ప్రముఖ మలయాళ నటి లేనా తెలుగులో వచ్చిన సైతాన్ వెబ్ సిరీస్‌లో నటించింది. మహి వీ రాఘవ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సిరీస్‌లో లేనా మేరీ జోసెఫ్ పాత్రలో మెప్పించింది. ఆమె ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తోన్న ఆడుజీవితం చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ భామ వివాహాబంధంలోకి అడుగుపెట్టిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ 42 ఏళ్ల నటి జనవరి 17న ప్రముఖ ఆస్ట్రోనాట్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను పెళ్లాడినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకుంది.
నెలన్నర తర్వాత రివీల్..
పెళ్లి చేసుకున్న దాదాపు 40 రోజుల తర్వాత తన పెళ్లి విషయాన్ని బయటపెట్టింది లేనా. అయితే ఇది ఆమెకు రెండో వివాహం కాగా.. మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. ఇటీవల కేరళలో పర్యటించిన మోదీ గగన్‌యాన్ ప్రాజెక్ట్‌లో పాల్గొనే నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించారు. వారిలో పైలట్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కూడా ఉన్నారు. గగన్‌యాన్‌లో పాలుపంచుకునే నలుగురి పేర్లను మోదీ ప్రకటించిన వెంటనే లేనా తన పెళ్లి విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ప్రశాంత్ నాయర్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
లేనా తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఈరోజు, ఫిబ్రవరి 27, 2024న, మన ప్రధాని మోదీ భారత వైమానిక దళ ఫైటర్ పైలట్, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌కు మొదటి భారతీయ ఆస్ట్రోనాట్ వింగ్స్ బహుకరించారు. మన దేశం, కేరళ, ముఖ్యంగా నాకు ఇది చాలా గర్వించదగ్గ చారిత్రక సందర్భం. అధికారికంగా నేను ప్రశాంత్‌ను జనవరి 17, 2024న సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నానని మీకు తెలియజేయడానికి ఈ ప్రకటన కోసం వేచి ఉన్నా' అంటూ పోస్ట్ చేసింది.
కాగా.. భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష ఫ్లైట్ మిషన్ గగన్‌యాన్ కోసం శిక్షణ పొందిన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు. వారిలో కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఎంపికయ్యారు. ఈ నలుగురు వ్యోమగాములు రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందారు.
Comments
Please login to add a commentAdd a comment