చాణక్యుడి ఆట.. యముడి వేట!
సమాజంలో మార్పు తీసుకు రావడానికి రాజకీయ అండ ముఖ్యమని భావించి, ఓ యువకుడు రాజకీయాల్లో ప్రవేశిస్తాడు. ప్రజలకు సేవ చేస్తాడు. ఎన్నికల్లో అతడికి ఎదురెళ్లితే ఓటమి తప్పదని, అతడి పక్కనుండే అతణ్ణి ఓడించాలని కొందరు ప్రయత్నిస్తారు. రాజకీయ చాణక్యుల కుటిల ఆటలను యముడి లాంటి ఆ యువకుడు ఎలా వేటాడాడనేది మహాశివరాత్రికి విడుదలవుతున్న ‘యమన్’లో చూడమంటున్నారు తమిళ హీరో విజయ్ ఆంటోని.
జీవశంకర్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన తమిళ సినిమా ‘యమన్’ని లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలసి ద్వారకా క్రియేషన్స్ అధినేత మిర్యాల రవీందర్‌రెడ్డి అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘‘రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన విభిన్నమైన చిత్రమిది. పాటలు, ఫైట్స్, రొమాన్స్... కమర్షియల్ హంగులన్నీ సినిమాలో ఉన్నాయి. ‘బిచ్చగాడు’ కంటే పెద్ద హిట్ సాధిస్తుంది’’ అన్నారు మిర్యాల రవీందర్‌రెడ్డి. మియా జార్జ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మాటలు–పాటలు: భాష్యశ్రీ, సంగీతం: విజయ్ ఆంటోని, సమర్పణ: మిర్యాల సత్యనారాయణరెడ్డి.