ఓటీటీలో అశ్లీలత, అసభ్య పదజాలం వాడకం మించిపోతోంది. ఈ మధ్య అయితే కొన్ని సిరీస్‌లు పచ్చిబూతులతో చెలరేగిపోయాయి. తాజాగా ఇదే కోవలోకి వచ్చేందుకు సిద్ధమైంది సైతాన్. సేవ్ ద టైగర్స్‌తో నవ్వించిన దర్శకుడు మహి వి. రాఘవ్ సైతాన్‌తో భయపెట్టేందుకు రెడీ అయ్యాడు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌లో వాడిన దారుణ పదజాలం ఫ్యామిలీ ఆడియన్స్ చెవులు మూసుకునేలా ఉంది. రానా నాయుడును ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఇలా బూతులతో రెచ్చిపోయారా? అంటూ నెటిజన్లు దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా ఈ విమర్శలపై డైరెక్టర్ మహి.వి. రాఘవ్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'నేను ఈసారి క్రైమ్ డ్రామా జానర్ ఎంచుకున్నాను. ఇందులో నలుగురు వ్యక్తులు వారు సజీవంగా ఉండటం కోసం ఇతరులను చంపుకుంటూ పోతారు. ఇంతకుముందు నేనెప్పుడూ ఈ జానర్ టచ్ చేయలేదు. ఇందులో ఉన్న కంటెంట్ ప్రేక్షకులకు అర్థమవ్వాలంటే అందుకు తగ్గట్లుగా ఆ సన్నివేశాలు, బూతులు ఉండాల్సిందే! కథ డిమాండ్ చేసింది కాబట్టే వాటిని అలాగే ఉంచేశాం. అంతే తప్ప ప్రేక్షకులు నా సిరీస్ చూడాలని ఎంచుకున్న షార్ట్‌కట్ కాదిది. ఒక రచయితగా, దర్శకుడిగా జనాలకు ఒక కథ చెప్పాలనుకున్నాను.
సైతాన్ క్యాప్షన్ ఏంటో తెలుసా? 'మీరందరూ నేరం అనేదాన్ని వారు మనుగడ అని చెప్తున్నారు'. సమాజంలో వివక్షకు గురైన ఎంతోమంది బాధితులే నేరస్థులుగా మారతారు. మిధుంటర్ మూవీలో చిన్న వయసులోనే వేధింపులకు, చీత్కారాలకు గురైన పిల్లలు తర్వాత నేరస్థులిగా మారారు. కానీ వారు అలా అవడానికి కారణం సమాజమే! ఈ పాయింట్ తీసుకునే సైతాన్ సిరీస్ తెరకెక్కించాను' అని చెప్పుకొచ్చాడు. కాగా సైతాన్ సిరీస్ జూన్ 15 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment