తమిళసినిమా: నవ్విన నాప చేనే పండుతుందన్న సామెత తెలిసిందే. దీన్ని ఎందరో నిరూపించి చూపించారు. అలాంటి వారిలో నటి విద్యాబాలన్ ఒకరని చెప్పక తప్పదు. ఈ బెంగళూర్ బ్యూటీ ఆదిలో చాలా అవమానాలను ఎదుర్కొంది. నిజానికి విద్యాబాలన్ నటిగా ముందు కోలీవుడ్‌లోనే పరిచయం కావలసింది. అయితే లావు, రంగు వంకతో నువ్వు నటిగా పనికిరావు అని నిరుత్సాహపరచడంతో దాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న విద్యాబాలన్ బాలీవుడ్‌లో పాగా వేసి కథానాయకిగా అవకాశాలను సంపాదించుకుంది. జాతీయ ఉత్తమనటి అవార్డును కూడా అందుకున్న విద్యాబాలన్ గురించి ఇప్పుడు భారతీయ సినిమానే గొప్పగా చెప్పుకుంటోంది.
ఆ మధ్య మణిరత్నం దర్శకత్వంలో గురు చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన విద్యాబాలన్ ఆ తరువాత చాలా అవకాశాలు వచ్చినా అంగీకరించలేదు. ఇకపోతే ఇటీవల టాలీవుడ్‌లో ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలకృష్ణ సరసన నటించిన ఈమె తాజాగా కోలీవుడ్ ప్రేక్షకులను సుదీర్ఘకాలం తరువాత నేర్కొండ పార్వై చిత్రంతో పలకరించడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో నటుడు అజిత్‌కు జంటగా గౌరవ పాత్రలో నటించింది. దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ పింక్‌కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ఆగస్ట్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నటి విద్యాబాలన్ ఒక భేటీలో పేర్కొంటూ ఎవరి శరీర బరువు, ఛాయల గురించి పరిహాసించరాదని అంది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పింది. తాను సినిమా రంగంలోకి ప్రవేశించినప్పుడు చాలా మంది తనను అవమానించేలా మాట్లాడారని చెప్పింది.అలాంటి చర్యలు తన ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టాయని చెప్పింది. బరువు, రంగు వంటివి మనిషి సాధనకు ఎంత మాత్రం కారణం కావన్నది పరిహాసం చేసే వారు తెలుసుకోవాలని నటి విద్యాబాలన్ హితవు పలికింది.
Comments
Please login to add a commentAdd a comment