ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూత
కేకే నగర్(చెన్నై): ప్రముఖ సినీ దర్శకుడు ఎన్‌కే.విశ్వనాథన్(75) మంగళవారం రాత్రి 7.30 గంటలకు గుండెపోటుతో మృతిచెందారు. ఆయనకు నటులు కమలహాసన్, సత్యరాజ్, పాండ్యరాజన్, సంగిలి మురుగన్, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి సహా పలువురు సినీ ప్రముఖులు అంజలి ఘటించారు.
చట్టం ఎన్ కైయిల్, కడల్ మీన్‌గల్, మీన్‌డుం కోకిల, సగాదేవన్ మగాదేవన్ వంటి సినిమాలకు కెమెరామెన్‌గా పని చేసిన ఎన్‌కె.విశ్వనాథన్, తరువాత విజయకాంత్ నటించిన పెరియమరుదు, నమితం, వడివేలు నటించిన జగన్మోహిని, రామ్‌కి, నిరోషా నటించిన ఇనైంద కైగల్ వంటి పదికి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.
కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథన్ మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన పార్థివదేహానికి బుధవారం పోరూరులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఆయన మృతికి డీఎండీకే నేత విజయకాంత్ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.