మోడరన్ అమ్మలు..గ్లామరస్ అత్తలు..! | old heroines are play role Mother character | Sakshi
Sakshi News home page

మోడరన్ అమ్మలు..గ్లామరస్ అత్తలు..!

Published Mon, Feb 17 2014 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM

old heroines are play role Mother character

 కన్నాంబ, రుష్యేంద్రమణి, శాంతకుమారి, సూర్యకాంతం, హేమలత... ఒకప్పటి సినీ స్వర్ణయుగంలో అమ్మ పాత్రయినా, అత్త పాత్రయినా వాళ్లు చేయాల్సిందే! ఆ తర్వాత అంజలీదేవి, సావిత్రి, నిర్మలమ్మ, శారద, వాణిశ్రీ, అన్నపూర్ణ, శ్రీవిద్య లాంటి మేటి తారలు అమ్మలుగా, అత్తమ్మలుగా  వెండితెరను అలరించారు. వీరిలో కొందర్ని మినహాయిస్తే.. మిగిలిన అందరూ తొలుత వెండితెరపై నాయికలుగా వెలిగినవారే. అయితే.. అమ్మ పాత్రల్లోకి టర్న్ అయ్యాక వారి దృక్కోణంలో మార్పొచ్చింది.
 
వారి ఆలోచనంతా... ఆయా పాత్రల ఔచిత్యంపైనే. దానికి తగ్గట్టే బిహేవ్ చేసేవారు. వారి దృష్టిలో అక్కడ అందానికి స్థానం లేదు. అయితే... పోనుపోనూ జనరేషన్‌లో మార్పొచ్చింది. దానికి తగ్గట్టే దర్శకుల ధోరణి కూడా మారింది. అందం హీరోయిన్లకేనా? అమ్మలు, అత్తమ్మలు అందంగా ఉండకూడదా? అనే కొత్త వాదన వెలుగులోకొచ్చింది. ఇంకేముంది... మోడరన్ అమ్మలు, గ్లామరస్ అత్తల ట్రెండ్ మొదలైంది.
 
 వెండితెరపై ఓ రేంజ్‌లో గ్లామర్‌ని ఒలికించిన కథానాయికలందరూ తమ ఇన్నింగ్స్ ముగిశాక.. గ్లామర్ మదర్స్‌గా కనిపించడం మొదలుపెట్టారు. గ్లామర్ మదర్స్ అంటే మొన్నటిదాకా లక్ష్మి, జయప్రద, జయసుధ, సుహాసిని, భానుప్రియ, రమ్యకృష్ణ, శరణ్య, దేవయాని, ప్రగతి, కుష్బూ, రోజా.. తదితర కథానాయికల  పేర్లే వినిపించేవి. అయితే.. సినిమాను ఎప్పటికప్పుడు ఫ్రెష్‌లుక్‌లో ప్రెజెంట్ చేయాలని తపించే కొంతమంది దర్శకులు... కథానాయికల విషయంలోనే కాక, నయా ఆంటీల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండటం మొదలుపెట్టారు. 
 
 కొత్తనీరు రావడం, పాతనీరు కొట్టుకుపోవడం కామనే కదా! పైగా ‘అత్తారింటికి దారేది’తో ఆంటీ పాత్రలకు అమాంతం క్రేజ్ వచ్చేసింది. మోడ్రన్ మదర్‌గా నదియా అందరికంటే ముందు వరుసలో నిలబడ్డారు. సినిమాకు యాభై లక్షల రూపాయలు పైనే వసూలు చేస్తూ... అత్త పాత్రలకు కొత్త పాపులార్టీ తీసుకొచ్చారు. మరి నదియాకు ప్రత్యామ్నాయం ఎవరు? ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఇదే చర్చ.  ఆ చర్చకు తెరదించుతూ... మేమున్నామంటూ నలుగురు నయా ఆంటీలు ముందుకొచ్చారు. వారే...  మీనా, రవీనా టాండన్, సిమ్రాన్, పూర్ణిమ.
 
 తెలుగుతెరపై మీనాది ఓ శకం అంటే తప్పేం కాదు. అగ్రహీరోలందరితో జతకట్టడమే కాక, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి సత్తా చాటారు మీనా. దాదాపు పదిహేనేళ్ల పాటు కథానాయికగా కొనసాగిన మీనా.. 2009లో వివాహం చేసుకున్నారు. తెలుగులో కథానాయికగా ఆమె చివరి సినిమా ‘తరిగొండ వెంగమాంబ’. పెళ్లి తర్వాత కూడా చిన్నాచితకా పాత్రలు పోషించినా... పూర్తిస్థాయిలో మాత్రం నటనపై దృష్టి పెట్టలేదు. అయితే... మలయాళంలో మోహన్‌లాల్‌తో నటించిన ‘దృశ్యం’ చిత్రం ఆమె ఆలోచనా ధోరణిలో మార్పు తెచ్చింది. ఇక నుంచి గ్లామర్ మదర్‌గా రాణించాలని మీనా భావిస్తున్నట్లు సమాచారం. ‘దృశ్యం’ తెలుగు రీమేక్‌లో వెంకటేష్‌కు జోడీగా, మాతృకలో పోషించిన పాత్రనే పోషిస్తున్నారు మీనా. పెళ్లీడొచ్చిన ఇద్దరు పిల్లలకు తల్లిగా ఇందులో కనిపిస్తారామె. పైగా మీనా, వెంకటేష్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం... ఇలా అన్నీ వందరోజుల సినిమాలే. మళ్లీ ఈ సినిమాతో మీనా సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 
 
 ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రంతో మళ్లీ తెలుగుతెరపై తళుక్కున మెరిశారు రవీనా టాండన్. ఒకప్పుడు రవీనా అంటే యువతరం గుండె చప్పుడు. బాలీవుడ్ తెరపై ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బంగారుబుల్లోడు, ఆకాశవీధిలో, రథసారధి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారామె. ఇన్నాళ్ల తర్వాత కూడా తరగని అందంతో ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో కనిపించారు. ఆ గ్లామర్‌లో ఏ మాత్రం వన్నె తగ్గలే దని ఇక్కడి యువతరం కితాబులు ఇచ్చేశారు కూడా. తెలుగులో మంచి పాత్రలు చేయాలని ఉందని ఇటీవల మీడియా సాక్షిగా చెప్పారు. అంటే, త్వరలో నయా ఆంటీగా రవీనా హవా మొదలవ్వబోతోందన్నమాట. 
 
 సిమ్రాన్ కూడా అమ్మగా, అత్తమ్మగా కనిపించడానికి రెడీ అయిపోయారు. 2009లో బాలయ్యతో కలిసి ‘ఒక్కమగాడు’లో నటించినా... సిమ్రాన్‌కి పెద్దగా కలిసిరాలేదు. కృష్ణభగవాన్‌తో ‘జాన్ అప్పారావు 40 ప్లస్’ చేశాక మళ్లీ తెలుగులో నటించలేదు సిమ్రాన్. అయితే... ప్రస్తుతం నడుస్తున్న గ్లామర్ ఆంటీల ట్రెండ్‌ని దృష్టిలో పెట్టుకొని తాను కూడా అందాల అంటీగా కనిపించడానికి రెడీ అయిపోయారు. నాని హీరోగా రూపొందుతోన్న ‘ఆహా కళ్యాణం’ సినిమాతోనే ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు. మున్ముందు అంతా తన హవానే అని ధీమాగా చెబుతున్నారు సిమ్రాన్. 
 
 ఇక పూర్ణిమ వీళ్లందరికంటే కాస్త సీనియర్. ముద్దమందారం, నాలుగుస్థంభాలాట, ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య, మా పల్లెలో గోపాలుడు... ఈ చిత్రాలను తలచుకుంటే... ముందు గుర్తొచ్చేది పూర్ణిమే. గ్లామర్ తారగా కంటే... నటిగానే ఎక్కువగా ప్రేక్షకాభిమానాన్ని పొందారు తను. ఆమె కూడా ఇప్పుడు గ్లామర్ మదర్‌గా కనిపించడానికి సిద్ధం అవుతున్నారు. పెళ్లయ్యాక... చాలాకాలంగా తెరకు దూరంగా ఉన్న పూర్ణిమ... ‘గ్రాడ్యుయేట్’, ‘తొలిసారిగా’, ‘మిస్టర్ లవంగం’, ‘33 ప్రేమకథలు’, ‘ఉందిలే మంచికాలం ముందు ముందునా’ తదితర చిత్రాల్లో అమ్మగా చేశారు. మొత్తానికి... ఈ సరికొత్త ట్రెండ్ మన సీనియర్ కథానాయికల సెకండ్ ఇన్నింగ్స్‌కి బాగా కలిసొచ్చింది. హీరోయిన్లతో పోటీపడుతూ గ్లామరస్‌గా కనబడటం వాళ్లకూ సంతోషమే కదా! పేరుకి పేరు... గ్లామర్‌కి గ్లామర్..!
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement