ఇంటింటి రాట్నం
గిర్రుమని తిరుగుతుంది రంగులరాట్నం.గిర్రుమని తిరుగుతాయి... కళ్లలో నీళ్లు.ఒకసారి ప్రేమ పైనుంటుంది.మరోసారి పగ పైనుంటుంది.కానీ ఈ జీవితరాట్నం... తిరిగినంతసేపూ ఏదీశాశ్వతంగా పైన ఉండదు అని అర్థం అవుతుంది.మన ఇళ్లల్లో కూడా ఇలాంటి తల్లి, తండ్రి,అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, కొడుకులు కోడళ్లు, వాళ్ల ఆత్మీయతలు, అపార్థాలు, మనస్పర్థలు కనబడతాయి.సినిమాలో చివరికి రాజకీయం ఓ పెద్ద ఘట్టంలాకనబడుతుంది. కానీ సినిమా అంతటా కుటుంబంలో ఉన్న రాజకీయం కీలక పాత్ర పోషిస్తుంది.ఎవరూ చెడ్డవాళ్లు కాదు. అందరూ మంచివాళ్లే.కానీ ఒకరికొకరు ఎల్లవేళలా మంచివాళ్లు కాదు.అది.. ఈ రంగులరాట్నం మనందరికీ తిరుగులేకుండా చెప్పేది.మనల్ని తిరిగి తిరిగి ఆలోచించేలా చేసేది. ‘తల్లీ, తరతరాలుగా మా కుటుంబాన్ని చల్లగా చూశావ్. ఈనాడు కాని దేశాలకు ప్రయాణం చేయిస్తున్నావ్. మమ్మల్ని ఒక కంట కనిపెట్టి కాపాడే భారం నీదే తల్లి’.గ్రామదేవతను వేడుకుంది అంజలీదేవి. అమె భర్త సుందర్రామయ్య (కృష్ణమూర్తి), పెద్ద కొడుకు సూర్యం (రామ్మోహన్), చిన్న కొడుకు వాసు (చంద్రమోహన్), కూతురు జయ (విజయనిర్మల).. అంతా దేవతకు దండం పెట్టుకున్నారు.ఒకప్పుడు పదిలక్షల ఆస్తికి వారసుడైన సుందర్రామయ్య వాటాలో ఇప్పుడు అప్పులు పోగా మిగిలిన ఆస్తి మూడెకరాలు. ఆ మూడెకరాలను అమ్ముకుని, పిల్లలకైనా చదువు చెప్పించుకుని ప్రయోజకులను చేద్దామన్న ఆశతో భార్యాబిడ్డల్ని తీసుకుని పట్టణానికి బయల్దేరాడు.
శ్రీ మోహన విలాస్ కాఫీ హోటల్‌లో వాడుకగా నూనె డబ్బాలు వేస్తున్నాడు సుందర్రామయ్య. సడన్‌గా ఆ హోటల్ యజమాని దివాలా తీశాడు. సుందర్రామయ్యకు కుప్పకూలిపోయి, గుండెపోటుతో చనిపోయాడు. కుటుంబ భారం అంజలీదేవిపై పడింది.
‘సీతమ్మా.. మన ఊరొచ్చెయ్’ అన్నారు బంధువులు. అంజలీదేవికి భర్త మాటలు, సూర్యపై ఆయన పెట్టుకున్న ఆశలు గుర్తొచ్చాయి.
‘రాను. నేను ఈ ఊరు విడిచి రాను. ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ ఊరు వచ్చారో... అది నెరవేరి తీరాలి. అది నెరవేరి తీరాలి’ అంది.
భర్త ఆశయం ప్రకారం అక్కడే ఉండి సూర్యాన్ని లాయర్‌ని చేయాలని తీర్మానించుకుంది. అందుకోసం ఎంత కష్టాన్నయినా భరించాలనుకుంది. పాలు అమ్ముతోంది. దోసెలు పోస్తోంది.
సూర్య చక్కగా చదువుకుంటున్నాడు. కానీ తల్లిపడే కష్టమే తెలియడం లేదు. వాసు చదువుకుంటూనే, తల్లి కష్టానికి చేదోడుగా ఉంటున్నాడు. వాసుకు స్పోర్ట్స్‌లో, కుస్తీ పోటీల్లో బోలెడన్ని కప్పులు, మెడల్స్! వాటన్నిటినీ ప్రాణ సమానంగా చూసుకుంటున్నాడు. వ్యాయామశాల ప్రొఫెసర్ శంకర్రావుకు వాసు ప్రియశిష్యుడు. వాళ్ల అమ్మాయికి (పెద్దయ్యాక వాణిశ్రీ) వాసు అంటే అభిమానం.
అంజలీదేవి కష్టపడుతోంది. దగ్గుతూ వాకిలి ఊడుస్తోంది. దగ్గు ఎక్కువైంది. జ్వరం వచ్చింది. పని చేయలేకపోతోంది.
సూర్య తల్లిదగ్గరకు వచ్చాడు. ‘అసలీ దోసెలు వ్యాపారం వల్లే నీకు జ్వరం వచ్చింది. మీ అమ్మ దోసెలు అమ్ముతోందని అంతా నన్ను ఎగతాళి చేసేవారే’ అన్నాడు. ‘నీకోసం ఈ దోసెల వ్యాపారమే కాదు, ఇంటింటా ముష్టెత్తమన్నా సంతోషంగా చేస్తానయ్యా.. సూరీ’ అంది ఆ అమ్మ. పరీక్ష ఫీజు 50 రూపాయలు రేపే కట్టాలన్నాడు సూర్య. పాతబాకీ కోసం ఎన్నాళ్లని తిరగనూ అన్నాడు అప్పులిచ్చిన కిట్టయ్య అప్పుడే వచ్చి. ‘రేపట్లోగా 150 చెల్లించాలి. లేకుంటే చెంబూ తపేళా పడేస్తాను’అన్నాడు కిట్టయ్య. ‘అంతవరకు రానివ్వను. ఎలాగైనా డబ్బు తెస్తాను’ అన్నాడు వాసు. అన్నట్టే డబ్బు తెచ్చాడు! ‘ఎక్కడిదిరా ఇంత డబ్బు?’... అన్న అడిగాడు. ‘నువ్వేం కంగారు పడకు ఎక్కడా కన్నం వేయలేదులే’.. తమ్ముడు చెప్పాడు. ‘ఇంత డబ్బు ఎక్కడ తెచ్చావురా’.. అమ్మ భయంగా అడిగింది. ‘కప్పులు, మెడల్స్ అమ్మేశాను’ ఏడుస్తూ చెప్పాడు. ‘వాసూ... నా చిట్టి తండ్రీ... ఊరుకో’ అంది అమ్మ.
సూర్య లాయర్ అయ్యాడు. మున్సిపల్ చైర్మన్ అప్పలస్వామి (రమణారెడ్డి) సూర్యను తన అల్లుడిగా చేసుకోవాలనుకున్నాడు. లాయర్ అండ ఉంటే తన అక్రమ వ్యాపారాలు సక్రమంగా సాగుతాయని అతడి ప్లాన్. అన్నకొడుకు సుబ్బారాయుడి చేత కూతురికి చెప్పించాడు... సూర్యను చేసుకుంటే వచ్చే లాభం ఏమిటో. ఆమె కూడా తన లాభం తను చూసుకుంది. పెళ్లికి ముందు అతనితో కొన్ని షరతులు మాట్లాడాలి అంది.
నా వ్యక్తిత్వానికి భంగం రాకూడదు. నేచెప్పినట్లు అతను నడుచుకోవాలి. అతను మనింట్లో ఉండాలే కానీ వాళ్లింటికి నేను వెళ్లను. అత్త ఆడబిడ్డ నా చెప్పుచేతల్లో ఉండాలి. నాకు తెలీకుండా వాళ్ల బంధువులెవరూ మనింటికి రాకూడదు. సపోజ్ వచ్చారనుకో... మనం చెప్పినట్లు నడుచుకోవాలి. కోర్టులో ఎన్ని పనులున్నా రోజూ క్లబ్బులకి, సినిమాలకి నాతో రావాలి. ఈ షరతులన్నిటికీ అతను ఒప్పుకుంటాడేమో కనుక్కో అంది. కనుక్కోనవసరం లేదన్నాడు సుబ్బారాయుడు.
అక్కణ్ణుంచి సూర్య దగ్గరకు వెళ్లాడు. ‘వనజ మా బాబాయికి ఒక్కతే కూతురు. బోలెడంత ఆస్తి. చచ్చేటంత పలుకుబడి. మరో రహస్యం. ఈ రోజుల్లో మగాడు పైకి రావాలీ అంటే పెళ్లాం ఫార్వార్డ్ అండ్ ఫ్యాషనబుల్‌గా ఉండాలి. మా వనజలాంటి పెళ్లామే ఉంటే నీకు ఏనాటికైనా విదేశీ యాత్ర. ఏమంటావ్’ అన్నాడు. ఏమంటాడు? ఒకే అన్నాడు సూర్య. అమ్మను కూడా ఒప్పించాడు. పెళ్లయిపోయింది. అప్పలస్వామి హ్యాపీ. సూర్యం, అతడి భార్య, తల్లి, తమ్ముడు, చెల్లి వేరే కొత్తింట్లోకి షిఫ్ట్ అయ్యారు. ఇంకో ట్రాక్‌లో సూర్య చెల్లికి, ఆమె స్నేహితురాలు అన్నయ్య అయిన వేణుకి మనసులు కలిసాయి. మరో ట్రాక్‌లో చంద్రమోహన్‌కి, ప్రొఫెసర్ శంకర్రావు కూతురు వాణీశ్రీకి మధ్య ప్రేమ.
కోటీశ్వరుడి కొడుకైన వేణుతో విజయనిర్మల పెళ్లి జరిగింది. మెట్టినింటికి వెళ్లిపోయింది. తన భర్త ఫొటోని స్టోర్ రూమ్‌లో పడేయడంతో కలత చెందిన అంజలీదేవి కూడా ఇల్లొదిలి వెళ్లి చిన్న కొడుకు చంద్రమోహన్ దగ్గర ఉంది. చంద్రమోహన్ ఉండేది తన గురువుగారి దగ్గర పార్క్ వీధి ఇంట్లో.
మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. వాసుని కన్విన్స్ చేసి అతడి చేత నామినేషన్ వేయించారు గురువు శంకర్రావు దగ్గరుండే అతడి శ్రేయోభిలాషులు.అప్పలస్వామి మీద అదే వార్డుకి నిలబడ్డాడు వాసు. అప్పలస్వామి, సుబ్బరాయుడు. ఐడియా వేశారు. వాసు మీదకి అతడి అన్న సూర్యాన్ని పోటీగా నిలబెట్టారు. ‘సూర్యం నెగ్గితే మనం నె గ్గినట్టే. సూర్యం ఓడితే ఇక అన్నదమ్ములు మొహమొహాలు చూసుకోరు. ఇక ఆ దెబ్బతో వాసుగాడి పీడా విరగడైపోతుంది’ ఇదీ పథకం. ‘‘అమ్మా... అన్నయ్యల మధ్య ఈ పోటీ ఆపాలమ్మా. అన్నయ్యలిద్దరూ తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. దెబ్బలాట కూడా జరగొచ్చంటున్నారు. నాకేదో భయంగా ఉందమ్మా’ అంది విజయనిర్మల. ‘భయపడి చేసేదేముందమ్మా... ఇది అన్నదమ్ముల మధ్య పోటీ కాదు. భగవంతుడు నాకు పెట్టిన పరీక్ష అని ఆ తల్లి హృదయం ఆక్రోశించింది. వాసు గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఆఖరి నిమిషంలో రమణారెడ్డి మరో పథకం వేశాడు. సూర్యం చేత తల్లికి చెప్పించి ఎన్నికల నుంచి వాసు ఉపసంహరించుకునేలా చేశాడు. ‘ఈ ఎలక్షన్ నుంచి వాసు తప్పుకుంటాడు’ అని చంద్రమోహన్ గురువు ప్రకటించాడు. సూర్య ఏకగ్రీవం అయ్యాడు. మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యాడు.మిగిలింది చంద్రమోహన్, వాణిశ్రీల పెళ్లి. ముహూర్తం రోజు రానే వచ్చింది. చంద్రమోహన్, వాణిశ్రీల పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లికి సూర్యం రాలేదు. నోటీసులు వచ్చాయి! శంకర్రావు ఇల్లు జప్తు. పార్క్ లెసైన్సు రద్దు. ఇదీ సారాంశం. పెళ్లయిపోయింది. నోటీసులు చూసి గురూజీ కుప్పకూలిపోయాడు. ‘వాడు మనిషో, రాక్షసుడో ఇప్పుడే తెలుస్తాని అని అన్న దగ్గరికి బయల్దేరాడు వాసు. ‘మీ పాదాల పట్టుకుని ప్రమాణం చేసి చెప్తున్నాను. పార్క్ నోటీసు రద్దన్నా కావాలి. లేదా మా అమ్మకు ఒక్కడే కొడుకు మిగలాలి’ అని బయల్దేరాడు. అతడి వెనకే జనం. అన్నదమ్ములిద్దరూ కొట్టుకుంటున్నారు. రక్తాలు కారుతున్నాయి. తల్లి పరుగెత్తుకొచ్చింది. సూర్య విసిరిన టీపాయ్ తల్లి తలకు తగిలింది. ఆమె నేలపై ఒరిగిపోయింది. సూర్యంలో పరివర్తన మొదలైంది. కొడుకులిద్దరి రక్తాన్ని చూసి ఆ తల్లి దుఃఖించింది. ఈ ఘోరం చూడ్డానికేనా నన్ను బ్రతికించావు అని దేవుడిని అడిగింది.
‘ఈ పాపమంతా నాదేనమ్మా,. నిన్ను గాయపరిచిన ఈ చేతులు... ’ అంటూ రోదిస్తున్నాడు సూర్యం. ‘ఇది ఏపాటి గాయం నాయనా. ద్వేషాలతో, ఈర్ష్యలతో, స్వార్థాలతో, స్వాభిమానాలతో, పగలతో, ప్రతీకారాలతో, పశుప్రాయులై ఏనాడు మీ బ్రతుకును నరకంగా చేసుకున్నారో ఆ నాడే మీ తల్లి హృదయం గాయపడింది నాయనా... ’‘అమ్మా... నన్ను క్షమించమని కోరే అర్హత కూడా లేకుండా చేసుకున్నానమ్మా’ ఏడుస్తున్నాడు సూర్యం. ‘ఈ క్షణం నుంచి నీ పలుకే నాకు వేదవాక్కు. నీ పాదాలకు ప్రమాణం చేస్తున్నానమ్మా. ఆజ్ఞాపించమ్మా..’ అన్నాడు సూర్యం. ‘తల్లి తనకోసం ఏం కోరుతుంది నాయనా. ఏది కోరినా తన బిడ్డల కోసం. వాళ్ల ఆనందం కోసం. ముగ్గురు బిడ్డలను కన్న మీ తల్లి మొదలు 40 కోట్ల ప్రజలను కన్న భరతమాత వరకు ఏ తల్లయినా మనసారా వాంఛించేది ఒక్కటే. తన బిడ్డల అభ్యున్నతి. వాళ్ల ఆనందం. ఐకమత్యం. అన్యోన్యత’ అంది తల్లి.
అదే ఊరు. అదే గ్రామదేవత. ఆమె ఆశీర్వాదం కోసం ఈ తల్లీ కొడుకులు ఆ దేవత ఎదుట నిలుచుని ఉన్నారు.మళ్లీ అదే పాట.. ‘కలిమి నిలవదు.. లేమి మిగలదు.. కలకాలం ఒక రీతి గడవదు. ఇంతేరా ఈ జీవితం.. తిరిగే రంగుల రాట్నము’
సినిమా ఎండ్.
పాటలు
1. నడిరేయి ఏ జాములో స్వామి నినుచేరదిగివచ్చునో...
2. కనరాని దేవుడే కనిపించినాడే
3. వెన్నెల రేయి చందమామ వెచ్చగ ఉన్నది మావా
4. కోయిల కోయ్ అని పిలిచినది... ఓయ్ అని నా మది పలికినది.
5. కన్నుల దాగిన అనురాగం మన పెదవులకందని నవరాగం
నటీ నటులు
అంజలీదేవి (సీతమ్మ)
చంద్రమోహన్ (వాసు), రామ్మోహన్ (సూర్య)
వాణిశ్రీ (జమునారాణి), సుకన్య (సూర్య భార్య)
రమణారెడ్డి (అప్పలస్వామి)
పుష్పవల్లి (అప్పలస్వామి భార్య)
కృష్ణమూర్తి (సుందర్రామయ్య)
విజయనిర్మల (సూర్య, వాసుల చెల్లెలు)
త్యాగరాజు (వస్తాదు శంకర్రావు)
వివరాలు-విశేషాలు
విడుదల: 1966
దర్శకత్వం: బి.ఎన్.రెడ్డి
సంగీతం: ఎస్.రాజేశ్వర్రావు, బి.గోపాలం
మాటలు: డి.వి.నరసరాజు
నేపథ్యగానం: ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, ఎస్. జానకీ తదితరులు
పాటలు: కొసరాజు, దాశరథి,
సి.నారాయణరెడ్డి