Shaitan
-
రెండో పెళ్లి చేసుకున్న సైతాన్ నటి.. వరుడు ఎవరంటే?
ప్రముఖ మలయాళ నటి లేనా తెలుగులో వచ్చిన సైతాన్ వెబ్ సిరీస్‌లో నటించింది. మహి వీ రాఘవ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సిరీస్‌లో లేనా మేరీ జోసెఫ్ పాత్రలో మెప్పించింది. ఆమె ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తోన్న ఆడుజీవితం చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ భామ వివాహాబంధంలోకి అడుగుపెట్టిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ 42 ఏళ్ల నటి జనవరి 17న ప్రముఖ ఆస్ట్రోనాట్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను పెళ్లాడినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. నెలన్నర తర్వాత రివీల్.. పెళ్లి చేసుకున్న దాదాపు 40 రోజుల తర్వాత తన పెళ్లి విషయాన్ని బయటపెట్టింది లేనా. అయితే ఇది ఆమెకు రెండో వివాహం కాగా.. మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. ఇటీవల కేరళలో పర్యటించిన మోదీ గగన్‌యాన్ ప్రాజెక్ట్‌లో పాల్గొనే నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించారు. వారిలో పైలట్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కూడా ఉన్నారు. గగన్‌యాన్‌లో పాలుపంచుకునే నలుగురి పేర్లను మోదీ ప్రకటించిన వెంటనే లేనా తన పెళ్లి విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ప్రశాంత్ నాయర్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. లేనా తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఈరోజు, ఫిబ్రవరి 27, 2024న, మన ప్రధాని మోదీ భారత వైమానిక దళ ఫైటర్ పైలట్, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌కు మొదటి భారతీయ ఆస్ట్రోనాట్ వింగ్స్ బహుకరించారు. మన దేశం, కేరళ, ముఖ్యంగా నాకు ఇది చాలా గర్వించదగ్గ చారిత్రక సందర్భం. అధికారికంగా నేను ప్రశాంత్‌ను జనవరి 17, 2024న సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నానని మీకు తెలియజేయడానికి ఈ ప్రకటన కోసం వేచి ఉన్నా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష ఫ్లైట్ మిషన్ గగన్‌యాన్ కోసం శిక్షణ పొందిన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు. వారిలో కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఎంపికయ్యారు. ఈ నలుగురు వ్యోమగాములు రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందారు. View this post on Instagram A post shared by Lenaa ലെന (@lenaasmagazine) -
దేవియాని.. ఓ అందాల ‘సైతాన్’
విరబోసిన జుట్టు.. కోరపళ్లు.. మెలితిరిగిన పాదాల సైతాన్ కాదు దేవియాని శర్మ.. పల్చటి మొహం.. గవ్వల్లాంటి కళ్లు.. మైమరపించే నవ్వుతోనే హడలెత్తించే అందాల రాక్షసి! భీకరమైన ఆహార్యంతో కాకుండా హావభావాలతోనే భయం పుట్టించే పాత్రలో జీవించింది దేవియాని. అదే ఓటీటీలోని ‘సైతాన్’ సిరీస్. ఆ విజయమే ఇక్కడ ఆమె పరిచయానికి కారణం.. ఢిల్లీలో పుట్టి, పెరిగిన దేవియాని.. టీనేజ్లోనే మోడలింగ్ వైపు అడుగులు వేసింది. నటనపై ఉన్న ఆసక్తితో చిన్నప్పుడే స్టేజీ నాటకాల్లో నటించింది. బాలీవుడ్ ‘లవ్శుదా’ చిత్రంలో ఒక చిన్న పాత్రతో సినీ రంగప్రవేశం చేసింది. అక్కడ పెద్దగా అవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్ వచ్చి, ‘భానుమతి అండ్ రామకృష్ణ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తర్వాత ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’ లోనూ నటించింది. ఆ సినిమాల కమర్షియల్ సక్సెస్‌తో సంబంధం లేకుండా ఆమె ప్రతిభకు మాత్రం తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. వరుసగా ‘అనగనగా’, ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’, ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌లలో నటించి.. స్టార్‌గా మారింది. దేవియాని మంచి చిత్రకారిణి. తన పెయింటింగ్స్ కోసమే ‘కళామాటిక్స్’ పేరుతో ఓ ఇన్స్టాగ్రామ్ ఖాతా నిర్వహిస్తోంది. ప్రస్తుతం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న ‘సైతాన్’ సిరీస్‌తో అలరిస్తోంది. ఇందులో దేవియాని మాస్ అమ్మాయి పాత్రలో వైల్డ్ అండ్ బోల్డ్‌గా నటించి మెప్పించింది.‘బాహుబలి’ తర్వాత తెలుగు చిత్రాలకున్న క్రేజ్ తెలుసుకున్నా! అందుకే ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశతో హైదరాబాద్‌కి వచ్చా! – దేవియాని శర్మ -
'సైతాన్' వెబ్ సిరీస్.. ఆ బోల్డ్ సీన్స్ చేసిన నటి ఎవరో తెలుసా?
ఇటీవలే మహీ వీ రాఘవ దర్శకత్వంలో వచ్చిన వెబ్ సరీస్ సైతాన్. అయితే ఈ సిరీస్‌లో అంతా బోల్డ్ కంటెంట్‌తో సరికొత్త సంచలనం సృష్టించింది. గతంలో బోల్డ్ కంటెంట్ అనగానే చాలామందికి 'మీర్జాపుర్' గుర్తొస్తుందేమో. కానీ ఇప్పుడు దాన్ని తలదన్నే రీతిలో 'సైతాన్' తెరకెక్కించారు. ఎందుకంటే ఈ సిరీస్ లో బూతులు, అడల్ట్ సీన్స్ లెక్కకు మించి ఉన్నప్పటికీ.. ఎమోషన్ కూడా అదే స్థాయిలో వర్కౌట్ అయింది. దీంతో సిరీస్ సూపర్ హిట్ అయింది. అయితే ఈ సిరీస్‌లో బోల్డ్ సీన్లలో నటించిన నటి ఎవరో తెలుసా? ఇంతకు ముందు ఆమె ఎన్ని సినిమాలు చేసింది? అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటనే దానిపై ఇప్పుడు నెట్టింట చర్చ నడుస్తోంది. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: 'సైతాన్' దర్శకుడి వెంటపడుతున్న ఓటీటీలు!) మహీ వి రాఘవ వెబ్ సిరీస్ సైతాన్లో హీరో తల్లిగా సావిత్రి పాత్రలో నటించింది. ఆమె అసలు పేరు షెల్లీ నబుకుమార్ అలియాస్ షెల్లీ కిశోర్. ఆమె 1983 ఆగస్టు 18న దుబాయ్‌లో జన్మించింది. మలయాళంలో సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కుంకుమపువ్వు సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. మిన్నల్ మురళి, తంగ మీన్కల్ లాంటి మలయాళ చిత్రాల్లోనూ నటించింది. ఆమెకు 2006లో ఉత్తమ నటిగా అవార్డును కూడా అందుకుంది. ఇటీవల తెలుగులో వచ్చిన వెబ్ సిరీస్ సైతాన్లో ఆమె నటించింది. ఇందులో ముగ్గురు పిల్లలకు తల్లిగా ఆమె నటించింది. ఈ సిరీస్‌లో ఆమె నటన మరింత బోల్డ్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ ఆమె గురించి ఆరా తీస్తున్నారు. ఈ సిరీస్‌తో ఒక్కసారిగా తెలుగులోనూ పాపులర్ అయిన షెల్లీ కిశోర్ ప్రస్తుతం మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. (ఇది చదవండి: అక్కడ ప్లేట్స్ కడిగిన స్టార్ హీరోయిన్.. కారణం అదే!) View this post on Instagram A post shared by Shelly.n.kumar (@shelly.n.kumar) -
'సైతాన్' దర్శకుడి వెంటపడుతున్న ఓటీటీలు!
బోల్డ్ కంటెంట్ తో వెబ్ సిరీస్ అనగానే చాలామందికి 'మీర్జాపుర్' గుర్తొస్తుందేమో. ఇప్పుడు దాన్ని తలదన్నే రీతిలో 'సైతాన్' సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఈ సిరీస్ లో బూతులు, అడల్ట్ సీన్స్ లెక్కకు మించి ఉన్నప్పటికీ.. ఎమోషన్ కూడా అదే స్థాయిలో వర్కౌట్ అయింది. దీంతో సిరీస్ సూపర్ హిట్ అయింది. డైరెక్టర్ మహీ వి రాఘవపై ప్రముఖ ఓటీటీల కన్ను పడింది. ప్రొడ్యూసర్ టూ డైరెక్టర్! టాలీవుడ్ లో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన మహీ వి రాఘవ.. 'విలేజ్ లో వినాయకుడు', 'కుదిరితే కప్పు కాఫీ' సినిమాలు తీశాడు. కానీ ఆ రెండు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. దీంతో తనలోని దర్శకుడుని బయటకు తీశాడు. 'పాఠశాల', 'ఆనందో బ్రహ్మ', 'యాత్ర' చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. కాస్తంత గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. (ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!) ఓటీటీలతో మరింత క్రేజ్ ఇప్పటివరకు బిగ్ స్క్రీన్ పై తన సత్తా చూపించిన మహీ వి రాఘవ.. హాట్ స్టార్ కోసం రెండు సిరీస్ లు ప్లాన్ చేశాడు. రీసెంట్ గా విడుదలైన ఈ రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో ఒకటి 'సేవ్ ద టైగర్స్'. కామెడీ స్టోరీతో సిరీస్ తీసినా సక్సెస్ సాధించొచ్చని ఇది ప్రూవ్ చేసింది. ఈ సిరీస్ కి రైటర్ కమ్ ప్రొడ్యూసర్ గా చేసిన మహీ.. షో రన్నర్ గా వ్యవహరించారు. డైరెక్షన్ చేయలేదు. 'సైతాన్' వెబ్ సిరీస్ కి మాత్రం అన్నీ తానై వ్యవహరించాడు. బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఈ క్రమంలోనే తన క్రేజ్ చాలా పెంచేసుకున్నాడు. ముందుంది పెద్ద టాస్క్ డైరెక్టర్ మహీ వి రాఘవ.. ప్రస్తుతం 'సిద్దా లోకం ఎలా ఉంది నాయనా' సినిమా చేశాడు. ఇది రిలీజ్ కు రెడీగా ఉంది. అటు సినిమాలు, ఇటు ఓటీటీల్లో వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉన్న ఇతడు.. రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తాడా అనేది పెద్ద టాస్క్. ఎందుకంటే దేనికి దానికి సెపరేట్ ఆడియెన్స్ ఉంటారు కదా! ఇదంతా కాదన్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్ జీవితం ఆధారంగా 'యాత్ర 2' తీయబోతున్నాడు. మహీ సక్సెస్ దెబ్బకు ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. (ఇదీ చదవండి: చరణ్-ఉపాసన బిడ్డకు ఆ నంబర్ సెంటిమెంట్!?) -
Shaitan Review: ‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్ : సైతాన్ (9 ఎపిసోడ్స్) నటీనటులు : రిషి, షెల్లీ, రవి కాలే, దేవయాని శర్మ, జాఫర్ సాదిక్, నితిన్ ప్రసన్న తదితరులు నిర్మాతలు: మహి వి రాఘవ్, చిన్నా వాసుదేవ్ రెడ్డి రచన-దర్శకత్వం: మహి వి రాఘవ్ సంగీతం : శ్రీరామ్ మద్దూరి సినిమాటోగ్రఫీ: షణ్ముగ సుందరం ఓటీటీ వేదిక: డిస్నీ +హాట్‌స్టార్ విడుదల తేది: జూన్ 15, 2023 సినీ నటులతో పాటు దర్శక నిర్మాతకు దొరికిన సరికొత్త మాధ్యమ వేదిక ఓటీటీ. రెండున్నర గంటల్లో చెప్పలేని కథలను, చేయలేని ప్రయోగాలను వెబ్ సిరీస్‌ల ద్వారా చేసి తమని తాము సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఓటీటీ సంస్థలు కూడా సినిమాలకు ధీటుగా వెబ్ సిరీస్‌లు తెరకెక్కిస్తున్నాయి. తాజాగా ‘యాత్ర’ ఫేం మహి వి.రాఘవ్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘సైతాన్’. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో నేటి నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రచార చిత్రల్లో బోల్డ్ సీన్స్, బూతులతో చూపించి సంచలనం సృష్టించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘సైతాన్’ కథేంటంటే.. సావిత్రి(షెల్లీ నబు కుమార్)కి బాలి(రిషి), జయ(దేవయాని శర్మ), గుమ్తి(జాఫర్ సాధిక్) ముగ్గురు పిల్లలు. భర్త వదిలేసి వెళ్లడంతో పిల్లల పోషణ కోసం ఓ పోలీసు అధికారికి ఉంపుడుగత్తెగా ఉంటుంది. తల్లి గురించి ఇరుగుపొరుగు వారు నానా మాటలు అనడం బాలికి నచ్చదు. అలాంటి పని చేయొద్దని తల్లికి చెబితే.. ‘మీరు సంపాదించే రోజు వచ్చినప్పటి నుంచి నేను ఇలాంటి పని చేయడం మానేస్తా’ అంటుంది. ఏదైనా పని చేద్దామని వెళ్తే.. ఎవరూ బాలికి పని ఇవ్వరు. అదే సమయంలో తల్లి కోసం వచ్చే పోలీసు కన్ను తన చెల్లిపై పడుతుంది. చెల్లిని బలవంతం చేయడానికి ట్రై చేసిన పోలీసుని కొట్టి చంపేస్తారు. (చదవండి: మరికొద్ది గంటల్లో రిలీజ్.. ఆదిపురుష్‌కి ప్రచారం ఎక్కడ?) ఈ కేసులో బాలి తొలిసారి జైలుకు వెళ్తాడు. కొన్నాళ్ల తర్వాత బయటకు వస్తాడు. ఆ తర్వాత బాలి తన కుటుంబంతో కలిసి ఎంతమందిని హత్య చేశాడు? ఎన్నిసార్లు జైలుకు వెళ్లాడు? దళంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? తను ప్రాణంగా ఇష్టపడే తమ్ముడు గుమ్తిని చంపిదెవరు? కళావతి(కామాక్షి భాస్కర్)కు బాలికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తన ప్రయాణంలో పోలీసు అధికారి నాగిరెడ్డి(రవి కాలే) పాత్ర ఏంటి? చివరకు బాలి ఎలా చనిపోయాడు? అనేది తెలియాలంటే ‘సైతాన్’ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఎలా ఉందంటే... ఇప్పటి వరకు మహి వి. రాఘవ్‌కు సెన్సిబుల్ డైరెక్టర్ అనే ముద్ర ఉంది. ఆయన తెరకెక్కించిన ‘పాఠశాల’, ‘ఆనందో బ్రహ్మా’, ‘యాత్ర’ లాంటి చిత్రాల్లో ఎక్కడ వల్గారిటీ కనిపించదు. ఇక ఆయన షో రన్నర్‌గా వ్యవహరించిన ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ కూడా క్లీన్ కామెడీగా సాగుతుంది. అలాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న డైరెక్టర్ సడెన్‌గా రూటు మార్చి సైతాన్ లాంటి బోల్డ్, అడల్ట్ వెబ్ సిరీస్‌ని తెరకెక్కించి అందరిని ఆశ్చర్యపరిచాడు. క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్‌లో రాయలేని భాషలో బూతులు ఉన్నాయి. హింస, శృంగార సన్నివేశాలు మోతాదుకు మించి ఉంటాయి. కేవలం ఒక వర్గం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని మహి ఈ వెబ్ సిరీస్‌ని తీర్చి దిద్దారు. ఆ వర్గానికి మాత్రం ఈ వెబ్ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. కానీ దర్శకుడు మొదటి నుంచి చెప్పినట్లుగా ఫ్యామిలీతో కలిసి చూసే వెబ్ సిరీస్ అయితే కాదిది. మొత్తం తొమ్మిది ఎపిసోడ్లతో.. ప్రతి ఎపిసోడ్‌లోనూ బోల్డ్ సీన్స్, డైలాగ్స్ ఉంటాయి. తొలి ఎపిసోడ్‌తోనే ‘సైతాన్’ ప్రపంచంలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు చేయడం మొదలు పెట్టి, చివరకు తనువు చాలించిన ఓ నేరస్తుని కథే ‘సైతాన్’. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా మేకింగ్ మాత్రం కొత్తగా ఉంది. బాలి ఫ్యామిలీ చేసే హత్యలు క్రూరంగా ఉన్నప్పటికీ.. అలా చేయడంలో తప్పు లేదనేలా కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. కొన్ని చోట్ల అనవసరంగా బూతు పదాలను జొప్పించారనే ఫీలింగ్ కలుగుతుంది. ‘భర్త లేని మహిళ మరో పురుషుడితో సంబంధం పెట్టుకుంటే ఆమెపై 'లం**...' అని ముద్ర వేసే సమాజం, ఆ మగాడికి ఎందుకు ఏ పేరు పెట్టలేదు?’ లాంటి సంభాషణలు వినడానికి వినడానికి హార్ష్‌గా అనిపించినా.. ప్రసుత్తం సమాజంలో జరుగుతుంది ఇదే కదా అనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ.. బోల్డ్ మేకింగ్ కారణంగా వాటికి ప్రేక్షకుడు కనెక్ట్ కాలేకపోతాడు. నాలుగు, ఐదో ఎపిసోడ్లో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. పోలీసులకు, దళ సభ్యలకు మధ్య సాగే సన్నివేశాలు ఆకట్టుకోలేవు. కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీని ఎక్కువడా వాడేశారు. అతి హింస, శృంగార సన్నీవేశాల కారణంగా ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్‌ని చూడలేరు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి మాత్రం బాగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. బాలి పాత్రకి వందశాతం న్యాయం చేశాడు రిషి. అమాయకత్వం, కోపం, ఆవేశం... ప్రతిది చక్కగా తెరపై చూపించాడు. జయప్రదగా దేవయాని శర్మ డీ గ్లామర్ లుక్‌లో బోల్డ్ యాక్టింగ్ చేశారు. గుమ్తి పాత్రలో జాఫర్‌ని తప్ప మరొకరిని ఊహించుకోలేము. కామాక్షి భాస్కర్ల, షెల్లీ, రవి కాలేతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నికల్ పరంగా ఈ వెబ్ సిరీస్ బాగుంది. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
సైతాన్ ట్రైలర్ నిండా బూతులు.. స్పందించిన దర్శకుడు
ఓటీటీలో అశ్లీలత, అసభ్య పదజాలం వాడకం మించిపోతోంది. ఈ మధ్య అయితే కొన్ని సిరీస్‌లు పచ్చిబూతులతో చెలరేగిపోయాయి. తాజాగా ఇదే కోవలోకి వచ్చేందుకు సిద్ధమైంది సైతాన్. సేవ్ ద టైగర్స్‌తో నవ్వించిన దర్శకుడు మహి వి. రాఘవ్ సైతాన్‌తో భయపెట్టేందుకు రెడీ అయ్యాడు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్లో వాడిన దారుణ పదజాలం ఫ్యామిలీ ఆడియన్స్ చెవులు మూసుకునేలా ఉంది. రానా నాయుడును ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇలా బూతులతో రెచ్చిపోయారా? అంటూ నెటిజన్లు దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ విమర్శలపై డైరెక్టర్ మహి.వి. రాఘవ్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'నేను ఈసారి క్రైమ్ డ్రామా జానర్ ఎంచుకున్నాను. ఇందులో నలుగురు వ్యక్తులు వారు సజీవంగా ఉండటం కోసం ఇతరులను చంపుకుంటూ పోతారు. ఇంతకుముందు నేనెప్పుడూ ఈ జానర్ టచ్ చేయలేదు. ఇందులో ఉన్న కంటెంట్ ప్రేక్షకులకు అర్థమవ్వాలంటే అందుకు తగ్గట్లుగా ఆ సన్నివేశాలు, బూతులు ఉండాల్సిందే! కథ డిమాండ్ చేసింది కాబట్టే వాటిని అలాగే ఉంచేశాం. అంతే తప్ప ప్రేక్షకులు నా సిరీస్ చూడాలని ఎంచుకున్న షార్ట్‌కట్ కాదిది. ఒక రచయితగా, దర్శకుడిగా జనాలకు ఒక కథ చెప్పాలనుకున్నాను. సైతాన్ క్యాప్షన్ ఏంటో తెలుసా? 'మీరందరూ నేరం అనేదాన్ని వారు మనుగడ అని చెప్తున్నారు'. సమాజంలో వివక్షకు గురైన ఎంతోమంది బాధితులే నేరస్థులుగా మారతారు. మిధుంటర్ మూవీలో చిన్న వయసులోనే వేధింపులకు, చీత్కారాలకు గురైన పిల్లలు తర్వాత నేరస్థులిగా మారారు. కానీ వారు అలా అవడానికి కారణం సమాజమే! ఈ పాయింట్ తీసుకునే సైతాన్ సిరీస్ తెరకెక్కించాను' అని చెప్పుకొచ్చాడు. కాగా సైతాన్ సిరీస్ జూన్ 15 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: డబ్బులిచ్చి నాపై ట్రోలింగ్ చేయించాడు: అనసూయ -
సైతాన్ ట్రైలర్.. పచ్చిబూతులు, అడల్ట్ సన్నివేశాలు!
సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు మహి వి. రాఘవ్ తొలి సిరీస్‌తోనే మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇదే జోష్‌లో సైతాన్ అనే మరో వెబ్ సిరీస్‌తో ముందుకు రాబోతున్నాడు. అయితే ఈసారి కామెడీ జానర్ కాకుండా క్రైమ్ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. తాజాగా సైతాన్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ప్రారంభంలోనే ఒంటరిగా చూడమని హెచ్చరిస్తూ ఓ నోట్ పెట్టారు. అంటే ఇదేదో భయంకరమైన సిరీస్ అనుకునేరు.. అంతా బూతులమయంతో ఉంది. 'ఈ సమాజం నేనొక నేరస్థుడిని అన్నా సరే నేను బాధితుడిని' అంటూ హత్యలకు పూనుకుంటాడో వ్యక్తి. 'మనలో ఒకరిని కాపాడుకోవడం కోసం ఎవరినైనా, ఎంతమందినైనా చంపాల్సిందే' అన్న మహిళా డైలాగ్‌తో ఇందులో రక్తపాతం ఎక్కువే ఉందని అర్థమవుతుంది. ఆ తర్వాత వచ్చే బూతు డైలాగులకు ఫ్యామిలీ ఆడియన్స్ చెవులు మూసుకోవడం ఖాయం. రాజకీయ నాయకులకు, పోలీసులకు విశ్వాసం, కృతజ్ఞతల్లాంటివి ఉండవు అనే డైలాగులు మెరిసినప్పటికీ తర్వాత వరుసగా పచ్చిబూతులు, అడల్ట్ సన్నివేశాలే కనిపిస్తాయి. ఈ ట్రైలర్ చూసిన నెటిజన్లు ఇది రానా నాయుడుకు నెక్స్ట్ లెవల్లా ఉందని కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో ఓటీటీలకు సెన్సార్ అనేది ఉండదా? మరీ ఇంత దారుణంగా తయారయ్యారేంటి? దీనికి బదులు అడల్ట్ సినిమాలు తీసుకోండి అని ఫైర్ అవుతున్నారు. ఇక ఈ సిరీస్ జూన్ 15 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్ -
క్రైమ్ థ్రిల్లర్‌గా ‘సైతాన్’ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
‘సేవ్ ద టైగర్స్’వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ మహి వి. రాఘవ్. ఈ కామెడీ వెబ్ సిరీస్‌కి మహి క్రియేటివ్ ప్రొడ్యూసర్, షో రన్నర్‌గా వ్యవహరించారు. ప్రతి ఇంట్లో భార్య భర్తల మధ్య జరిగే గొడవల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఇదే జోష్‌లో మరో వెబ్ సిరీస్‌ని విడుదల చేయబోతున్నాడు మహి. అదే ‘సైతాన్’. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటి వరకు కామెడీ అండ్ ఎమోషనల్ కథలనే తెరకెక్కించిన మహి..ఇప్పుడు క్రైమ్ నేపథ్యంలో ‘సైతాన్’ని తెరకెక్కించడం విశేషం. ‘సైతాన్' ఫస్ట్ లుక్ చూస్తే... నలుగురు కలిసి ఓ పోలీసును హత్య చేసినట్టు అర్థం అవుతోంది. ఎందుకు చంపారు? అనేది సిరీస్ చూస్తే తెలుస్తుంది. 'మీరు నేరం అని దేనిని అయితే అంటున్నారో... వాళ్ళు దానిని మనుగడ కోసం చేసిన పనిగా చెబుతున్నారు'' అని మహి వి. రాఘవ్ పేర్కొన్నారు. క్రైమ్ జానర్ ప్రాజెక్ట్ చేయడం ఆయనకు ఇదే తొలిసారి. దేవయాని శర్మ, మలయాళీ నటి షెల్లీ నబు కుమార్, నటుడు రిషి, జాఫర్ సాధిక్ కీలక పాత్రలు పోషించిన ఈ ఫుల్ లెంగ్త్ క్రైమ్ సిరీస్ ఈ నెల 15న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel) -
ఏక కాలంలో రెండు చిత్రాలు
సాధారణంగా చిత్రం తరువాత చిత్రం చేసే విజయ్‌ఆంటోని ఏకకాలంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈయన నటించిన పిచ్చైక్కారన్ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ విశేష ప్రేక్షకాదరణ చూరగొన్న విషయం తెలిసిందే. ఆ తరువాత నటించిన సైతాన్ ఆ స్థాయి విజయం కాకపోయినా సక్సెస్ అనిపించుకుంది. తాజాగా అన్నాదురై అనే చిత్రంలో నటిస్తున్నారు. రాజకీయ థ్రిల్లర్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం. దర్శకుడు సుశీంద్రన్ శిష్యుడు శ్రీనివాసన్ మెగాఫోన్ పట్టిన ఈ చిత్రాన్ని నటి రాధిక రాడాన్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. విజయ్‌ఆంటోని తెలుగు మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంతో పాటు విజయ్‌ఆంటోని కాళీ అనే మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇంతకు ముందు వణక్కం చెన్నై చిత్రాన్ని తెరకెక్కించిన కృతిక ఉదయనిధిస్టాలిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని విజయ్‌ఆంటోని ఫిలిం కార్పొరేషన్ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ రెండు చిత్రాల్లో విజయ్‌ఆంటోనితో రొమాన్స్ చేసే కథానాయికలెవరన్న విషయాన్ని చిత్ర వర్గాలు గోప్యంగా ఉంచడం విశేషం. -
నా మదర్ సంస్థలో నటిస్తా!
ఆదిలో ఒక్క అవకాశం అంటూ దర్శక నిర్మాతల చుట్టూ చెప్పులరిగేలా, కాళ్లు నెప్పులు పుట్టేలా తిరిగిన వారు ఇచ్చిన అవకాశంతో ఎదిగి ఆ తరువాత వారిని గుర్తించుకునేవారెందరు అన్నది ప్రశ్నార్థకమే. అయితే ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు విజయ్‌ఆంటోని లాంటి కొద్ది మంది గతాన్ని మరిచిపోవడానికి చిన్న ఉదాహరణ చెప్పాలి. విజయ్‌ఆంటోని ప్రముఖ సంగీతదర్శకుడు మాత్రమే కాదు, మినిమమ్ గ్యారెంటీ కథానాయకుడు కూడా. ఈయన హీరోగా నటించిన ప్రతి చిత్రం నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఆ మధ్య విడుదలై పిచ్చైక్కారన్ చిత్రం తమిళంలోనే కాకుండా తెలుగు నిర్మాతలను, బయ్యర్లను ధనవంతుల్ని చేసింది. ఇటీవల తెరపైకి వచ్చిన సైతాన్ చిత్రం సైతం విజయబాట పట్టింది. దీంతో విజయ్‌ఆంటోని కథానాయకుడిగా చిత్రాలు చేయడానికి పలువురు నిర్మాతలు క్యూలో ఉన్నారనడం అతిశయోక్తి కాదు. అలాంటిది ప్రముఖ నటుడు శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్‌లకు తన తాజా చిత్రాన్ని చేయడానికి విజయ్‌ఆంటోని సిద్ధమయ్యారు. దీనికి కారణం లేకపోలేదు. రాడాన్ సంస్థ తనకు మదర్ సంస్థ అంటున్నారు విజయ్‌ఆంటోని. దీని గురించి ఆయన తెలుపుతూ సంగీతదర్శకుడిగా తనకు అవకాశం ఇచ్చి, ఆశీస్సులందించిన సంస్థ రాడాన్ అని తెలిపారు. అలాంటి సంస్థ అధినేతలకు చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. తన చిత్రాలకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఆదరణ లభిస్తోందన్నారు. దీంతో ఈ ఇరు భాష ప్రేక్షకులను అలరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అందువల్ల తాన చిత్రాల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని అన్నారు. అయితే అలాంటి మంచి చిత్రాన్ని శరత్‌కుమార్, రాధికశరత్‌కుమార్ నిర్మించగలరన్న నమ్మకం తనకుందని పేర్కొన్నారు. నవ దర్శకుడు సీను వాస్ చెప్పిన కథ తనను చాలా ఇంప్రెస్ చేసిందని చెప్పారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని తెలిపారు. ఈ చిత్రం టైటిల్ తన గత చిత్రాల మాదిరిగానే ఆసక్తికరంగా ఉంటుందని, అదేమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని అన్నారు. ఈ చిత్రాన్ని శరత్‌కుమార్, రాధికశరత్‌కుమార్ ఐ పిక్చర్స్ పతాకంపై తమిళం, తెలుగు భాషల్లో భారీ ఎత్తున నిర్మించనున్నారు. ప్రస్తుతం విజయ్‌ఆంటోని చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. -
మరో బ్లాక్ బస్టర్‌గా సైతాన్!
విజయం సాధిస్తానన్న విజయ్ఆంటోనిలోని కాన్ఫిడెన్స తనకు బాగా నచ్చిందని సీనియర్ దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ అన్నారు. సంగీతదర్శకుడు, కథానాయకుడు అంటూ రెండు పడవల్లో పయనిస్తూ వరుస విజయాలను సాధిస్తున్న విజయ్‌ఆంటోని పిచ్చైక్కారన్ చిత్రం తరువాత తాజాగా నటించిన చిత్రం సైతాన్. ఆయనే సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో అరుంధతీనాయర్ నాయకిగా నటించారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్‌ఆంటోని నిర్మిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక సత్యం సినీ థియేటర్లో జరిగింది. చిత్ర ఆడియోను ఎస్ఏ.చంద్రశేఖర్ ఆవిష్కరించగా తొలి సీడీని ఐసరి గణేశ్ అందుకున్నారు. ఈసందర్భంగా ఎస్ఏ.చంద్రశేఖర్ మాట్లాడుతూ విజయ్‌ఆంటోని సంగీత దర్శకుడిగా రాణిస్తున్న సమయంలోనే హీరోగా నటించడానికి రెడీ అవ్వడాన్ని తెలుసుకుని తాను ఆయన్ని పిలిచి ఇప్పుడు బాగానే ఉందిగా హీరోగా అవసరమా? అని అడిగానన్నారు. అందుకు తను చెప్పిన సమాధానం తాను హీరోగానూ జరుుస్తాను అని కాన్ఫిడెన్సతో అనడం అని పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన విజయాన్ని తన కొడుకు విజయ్ విజయం అంతగా సంతోషిస్తున్నానని అన్నారు. విజయ్‌ఆంటోని మరిన్ని విజయాలు సాధించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. అనంతరం విజయ్‌ఆంటోని మాట్లాడుతూ సైతాన్ చిత్రం బాగా వచ్చిందని, మరో బ్లాక్ బ్లస్టర్ చిత్రం అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు ఈ చిత్రం కోసం రేయింబవళ్లు శ్రమించారని, చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శశి, నటుడు శిబిరాజ్, చాంబర్ గౌరవ కార్యదర్శి కాట్రగడ్డ ప్రసాద్, నటి అరుంధతి నాయర్ పాల్గొన్నారు. సైతాన్ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను ఆరా సినిమా సంస్థ, తెలుగు హక్కులను శివకుమాలు పొందారున్నది గమనార్హం.