మారి–2లో మరో నాయకి | Vidya In Dhanush Maari 2 movie | Sakshi
Sakshi News home page

మారి–2లో మరో నాయకి

Published Mon, Jun 18 2018 8:24 AM | Last Updated on Mon, Jun 18 2018 8:24 AM

Vidya In Dhanush Maari 2 movie - Sakshi

తమిళసినిమా: కోలీవుడ్‌ దాటి బాలీవుడ్, హాలీవుడ్‌ వరకూ వెళ్లి నటుడిగా తన సత్తా చాటుకుంటున్న నటుడు ధనుష్‌. చేతిలో చాలా చిత్రాలు ఉన్నా, వేలై ఇల్లా పట్టాదారి–2 చిత్రం తరువాత ఆయన నటించిన చిత్రం విడుదల కాలేదు. దీంతో ఆయన అభిమానులు తదుపరి చిత్రం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇంత వరకూ తన మామ, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నిర్మించిన కాలా చిత్ర నిర్మాణం, విడుదల కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కాలా విడుదల కావడంతో ధనుష్‌ తాజాగా వరుసగా తన చిత్రాలను విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన నటించిన వడచెన్నై, మారి–2 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. మధ్యలో ఆంగ్ల చిత్రం ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌ విడుదలకు సిద్ధం అవుతోంది. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో నటిస్తున్న ఎన్నై నోకి పాయుం తూట్టా చిత్రం ఇంకా నిర్మాణంలోనే ఉంది.

ఈయన తన వండర్‌బార్‌ ఫిలింస్‌ పతాకంపై కథానాయకుడిగా నటించి నిర్మించిన మారి చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్‌ను అందుకుంది. బాలాజీ మోహన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం మారి–2. నటుడు ధనుష్‌నే నిర్మించి నటిస్తున్న ఇందులో నటి సాయిపల్లవి కథానాయకిగా నటిస్తోంది. నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ కీలక పాత్రను పోషిస్తున్న ఇందులో తాజాగా మరో కథానాయకిగా నటి విద్య వచ్చి చేరింది. ఇరవుక్కు ఆయిరం కన్‌గళ్, పంసంగ–2 చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి ధనుష్‌తో మారి–2 చిత్రంలో నటించే లక్కీచాన్స్‌ తలుపుతట్టింది. ఈ విషయాన్ని విద్య తన ట్విట్టర్‌లో పేర్కొంది. నటి సాయిపల్లవి ఈ చిత్రంలో ఆటోడ్రైవర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక వరలక్ష్మీశరత్‌కుమార్‌ కలెక్టర్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు టోవినో థామస్‌ విలన్‌గా, నటుడు కృష్ణ ముఖ్య పాత్రలోనూ నటిస్తున్నారు. ఈ చిత్రం తెన్‌కాశి పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌  జరుపుకుంటోంది. దీనికి యువన్‌శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement