథానాయికగా నటించారో, అదే హీరోలకు తల్లిగా, అక్కగా, వదినగా నటించి మెప్పించారు. నటిగా అంజలీదేవి చివరి సినిమా చిరంజీవి ‘బిగ్‌బాస్’(1995). ఆ సినిమా తర్వాత మళ్లీ అంజలి తెరపై కనిపించలేదు.

సాధ్విగా, భక్తురాలిగా, ప్రేమికురాలిగా, యువరాణిగా, ప్రతినాయకురాలిగా, సాధారణ గృహిణిగా, అక్కగా, వదినగా, అమ్మగా, అమ్మమ్మగా... ఎన్నో రూపాల్లో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించి, పరవశింపజేశారు మహానటి అంజలి. ‘ఆ మహానటి ఇక లేరు...’ అనే మాట తెలుగు ప్రేక్షకులకు నిజంగా శరాఘాతమే. 86ఏళ్ల నిండు వయసులో... హృదయ సంబంధిత సమస్యల కారణంగా చెన్నయ్‌లో సోమవారం తుదిశ్వాస విడిచారు అంజలి. ఆ నట శిరోమణి మరణం భారతీయ సినిమాకే తీరని లోటు. సినిమా ఉన్నంతకాలం అంజలి జ్ఞాపకాలు బతికే ఉంటాయి.

అద్భుతనటి అంజలీదేవి
తెలుగు చిత్రపరిశ్రమలోని ప్రతి కుటుంబంలో అనుబంధం కలిగిన అద్భుతనటి అంజలీదేవిగారి మరణం చిత్రపరిశ్రమకు తీరని లోలు. నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘తాత-మనవడు’లోని అమ్మ పాత్రను అద్భుతంగా పోషించి ఆ సినిమా అపూర్వ విజయం సాధించడానికి తానూ ఓ కారణం అయ్యారు. ఇక అప్పటి నుంచి నేను దర్శకత్వం వహించిన చిత్రాల్లో 25కి పైగా ఆమె నటించారు. తెలుగు చిత్రరంగంలో కొన్ని తరాలకు ప్రతినిధిగా ఆమె పోషించని పాత్రంటూ లేదు. హీరోయిన్‌గా, అమ్మగా, అక్కగా, చెల్లిగా... ఇలా ఎన్నో విభిన్న పాత్రలను పోషించారామె. ‘లవకుశ’ చిత్రంలో పోషించిన సీత పాత్రతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’.  
- డాక్టర్ దాసరి నారాయణరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement