సాక్షి, కేకే.నగర్: ఊర్లో ఒక గిన్నిస్ రికార్డు సాధించిన వారు ఉండటం చాలా అరుదు. అయితే ఒకే ఇంట్లో ముగ్గురు ప్రపంచ రికార్డు గ్రహీతలు కావడం ఎవరినైనా ఆశ్చర్యంలో ముంచెత్తడం ఖాయం. రామనాధపురం ముత్తు రామలింగ స్వామి ఆలయంలో వెంకట్రామన్ అర్చకుడిగా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
అతని కుమారులు సుందరం, శంకర్ నారాయణన్, కుమార్తె రమ వీళ్లు గిన్నిస్ రికార్డు సాధకులు. వీరి సాధనాల గురించి తెలుసుకుందాం. అడైకలంకాత్త వినాయక స్వామి ఆలయంలో అర్చకుడిగా ఉన్న సుందరం గత 2009న కూల్ డ్రింక్స్ తాగే 398 స్ట్రాలను ఒకేసారి నోటితో పట్టుకుని గిన్నిస్ రికార్డు సాధించాడు. నోట్లో స్ట్రాల్ గుచ్చుకుని రక్తం రావడం, పుండు అవ్వడంతో కొంత కాలం విరామం ఇచ్చి తిరిగి ప్రాక్టీస్ చేసేవాడు.
సుందరం కంటే ముందు జర్మన్ దేశానికి చెందిన సైమన్ ఎల్మోర్ 364 స్ట్రాలను నోట్లో ఉంచుకుని రికార్డు సాధించాడు. సుందరం తమ్ముడు శంకర నారాయణన్ ఎమ్‌ఇ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివి కృష్ణాలయంలో అర్చకుడిగా ఉన్నారు. రకరకాలైన 736 టీ, జ్యూస్ కప్పులను సేకరించి గిన్నిస్ రికార్డు సాధించాడు. దీని కోసం పరమకుడి, తిరుపతి, కొడైకైనాల్, కేరళ, తదితర ప్రాంతాలకు వెళ్లి వాటిని సేకరించినట్లు ఆయన తెలిపారు.
శంకర నారాయణన్ అనే వ్యక్తి గతంలో2008 వెలుగుతున్న 151 క్యాండిళ్లను నోటితో ఒకేసారి ఊది ఆర్పేయడంతో రికార్డును సొంతం చేసుకున్నాడు. కానీ వీరి చెల్లెలు రమ ఎమ్‌సీఏ చదివింది. ఈమె గత 2010వ సంవత్సరంలో 549 రకాల హేర్ క్లిప్పులను సేకరించి గిన్నిస్, లిమ్కా రికార్డులు సాధించింది. ఒకే కుటుంబంలో ముగ్గురు గిన్నిస్ రికార్డు సాధించారు. పిల్లలు ఆ రికార్డులు సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment