Shaitan Telugu Web Series 2023 Review And Rating In Telugu - Sakshi
Sakshi News home page

Shaitan Web Series Review: రాయలేని భాషలో బూతులు.. ‘సైతాన్‌’ వెబ్‌ సిరీస్‌ ఎలా ఉందంటే..

Published Thu, Jun 15 2023 12:37 PM | Last Updated on Thu, Jun 15 2023 1:40 PM

Shaitan Web Series Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : సైతాన్ (9 ఎపిసోడ్స్‌)
నటీనటులు : రిషి, షెల్లీ, రవి కాలే, దేవయాని శర్మ, జాఫర్ సాదిక్, నితిన్ ప్రసన్న తదితరులు
నిర్మాతలు: మహి వి రాఘవ్‌, చిన్నా వాసుదేవ్‌ రెడ్డి
రచన-దర్శకత్వం:  మహి వి రాఘవ్
సంగీతం : శ్రీరామ్‌ మద్దూరి
సినిమాటోగ్రఫీ: షణ్ముగ సుందరం
ఓటీటీ వేదిక: డిస్నీ +హాట్‌స్టార్‌
విడుదల తేది: జూన్‌ 15, 2023

సినీ నటులతో పాటు దర్శక నిర్మాతకు దొరికిన సరికొత్త  మాధ్యమ వేదిక ఓటీటీ. రెండున్నర గంటల్లో చెప్పలేని కథలను, చేయలేని ప్రయోగాలను వెబ్‌ సిరీస్‌ల ద్వారా చేసి తమని తాము సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఓటీటీ సంస్థలు కూడా సినిమాలకు ధీటుగా వెబ్‌ సిరీస్‌లు తెరకెక్కిస్తున్నాయి. తాజాగా ‘యాత్ర’ ఫేం మహి వి.రాఘవ్‌ దర్శకత్వం వహించిన వెబ్‌ సిరీస్‌ ‘సైతాన్‌’. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో నేటి నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రచార చిత్రల్లో బోల్డ్‌ సీన్స్‌, బూతులతో చూపించి సంచలనం సృష్టించిన ఈ వెబ్‌ సిరీస్‌ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

‘సైతాన్‌’ కథేంటంటే..
సావిత్రి(షెల్లీ నబు కుమార్‌)కి బాలి(రిషి), జయ(దేవయాని శర్మ), గుమ్తి(జాఫర్‌ సాధిక్‌) ముగ్గురు పిల్లలు. భర్త వదిలేసి వెళ్లడంతో పిల్లల పోషణ కోసం ఓ పోలీసు అధికారికి ఉంపుడుగత్తెగా ఉంటుంది. తల్లి గురించి ఇరుగుపొరుగు వారు నానా మాటలు అనడం బాలికి నచ్చదు. అలాంటి పని చేయొద్దని తల్లికి చెబితే.. ‘మీరు సంపాదించే రోజు వచ్చినప్పటి నుంచి నేను ఇలాంటి పని చేయడం మానేస్తా’ అంటుంది. ఏదైనా పని చేద్దామని వెళ్తే.. ఎవరూ బాలికి పని ఇవ్వరు. అదే సమయంలో తల్లి కోసం వచ్చే పోలీసు కన్ను తన చెల్లిపై పడుతుంది. చెల్లిని బలవంతం చేయడానికి ట్రై చేసిన పోలీసుని కొట్టి చంపేస్తారు.

(చదవండి:  మరికొద్ది గంటల్లో రిలీజ్‌.. ఆదిపురుష్‌కి ప్రచారం ఎక్కడ?)

ఈ కేసులో బాలి తొలిసారి జైలుకు వెళ్తాడు. కొన్నాళ్ల తర్వాత బయటకు వస్తాడు. ఆ తర్వాత బాలి తన కుటుంబంతో కలిసి ఎంతమందిని హత్య చేశాడు? ఎన్నిసార్లు జైలుకు వెళ్లాడు?  దళంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? తను ప్రాణంగా ఇష్టపడే తమ్ముడు గుమ్తిని చంపిదెవరు? కళావతి(కామాక్షి భాస్కర్‌)కు బాలికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తన ప్రయాణంలో పోలీసు అధికారి నాగిరెడ్డి(రవి కాలే) పాత్ర ఏంటి? చివరకు బాలి ఎలా చనిపోయాడు? అనేది తెలియాలంటే ‘సైతాన్‌’ వెబ్‌ సిరీస్‌ చూడాల్సిందే. 

ఎలా ఉందంటే...
ఇప్పటి వరకు మహి వి. రాఘవ్‌కు సెన్సిబుల్ డైరెక్టర్ అనే ముద్ర ఉంది. ఆయన తెరకెక్కించిన ‘పాఠశాల’, ‘ఆనందో బ్రహ్మా’, ‘యాత్ర’ లాంటి చిత్రాల్లో ఎక్కడ వల్గారిటీ కనిపించదు. ఇక ఆయన షో రన్నర్‌గా వ్యవహరించిన ‘సేవ్‌ ద టైగర్స్‌’ వెబ్‌ సిరీస్‌ కూడా క్లీన్‌ కామెడీగా సాగుతుంది. అలాంటి క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న డైరెక్టర్‌ సడెన్‌గా రూటు మార్చి సైతాన్‌ లాంటి బోల్డ్‌, అడల్ట్‌ వెబ్‌ సిరీస్‌ని తెరకెక్కించి అందరిని ఆశ్చర్యపరిచాడు.

క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ వెబ్‌ సిరీస్‌లో రాయలేని భాషలో బూతులు ఉన్నాయి. హింస, శృంగార సన్నివేశాలు మోతాదుకు మించి ఉంటాయి. కేవలం ఒక వర్గం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని మహి ఈ వెబ్‌ సిరీస్‌ని తీర్చి దిద్దారు. ఆ వర్గానికి మాత్రం ఈ వెబ్‌ సిరీస్‌ బాగా కనెక్ట్‌ అవుతుంది అనడంలో సందేహం లేదు. కానీ దర్శకుడు మొదటి నుంచి చెప్పినట్లుగా ఫ్యామిలీతో కలిసి చూసే వెబ్‌ సిరీస్‌ అయితే కాదిది. మొత్తం తొమ్మిది ఎపిసోడ్‌లతో.. ప్రతి ఎపిసోడ్‌లోనూ బోల్డ్‌ సీన్స్‌, డైలాగ్స్‌ ఉంటాయి. తొలి ఎపిసోడ్‌తోనే ‘సైతాన్‌’ ప్రపంచంలోకి తీసుకెళ్లాడు దర్శకుడు.

తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు చేయడం మొదలు పెట్టి, చివరకు తనువు చాలించిన ఓ నేరస్తుని కథే ‘సైతాన్‌’. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ పాతదే అయినా మేకింగ్‌ మాత్రం కొత్తగా ఉంది. బాలి ఫ్యామిలీ చేసే హత్యలు క్రూరంగా ఉన్నప్పటికీ.. అలా చేయడంలో తప్పు లేదనేలా కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. కొన్ని చోట్ల అనవసరంగా బూతు పదాలను జొప్పించారనే ఫీలింగ్‌ కలుగుతుంది.

‘భర్త లేని మహిళ మరో పురుషుడితో సంబంధం పెట్టుకుంటే ఆమెపై 'లం**...' అని ముద్ర వేసే సమాజం, ఆ మగాడికి ఎందుకు ఏ పేరు పెట్టలేదు?’ లాంటి సంభాషణలు వినడానికి వినడానికి హార్ష్‌గా అనిపించినా.. ప్రసుత్తం సమాజంలో జరుగుతుంది ఇదే కదా అనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ ఉన్నప్పటికీ.. బోల్డ్‌ మేకింగ్‌ కారణంగా వాటికి ప్రేక్షకుడు కనెక్ట్‌ కాలేకపోతాడు. నాలుగు, ఐదో ఎపిసోడ్‌లో కొన్ని సీన్స్‌ సాగదీతగా అనిపిస్తాయి. పోలీసులకు, దళ సభ్యలకు మధ్య సాగే సన్నివేశాలు ఆకట్టుకోలేవు. కొన్ని చోట్ల సినిమాటిక్‌ లిబర్టీని ఎక్కువడా వాడేశారు. అతి హింస, శృంగార సన్నీవేశాల కారణంగా ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ వెబ్‌ సిరీస్‌ని చూడలేరు. కానీ ఒక సెక్షన్‌ ఆఫ్‌ ఆడియన్స్‌కి మాత్రం బాగా నచ్చుతుంది. 

ఎవరెలా చేశారంటే.. 
బాలి పాత్రకి వందశాతం న్యాయం చేశాడు రిషి. అమాయకత్వం, కోపం, ఆవేశం... ప్రతిది చక్కగా తెరపై చూపించాడు. జయప్రదగా దేవయాని శర్మ డీ గ్లామర్ లుక్‌లో బోల్డ్ యాక్టింగ్ చేశారు. గుమ్తి పాత్రలో జాఫర్‌ని తప్ప మరొకరిని ఊహించుకోలేము. కామాక్షి భాస్కర్ల, షెల్లీ, రవి కాలేతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నికల్ పరంగా ఈ వెబ్‌ సిరీస్‌ బాగుంది.

-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement