kk nagar
-
దారుణం.. కళాశాల ఎదుటే విద్యార్థిని హత్య
-
మీనాక్షి కాలేజీ విద్యార్థిని దారుణ హత్య
చెన్నై : చెన్నై కేకేనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని మీనాక్షి ఇంజినీరింగ్ కళాశాల గేటు ఎదుటే అశ్విని అనే విద్యార్థినిని ఓ దుండగుడు కత్తితో నరికి చంపారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనకు పాల్పడి... అతడు అక్కడ నుంచి పారిపోతుండగా, స్థానికులు అడ్డుకుని దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళితే...చెన్నై కేకే నగర్‌లోని మీనాక్షి కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్న అశ్విని కాలేజీ ముగియడంతో రోజులాగే ఇంటికి వెళ్లేందుకు గేట్ ముందు వేచి చూస్తోంది. అంతలో అటుగా వచ్చిన ఓ యువకుడు గేటు ముందు నిల్చుని ఉన్న ఆమెపై కత్తితో విచక్షణారహితం పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అశ్విని రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. అదే సమయం పారిపోయేందుకు ప్రయత్నించిన యువకుడిని స్థానికులు పట్టుకుని చితకబాదారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. కాగా స్థానికుల దాడితో తీవ్రంగా గాయపడిన దుండగుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఆ ఇల్లు గిన్నిస్ రికార్డులకు నిలయం
సాక్షి, కేకే.నగర్: ఊర్లో ఒక గిన్నిస్ రికార్డు సాధించిన వారు ఉండటం చాలా అరుదు. అయితే ఒకే ఇంట్లో ముగ్గురు ప్రపంచ రికార్డు గ్రహీతలు కావడం ఎవరినైనా ఆశ్చర్యంలో ముంచెత్తడం ఖాయం. రామనాధపురం ముత్తు రామలింగ స్వామి ఆలయంలో వెంకట్రామన్ అర్చకుడిగా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అతని కుమారులు సుందరం, శంకర్ నారాయణన్, కుమార్తె రమ వీళ్లు గిన్నిస్ రికార్డు సాధకులు. వీరి సాధనాల గురించి తెలుసుకుందాం. అడైకలంకాత్త వినాయక స్వామి ఆలయంలో అర్చకుడిగా ఉన్న సుందరం గత 2009న కూల్ డ్రింక్స్ తాగే 398 స్ట్రాలను ఒకేసారి నోటితో పట్టుకుని గిన్నిస్ రికార్డు సాధించాడు. నోట్లో స్ట్రాల్ గుచ్చుకుని రక్తం రావడం, పుండు అవ్వడంతో కొంత కాలం విరామం ఇచ్చి తిరిగి ప్రాక్టీస్ చేసేవాడు. సుందరం కంటే ముందు జర్మన్ దేశానికి చెందిన సైమన్ ఎల్మోర్ 364 స్ట్రాలను నోట్లో ఉంచుకుని రికార్డు సాధించాడు. సుందరం తమ్ముడు శంకర నారాయణన్ ఎమ్ఇ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివి కృష్ణాలయంలో అర్చకుడిగా ఉన్నారు. రకరకాలైన 736 టీ, జ్యూస్ కప్పులను సేకరించి గిన్నిస్ రికార్డు సాధించాడు. దీని కోసం పరమకుడి, తిరుపతి, కొడైకైనాల్, కేరళ, తదితర ప్రాంతాలకు వెళ్లి వాటిని సేకరించినట్లు ఆయన తెలిపారు. శంకర నారాయణన్ అనే వ్యక్తి గతంలో2008 వెలుగుతున్న 151 క్యాండిళ్లను నోటితో ఒకేసారి ఊది ఆర్పేయడంతో రికార్డును సొంతం చేసుకున్నాడు. కానీ వీరి చెల్లెలు రమ ఎమ్సీఏ చదివింది. ఈమె గత 2010వ సంవత్సరంలో 549 రకాల హేర్ క్లిప్పులను సేకరించి గిన్నిస్, లిమ్కా రికార్డులు సాధించింది. ఒకే కుటుంబంలో ముగ్గురు గిన్నిస్ రికార్డు సాధించారు. పిల్లలు ఆ రికార్డులు సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
22 ఏళ్ల తర్వాత ఆలయంలో కుంభాభిషేకం
కేకేనగర్ : అరియలూర్‌లో 22 సంవత్సరాల తర్వాత కోదండరామస్వామి పెరుమాల్ ఆలయంలో బుధవారం కుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఈ అభిషేకంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. అరియలూర్ పెరుమాళ్ కోవిల్ వీధిలో 380 సంవత్సరాల ఘన చరిత్ర గల పురాతన ప్రసిద్ధి చెందిన కోదండ రామస్వామి పెరుమాళ్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో 1995వ సంవత్సరంలో కుంభాభిషేకం జరిగింది. అనంతరం 22 సంవత్సరాల తర్వాత మహా కుంభాభిషేకం బుధవారం జరిగింది. ఈ ఆలయంలో కోదండరామస్వామి సన్నిధి, అమ్మన్ సన్నిధి, అయ్యప్పన్, గరుడాళ్వార్, ఆంజనేయ స్వామి వార్ల సన్నిధులు ఉన్నాయి. ఆలయ జీర్ణోద్ధరణ పనులు ముగిసిన నేపథ్యంలో ఆలయ కుంభాభిషేకం బుధవారం ఉదయం 6 గంటలకు జరిగింది. వేదపండితులు వేద మంత్రాల నడుమ కలశాలపై పుణ్య జలాలు పోసి అభిషేకం చేశారు. ఆ సమయంలో భక్తులు గోవిందా.. గోవిందా అనే భక్తి నినాదాలు అంబరాన్ని అంటాయి. అనంతరం పుణ్య జలాలను భక్తులపై చల్లారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ పెరుమాల్ స్వామి వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన రధంలో కొలువుదీరి నడు అగ్రహారం, మేల్ అగ్రహారం, పొన్ను స్వామి, అరన్మలై వీధి, కైలాశనాధర్ ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు చల్లని దీవెనలు అందించారు. అడుగడుగునా స్వామి వారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. -
మాజీ సీఎం మద్దతుదారుడి దారుణ హత్య
►ఎంజీఆర్ నగర్లో ఘాతుకం – ఉద్రిక్తత ►పోలీసుల మోహరింపు ►ఐదుగురి అరెస్టు కేకేనగర్: చెన్నై ఎంజీఆర్ నగర్లో నివసిస్తున్న ఓపీఎస్ వర్గ నిర్వాహకుడిని 2వ అంతస్తు నుంచి కిందకు లాక్కొచ్చి నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన సంఘటన ఆ ప్రాంతంలో దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ హత్యకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంజీఆర్ నగర్ సూలై పల్లం అన్నా వీధికి చెందిన కుమార్ అలియాస్ చిన్నకుమార్ (39). ఇతడు అన్నాడీఎంకేలో 137వ వార్డు అన్నాడీఎంకే సహాయ కార్యదర్శిగా పదవి వహించాడు. జయలలిత మృతి తర్వాత జె. దీపా వర్గంలో కుమార్ చేరారు. శశికళ నుంచి ఓపీఎస్ విడిపోయిన తర్వాత ఓ పన్నీర్ సెల్వంకు సన్నిహిత మద్దతుదారుడిగా మారాడు. ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఆదివారం రాత్రి 11 గంటలకు కుమార్ తన ఇంట్లో భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో ఐదుగురు అతని ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో చిన్నకుమార్పై దాడి జరిపారు. రెండవ అంతస్తు నుంచి అతడిని బరబరా లాక్కొని వచ్చి ఇంటి ముందు నిలబెట్టి దారుణంగా నరికారు. రక్తం మడుగులో పడి ఉన్న కుమార్ మృతి చెందాడని వారు పారిపోయారు. ప్రాణాలతో పోరాడుతున్న అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎంజీఆర్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో చిన్నకుమార్, అతని మిత్రుడు శ్రీనివాసన్ అను అతనికి రియల్ ఎస్టేట్ వ్యాపార పోటీలో ఏర్పడిన పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ హత్యకు సంబంధించి చెన్నై సమీపంలో గూడువాంజేరికి చెందిన శ్రీనివాసన్ (40), మణి (20), మది (20), రోజా (22), బాలకృష్ణన్లను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. -
ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూత
కేకే నగర్(చెన్నై): ప్రముఖ సినీ దర్శకుడు ఎన్కే.విశ్వనాథన్(75) మంగళవారం రాత్రి 7.30 గంటలకు గుండెపోటుతో మృతిచెందారు. ఆయనకు నటులు కమలహాసన్, సత్యరాజ్, పాండ్యరాజన్, సంగిలి మురుగన్, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి సహా పలువురు సినీ ప్రముఖులు అంజలి ఘటించారు. చట్టం ఎన్ కైయిల్, కడల్ మీన్‌గల్, మీన్‌డుం కోకిల, సగాదేవన్ మగాదేవన్ వంటి సినిమాలకు కెమెరామెన్‌గా పని చేసిన ఎన్‌కె.విశ్వనాథన్, తరువాత విజయకాంత్ నటించిన పెరియమరుదు, నమితం, వడివేలు నటించిన జగన్మోహిని, రామ్‌కి, నిరోషా నటించిన ఇనైంద కైగల్ వంటి పదికి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథన్ మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన పార్థివదేహానికి బుధవారం పోరూరులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఆయన మృతికి డీఎండీకే నేత విజయకాంత్ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
ర్యాగింగ్ వేధింపులకు విద్యార్థిని బలి
కేకే.నగర్(చెన్నై): ర్యాగింగ్ వేధింపులకు ఓ విద్యార్థిని బలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల కథనం మేరకు.. తమిళనాడు, నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలోని చిన్నకరుంపాళం ప్రాంతానికి చెందిన రాజా, జయలక్ష్మి దంపతుల కుమార్తె ప్రీతి(17). ఈరోడ్ జిల్లా సత్యమంగళం ప్రైవేటు కళాశాలలో సీఏ కోర్సులో గత నెల 22న చేరింది. అదే నెల 25న కళాశాల హాస్టల్ గదిలో ఉరివేసుకుని తనువు చాలించింది. ఈ విషయమై ప్రీతి తల్లిదండ్రులు గురువారం సత్యమంగళం పోలీసులు, ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె ఆత్మహత్యకు సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ కారణమని, హాస్టల్లో ఆమెను అన్నం తిననివ్వకుండా, నిద్ర పోనివ్వకుండా హింసించారని, రాత్రి రెండు గంటలకు తల స్నానం చేసి రమ్మని, తడిగుడ్డలతో వానలో నిలబెట్టి చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు. ఈ విషయాలు ఆమె స్నేహితుల ద్వారా తెలిశాయన్నారు. గతనెల 25వ తేదీన చలి, జ్వరం ఉందంటూ హాస్టల్ నిర్వాహకులు ప్రీతిని కోయంబత్తూరు సత్యమంగళం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారని, తాము బయలుదేరిన కొంత సేపటికే హాస్టల్ వార్డెన్ కోయంబత్తూరు వైద్య కళాశాలకు రమ్మని ఫోన్ కట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రీతి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, దీనిపై విచారణ చేయాలని కన్నీటిపర్యంతమయ్యారు. ఆర్డీవో స్పందిస్తూ.. విచారణ కమిటీ వేసి, నిజాలు నిగ్గుతేల్చుతామని హామీ ఇచ్చారు. -
అయ్యో పాపం... స్వతంత్ర అభ్యర్థి
కేకేనగర్: ఓటర్లు జాబితాలో పేరు లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి ఓటు వేయలేక నిరాశతో వెనుదిరిగారు. తిరువోత్తియూర్‌లో చిన్న మేట్టు పాలెయం కు చెందిన త మిళ్ సెల్వన్ ,మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఈయన తిరువోత్తియూర్ నియోజక వర్గంలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సోమవారం ఉదయం తమిళ్‌సెల్వన్ తిరువోత్తియూర్ అవర్లేడి పాఠశాలలో ఓటు వేయడానికి ఓటర్ ఐడితో వెళ్లారు. అక్కడున్న అధికారులు ఓటర్లు జాబితాను చెక్ చేయగా అందులో ఆయన పేరు లేదు. దీంతో తమిళ్ సెల్వన్ ఓటు వేయడానికి అనుమతి లభించలేదు. ఆయననిరాశతో వెనుదిరిగాడు. ఓటరు ఐడి,అభ్యర్థి గుర్తింపు కార్డులను చూపించి తనపేరు లేకుండా ఉంటే అధికారులు తన నామినేషన్‌ను ఎలా స్వీకరించారని ప్రశ్నించారు. తంజావూరులో ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు తంజావూరు నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థి ఓటర్లకు రూ.6 కోట్లు నగదు బట్వాడా చేసాడనే ఫిర్యాదు అందింది. విచారణలో నగదు బట్వాడా చేసినట్లు తెలియడంతో ఎన్నికలను హఠాత్తుగా నిలిపివేశారు. ఈ విషయం తెలియక అనేక మంది ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి నిరాశతో వెనక్కి వెళ్లారు. -
అక్కను కడతేర్చిన తమ్ముడు
కేకే.నగర్: ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను ఇంటిలోకి అనుమతించిన అక్కపై ఆగ్రహంతో ఆమెను హత్య చేసి పారిపోయిన తమ్ముడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రామనాథపురం జిల్లా సాయల్‌కుడి సమీపంలో నోమ్ బహుళం గ్రామానికి చెందిన ముత్తు రామలింగం రైతు. ఇతని భార్య పూంగొడి (45). ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. రెండో కుమార్తె నాగవళ్లి (24). సాయల్‌కుడి సమీపంలో కడుగు సంత సత్రం ప్రాంతంలో వేరే కులానికి చెందిన కన్నన్ (29)ను ప్రేమించి గత ఏడాది వివాహం చేసుకుంది. ఈ వివాహానికి నాగవల్లి తల్లిదండ్రులు వ్యతిరేకత తెలిపారు. కన్నన్ ఇంటిలో వీళ్ల ప్రేమను ఒప్పుకున్నారు. పెళ్లి తరువాత కన్నన్ నాగవల్లి కడుగు సత్రంలో నివసించేవారు. నాగవల్లికి కొంత కాలం కిందట ఆడపిల్ల పుట్టింది. మనువరాలు పుట్టిన సంగతి తెలిసి పూంగొడి ఆనందపడింది. కూతురిపైన కోపం మరచిపోయి నాగవళ్లిని, బిడ్డను ఇంటికి పిలుచుకుని వచ్చింది. భార్య, బిడ్డను చూడడానికి కన్నన్ తరచూ అత్తగారింటికి వచ్చి వెళ్లేవాడు. ఇదిలా ఉండగా నాగవల్లిని చూడడానికి మదురైలో నివసిస్తున్న పూంగొడి తమ్ముడు మణి శుక్రవారం అక్క ఇంటికి వచ్చాడు. లేచిపోయిన కూతురిని మళ్లీ ఎందుకు ఇంటికి తీసుకొచ్చావ్ అంటూ అక్క పూంగొడితో ఘర్షణకు దిగాడు. చుట్టు పక్కల వారు అతడిని సమాధానపరచి పంపారు. ఈ సంఘటన వలన ఆగ్రహం చెందిన మణి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఇంటిలో నిద్రిస్తున్న పూంగొడిని కత్తితో పొడిచి చంపాడు. కేకలు విని అడ్డుకున్న నాగవళ్లిని కత్తితో పొడిచాడు. రక్తం మడుగులో పడి గిలగిల లాడుతూ పూంగొడి మృతి చెందింది. తీవ్ర గాయాలపాలైన నాగవళ్లిని రామనాథపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. సాయలేకుడి పోలీసులు పూంగొడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని రామనాథపురం ప్రభుత్వాసుపత్రికి పంపారు. పరారీ ఉన్న మణి కోసం పోలీసులు గాలిస్తున్నారు.