గతాన్ని వెతుక్కుంటూ భరత్‌... | Vijay Antony Kaasi Sneak Peek Released | Sakshi
Sakshi News home page

Published Tue, May 15 2018 8:08 PM | Last Updated on Tue, May 15 2018 8:18 PM

Vijay Antony Kaasi Sneak Peek Released - Sakshi

కాశి చిత్రంలో ఓ దృశ్యం

సాక్షి, హైదరాబాద్‌: కోలీవుడ్‌లో విజయ్‌ ఆంటోనీకి విలక్షణ నటుడనే పేరుంది. పిచ్చైకారన్‌(బిచ్చగాడు) భారీ విజయం తర్వాత తెలుగులోని అతని సినిమాల పట్ల ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. అయితే ఆ తర్వాత వచ్చిన చిత్రాలేవీ బిచ్చగాడు స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. కానీ, తన సినిమాలోని ఆసక్తికర అంశాలతో రిలీజ్‌కు ముందే యూట్యూబ్‌లో కొంత భాగాన్ని విడుదల చేయటం విజయ్‌ అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో తన తర్వాతి చిత్రం కాళీ(తెలుగులో కాశి) స్నీక్‌ పీక్‌ పేరిట సుమారు 9 నిమిషాల వీడియో వదిలాడు. 

సక్సెస్‌ ఫుల్‌ కార్డియాలిస్ట్‌ అయిన భరత్‌ అమెరికాలో ఆస్పత్రి పెట్టుకుని తల్లిదండ్రులతో హాయిగా జీవిస్తుంటాడు. అయితే అతని జీవితాన్ని ఓ కల వెంటాడుతుంది. పామును చూసి భయపడ్డ ఓ ఎద్దు అక్కడున్న ఓ చిన్నారిని పొడవటానికి వస్తుంటుంది. అక్కడే ఉన్న ఆ పిల్లాడి తల్లి అతన్ని కాపాడబోతుండగా.. కల చెదిరిపోతుంది. ఇదిలా ఉంటే తన తల్లికి రెండు కిడ్నీలు పాడైపోవటంతో భరత్‌.. కిడ్నీ దానం చేసేందుకు సిద్ధమౌతాడు. కానీ, భరత్‌ తండ్రి అతను తమ సొంత కొడుకు కాదంటూ అతన్ని అడ్డుకుంటాడు. 

తనను పెంచిన అమ్మ ఆరోగ్యం కోలుకున్నాక.. తన కలకు, గతానికి ఏదో సంబంధం ఉందంటూ భరత్‌ ఇండియాకు వస్తాడు. తనను పెంపుడు తల్లిదండ్రులకు దత్తత ఇచ్చిన ఆశ్రమం అడ్రస్‌కు వెళ్తాడు. అక్కడి నుంచి కాశి కథ ప్రారంభమౌతుంది. అంజలి, సునైనా, నాజర్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. ఈ చిత్రానికి కృతిక ఉదయనిధి దర్శకురాలు. తెలుగులో నిర్మాత రామసత్యనారాయణ విడుదల చేయబోతున్నారు. మే 18న కాశి విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement