మాజీ సీఎం మద్దతుదారుడి దారుణ హత్య
►ఎంజీఆర్ నగర్‌లో ఘాతుకం – ఉద్రిక్తత
►పోలీసుల మోహరింపు
►ఐదుగురి అరెస్టు
కేకేనగర్: చెన్నై ఎంజీఆర్ నగర్‌లో నివసిస్తున్న ఓపీఎస్ వర్గ నిర్వాహకుడిని 2వ అంతస్తు నుంచి కిందకు లాక్కొచ్చి నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన సంఘటన ఆ ప్రాంతంలో దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ హత్యకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంజీఆర్ నగర్ సూలై పల్లం అన్నా వీధికి చెందిన కుమార్ అలియాస్ చిన్నకుమార్ (39). ఇతడు అన్నాడీఎంకేలో 137వ వార్డు అన్నాడీఎంకే సహాయ కార్యదర్శిగా పదవి వహించాడు. జయలలిత మృతి తర్వాత జె. దీపా వర్గంలో కుమార్ చేరారు. శశికళ నుంచి ఓపీఎస్ విడిపోయిన తర్వాత ఓ పన్నీర్ సెల్వంకు సన్నిహిత మద్దతుదారుడిగా మారాడు.
ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఆదివారం రాత్రి 11 గంటలకు కుమార్ తన ఇంట్లో భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో ఐదుగురు అతని ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో చిన్నకుమార్‌పై దాడి జరిపారు. రెండవ అంతస్తు నుంచి అతడిని బరబరా లాక్కొని వచ్చి ఇంటి ముందు నిలబెట్టి దారుణంగా నరికారు. రక్తం మడుగులో పడి ఉన్న కుమార్ మృతి చెందాడని వారు పారిపోయారు. ప్రాణాలతో పోరాడుతున్న అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎంజీఆర్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో చిన్నకుమార్, అతని మిత్రుడు శ్రీనివాసన్ అను అతనికి రియల్ ఎస్టేట్ వ్యాపార పోటీలో ఏర్పడిన పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ హత్యకు సంబంధించి చెన్నై సమీపంలో గూడువాంజేరికి చెందిన శ్రీనివాసన్ (40), మణి (20), మది (20), రోజా (22), బాలకృష్ణన్‌లను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.