నా మదర్‌ సంస్థలో నటిస్తా! | Vijay Antony about his movies | Sakshi
Sakshi News home page

నా మదర్‌ సంస్థలో నటిస్తా!

Published Sun, Jan 1 2017 3:39 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM

నా మదర్‌ సంస్థలో నటిస్తా!

నా మదర్‌ సంస్థలో నటిస్తా!

ఆదిలో ఒక్క అవకాశం అంటూ దర్శక నిర్మాతల చుట్టూ చెప్పులరిగేలా, కాళ్లు నెప్పులు పుట్టేలా తిరిగిన వారు ఇచ్చిన అవకాశంతో ఎదిగి ఆ తరువాత వారిని గుర్తించుకునేవారెందరు అన్నది ప్రశ్నార్థకమే. అయితే ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు విజయ్‌ఆంటోని లాంటి కొద్ది మంది గతాన్ని మరిచిపోవడానికి చిన్న ఉదాహరణ చెప్పాలి. విజయ్‌ఆంటోని ప్రముఖ సంగీతదర్శకుడు మాత్రమే కాదు, మినిమమ్‌ గ్యారెంటీ కథానాయకుడు కూడా. ఈయన హీరోగా నటించిన ప్రతి చిత్రం నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఆ మధ్య విడుదలై పిచ్చైక్కారన్ చిత్రం తమిళంలోనే కాకుండా తెలుగు నిర్మాతలను, బయ్యర్లను ధనవంతుల్ని చేసింది. ఇటీవల తెరపైకి వచ్చిన సైతాన్ చిత్రం సైతం విజయబాట పట్టింది. దీంతో విజయ్‌ఆంటోని కథానాయకుడిగా చిత్రాలు చేయడానికి పలువురు నిర్మాతలు క్యూలో ఉన్నారనడం అతిశయోక్తి కాదు. అలాంటిది ప్రముఖ నటుడు శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్‌లకు తన తాజా చిత్రాన్ని చేయడానికి విజయ్‌ఆంటోని సిద్ధమయ్యారు.

దీనికి కారణం లేకపోలేదు. రాడాన్ సంస్థ తనకు మదర్‌ సంస్థ అంటున్నారు విజయ్‌ఆంటోని. దీని గురించి ఆయన తెలుపుతూ సంగీతదర్శకుడిగా తనకు అవకాశం ఇచ్చి, ఆశీస్సులందించిన సంస్థ రాడాన్ అని తెలిపారు. అలాంటి సంస్థ అధినేతలకు చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. తన చిత్రాలకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఆదరణ లభిస్తోందన్నారు. దీంతో ఈ ఇరు భాష ప్రేక్షకులను అలరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అందువల్ల తాన చిత్రాల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని అన్నారు. అయితే అలాంటి మంచి చిత్రాన్ని శరత్‌కుమార్, రాధికశరత్‌కుమార్‌ నిర్మించగలరన్న నమ్మకం తనకుందని పేర్కొన్నారు.

నవ దర్శకుడు సీను వాస్ చెప్పిన కథ తనను చాలా ఇంప్రెస్‌ చేసిందని చెప్పారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని తెలిపారు. ఈ చిత్రం టైటిల్‌ తన గత చిత్రాల మాదిరిగానే ఆసక్తికరంగా ఉంటుందని, అదేమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని అన్నారు. ఈ చిత్రాన్ని శరత్‌కుమార్, రాధికశరత్‌కుమార్‌ ఐ పిక్చర్స్‌ పతాకంపై తమిళం, తెలుగు భాషల్లో భారీ ఎత్తున నిర్మించనున్నారు. ప్రస్తుతం విజయ్‌ఆంటోని చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement