Yaman
-
మేకింగ్ ఆఫ్ మూవీ - యమన్
-
కథను నమ్మితే సినిమా హిట్టే
ఎవరీ విజయ్ ఆంటోని? తెలుగోడు కాదు, తమిళియన్... ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు... అసలు హీరో కావాలని ఫిల్మ్ ఇండస్ట్రీకి రాలేదు... ఓ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు... ఇప్పుడతను తమిళంతో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ హాట్‌షాట్ హీరో! గతేడాది శివరాత్రికి ‘బిచ్చగాడు’, ఈ ఏడాది శివరాత్రికి ‘యమన్’ (ఈ 24న విడుదలైంది)... హీరోగా తెలుగులో సూపర్ సక్సెస్‌లు అందుకున్నారు విజయ్ ఆంటోని. సంగీత దర్శకుడిగా తెలుగులో ‘మహాత్మ’, ‘దరువు’ చిత్రాలతో పాటు ఎన్నో తమిళ చిత్రాలకు సూపర్ హిట్ సాంగ్స్ అందించిన ఆయన.. ఇప్పుడు హీరోగా వరుస సక్సెస్‌లు కొడుతున్నారు. ప్రేక్షకుల్లో మంచి సినిమాలు చేస్తాడనే పేరు తెచ్చుకున్నారు. విజయ్ ఆంటోని సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేదు. పోనీ, మంచి హైటు–వెయిటు, రంగు–రూపు ఉన్నాయా? అని చూస్తే... లేవనే చెప్పాలి. జస్ట్, ప్రేక్షకుల్లో ఒకరిలా.. సాదాసీదాగా ఉంటారు. మరి, వరుసగా ఇన్ని హిట్స్ ఎలా వస్తున్నాయంటే... విజయ్ ఆంటోని కథను నమ్మి సినిమాలు చేస్తారు. ఆయన హీరోగా చేసిన మొదటి సినిమా ‘నకిలి’ నుంచి తాజా ‘యమన్’ వరకూ... ప్రతి సినిమాలోనూ కథే హీరో. ఆరు పాటలు, ఫైట్లు, నాలుగు కామెడీ ఎపిసోడ్స్, రెండు సెంటిమెంట్ సీన్లు.. అనుకుంటున్న టైమ్‌లో కథే ప్రధానంగా సినిమాలు చేస్తున్నారాయన. కథను నమ్ముకుంటే సినిమా హిట్ అనే ఫార్ములాను నిరూపించారు. మంచి చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు విజయ్ ఆంటోనీని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఎంతగా అభిమానిస్తున్నారంటే... తమిళంలోకన్నా తెలుగు లోనే ‘బిచ్చగాడు’ భారీ హిట్ సాధించింది. ‘బిచ్చగాడు’ తర్వాత విజయ్ ఆంటోని నటించిన ‘భేతాళుడు’ టాక్ ఎలా ఉన్నా... మంచి వసూళ్లు వచ్చాయి. టేకింగ్ పరంగా మంచి పేరొచ్చింది. ఇప్పుడీ ‘యమన్’కు టాక్‌తో పాటు కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ‘యమన్’ విషయానికి వస్తే... రాజకీయ నేపథ్యంతో కూడిన థ్రిల్లర్ చిత్రమిది. రాజకీయాల్లో శత్రువులు ఎక్కడో దూరంగా ఉండరు. పక్కనే ఉంటా రనేది కథ. సహజత్వానికి దగ్గరగా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో తీశారు. తమిళంతో సమానంగా తెలుగులో ఓపెనింగ్స్ వచ్చాయి. కథ, డైలాగులు, విజయ్ ఆంటోని నటనకు మంచి పేరొచ్చింది. వెబ్ మీడియా ఈ చిత్రానికి మంచి రేటింగ్స్ ఇచ్చింది. శుక్రవారం ఎంత వసూళ్లు ఉన్నాయో శనివారం కూడా అంతే ఉన్నాయి. ఆదివారం వసూళ్లు మరింత పెరిగాయి. ఈ రోజు (సోమవారం) అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. వసూళ్లు స్టడీగా ఉన్నాయి. మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన మా ద్వారకా క్రియేషన్స్ సంస్థ ద్వారా ‘యమన్’ను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. భవిష్యత్తులోనూ ఇలాంటి మంచి సినిమాలు ప్రేక్షకులకు అందిస్తామన్నారు. -
అప్పుడు తెలుగంటే భయం!
‘‘గతంలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్స్‌కి డిఫరెంట్‌గా ఉంటుందీ ‘యమన్’. ఇందులో నేను అంజనా అనే హీరోయిన్గా నటించా. రియల్ లైఫ్‌లో నేను హీరోయిన్ కావడంతో పాత్రతో సులభంగా కనెక్ట్ అయ్యా. కానీ, అంజనాతో నాకెలాంటి పోలికలూ లేవు. నేను హీరోయిన్ అయినా సాధారణ అమ్మాయిలానే ఉంటా’’ అన్నారు మియా జార్జ్. విజయ్ ఆంటోని హీరోగా జీవశంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘యమన్’ చిత్రాన్ని తెలుగులో మిర్యాల రవీందర్‌రెడ్డి విడుదల చేస్తున్నారు. రేపు రిలీజవుతున్న ఈ సినిమా గురించి మియా చెప్పిన ముచ్చట్లు. అనుకోకుండా అంజనా ఓ సమస్యలో చిక్కుకున్నప్పుడు హీరో సహాయం కోరుతుంది. తర్వాత అతణ్ణి పెళ్లి చేసుకుంటుంది. అప్పుడామె లైఫ్‌లో వచ్చిన మార్పులేంటి? హీరో లైఫ్‌లో ఆమె పాత్ర ఏంటి? అనేవి ఆసక్తికరం. తప్పు చేసినవాడికి శిక్ష తప్పదనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళం, తమిళంలో కలిపి ఓ 20 సినిమాల వరకూ చేశా. కానీ, ఒక్క సినిమాలోనూ పాటలకు డ్యాన్స్ చేయలేదు. హీరోయిన్గా నాలుగేళ్ల కెరీర్లో ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో డ్యాన్స్ చేశా. చాలా హ్యాపీగా ఉంది. తెలుగులో విడుదలవుతోన్న నా తొలి చిత్రమిది. నిజానికి, సునీల్ ‘ఉంగరాల రాంబాబు’ ముందు విడుదల అవుతుందనుకున్నా. ఇంకా ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. ‘ఉంగరాల రాంబాబు’కి ముందు తెలుగులో కొన్ని ఛాన్సులు వచ్చాయి. నాకు తెలుగు రాదు. ఆ భయంతో చేయలేదు. మలయాళం, తమిళ భాషలు కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి. అందువల్ల, తమిళ సినిమాలు చేశా. అప్పుడు తెలుగులోనూ చేయగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది. ‘ఉంగరాల రాంబాబు’ తర్వాత మరిన్ని తెలుగు చిత్రాలు చేయాలనుంది. -
ఆయనలో అది నాకెంతో నచ్చింది
మియాజార్జి టీనగర్: నటుడు విజయ్ ఆంటోని నిరాడంబరత తనకెంతో నచ్చిందని నటి మియాజార్జి తెలిపారు. జీవా శంకర్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని, మియాజార్జి నటిస్తున్న చిత్రం ‘ఎమన్’. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో రాజు మహాలింగం, విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఫాతిమా విజయ్ ఆంటోని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యమన్ చిత్రం ఈనెల 24వ తేదీన విడుదల కానుంది. ఇందులో నటించడం గురించి మియాజార్జి మాట్లాడుతూ యమన్ చిత్రంలో తాను నటించేందుకు రెండు ముఖ్య కారణాలు ఉన్నాయని, అవేమంటే తనను తమిళ చిత్రరంగానికి పరిచయం చేసిన దర్శకులు జీవాశంకర్, విభిన్న తరహా కథలను ఎంపిక చేసి నటించే విజయ్‌ఆంటోని అన్నారు. జీవా శంకర్‌తో కలిసి పనిచేస్తున్న రెండవ చిత్రం యమన్ అన్నారు. ‘అమర కావ్యం’ చిత్రం నుంచి ప్రత్యేక తరహా పాత్రలో ఇందులో నటిస్తున్నట్లు తెలిపారు. విజయ్ ఆంటోనీ నిరాడంబరమైన వ్యక్తిత్వం నచ్చిందని అన్నారు. అంతేకాకుండా 24 గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేసే ఆయనతో నటించడం సంతోషంగా ఉందన్నారు. యమన్ చిత్రంలో తాను అంజనా అనే పాత్రను పోషిస్తున్నానని తెలిపారు. ఈ చిత్రంలో తనకు మొట్టమొదటి సారిగా స్పెషల్ సాంగ్‌ను ఇచ్చారని, ఈ పాట తనకు అభిమానుల నుంచి ప్రత్యేక తరహా గుర్తింపునిస్తుందన్నారు. -
చాణక్యుడి ఆట.. యముడి వేట!
సమాజంలో మార్పు తీసుకు రావడానికి రాజకీయ అండ ముఖ్యమని భావించి, ఓ యువకుడు రాజకీయాల్లో ప్రవేశిస్తాడు. ప్రజలకు సేవ చేస్తాడు. ఎన్నికల్లో అతడికి ఎదురెళ్లితే ఓటమి తప్పదని, అతడి పక్కనుండే అతణ్ణి ఓడించాలని కొందరు ప్రయత్నిస్తారు. రాజకీయ చాణక్యుల కుటిల ఆటలను యముడి లాంటి ఆ యువకుడు ఎలా వేటాడాడనేది మహాశివరాత్రికి విడుదలవుతున్న ‘యమన్’లో చూడమంటున్నారు తమిళ హీరో విజయ్ ఆంటోని. జీవశంకర్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన తమిళ సినిమా ‘యమన్’ని లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలసి ద్వారకా క్రియేషన్స్ అధినేత మిర్యాల రవీందర్‌రెడ్డి అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘‘రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన విభిన్నమైన చిత్రమిది. పాటలు, ఫైట్స్, రొమాన్స్... కమర్షియల్ హంగులన్నీ సినిమాలో ఉన్నాయి. ‘బిచ్చగాడు’ కంటే పెద్ద హిట్ సాధిస్తుంది’’ అన్నారు మిర్యాల రవీందర్‌రెడ్డి. మియా జార్జ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి మాటలు–పాటలు: భాష్యశ్రీ, సంగీతం: విజయ్ ఆంటోని, సమర్పణ: మిర్యాల సత్యనారాయణరెడ్డి. -
నేను గొప్ప నటుణ్ణి కాదు
– విజయ్ ఆంటోని ‘‘నిజాయితీగా చెప్పాలంటే... నేను గొప్ప నటుణ్ణి కాదు. టీవీల్లో చిన్నారులు నాకంటే వందరెట్లు బాగా చేస్తున్నారు. కానీ, హీరోగా మంచి స్థానంలో మీముందున్నానంటే కారణం... నేను ఎంపిక చేసుకునే కథలే. ‘బిచ్చగాడు’ విజయానికీ కథే కారణం, నేను కాదు’’ అన్నారు విజయ్ ఆంటోని. జీవశంకర్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన తమిళ సినిమా ‘యమన్’. ద్వారకా క్రియేషన్స్ అధినేత మిర్యాల రవీందర్‌రెడ్డి అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. విజయ్ ఆంటోని స్వరపరిచిన పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. శివరాత్రి సందర్భంగా ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. విజయ్ ఆంటోని మాట్లాడుతూ – ‘‘రాజకీయ నేపథ్యంతో కూడిన కమర్షియల్ చిత్రమిది. యాక్షన్, సస్పెన్స్‌లతో కథ సాగుతుంది. నా గత చిత్రాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో ఐదు పాటలున్నాయి’’ అన్నారు. ‘‘గతేడాది శివరాత్రికి ‘బిచ్చగాడు’ విడుదలైంది. ఈ శివరాత్రికి వస్తోన్న ‘యమన్’ ఆ సిన్మా కంటే పెద్ద హిట్టవుతుంది’’ అన్నారు మిర్యాల రవీందర్‌రెడ్డి. చిత్ర కథానాయిక మియా జార్జ్, బీఏ రాజు పాల్గొన్నారు. -
యమన్ మూవీ స్టిల్స్
-
ఇద్దరు యముళ్ల చిత్రం యమన్
ఇద్దరు యమధర్మరాజుల్లాంటి విజయ్‌ఆంటోని, జీవీ శంకర్ల చిత్రం యమన్ అని నటుడు విజయ్‌సేతుపతి వ్యాఖ్యనించారు. కథానాయకుడిగా,సంగీతదర్శకుడిగా వరస విజయాలను సాధిస్తున్న విజయ్‌ఆంటోని తాజా చిత్రం యమన్ . లైఖా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాన్ చిత్రం ఫేమ్ జీవీశంకర్ దర్శకుడు. మియాజార్జ్ కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు త్యాగరాజన్ పోషించారు.ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం సినీ మాల్లో ఘనంగా జరిగింది. సీనియర్ దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్, గోపురం ఫిలింస్ అన్భుసెలియన్ ముఖ్యఅతిథులుగా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించగా తొలి సీడీని యువ నటుడు విజయ్‌సేతుపతి అందుకున్నారు. ఈ సందర్భంగా లైకా సంస్థ నిర్వాహకుడు రాజు మహాలింగం మాట్లాడుతూ సంగీతదర్శకుడు, చాయాగ్రాహకుడు చిత్రానికి రెండు పిల్లర్లలాంటి వారన్నారు. తమ చిత్రానికి కథానాయకుడు, సంగీతదర్శకుడు ఒకరే కావడం లక్కీ అన్నారు. అదే విధంగా ఛాయాగ్రహకుడు జీవా శంకర్ యమన్ చిత్రానికి, దర్శకుడు కావడం బాగా ప్లస్ అయ్యిందన్నారు. ఇక ఇందులో ఒక ముఖ్య పాత్రను పోషించిన నటుడు త్యాగరాజన్ ర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు.ఈ యమన్ చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణను పొందుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. అనంతరం నటుడు విజయ్‌సేతుపతి మాట్లాడుతూ యమన్ దర్శకుడు జీవశంకర్ మొదట తనకు చెప్పారన్నారు. అయితే ఈ కథకు పర్ఫెక్ట్ కథానాయకుడు విజయ్‌ఆంటోని అనిపించిందని ఆయన ఇందులో నటించడం సంతోషంగా ఉందని అన్నారు. విజయ్‌ఆంటోని, జీవాశంకర్ లాంటి ఇద్దరు యమధర్మరాజులు చేసిన చిత్రం యమన్ అని పేర్కొన్నారు. విజయ్‌ఆంటోని తొలిసారిగా ఈ చిత్రంలో డ్యాన్స్ చేశారని, అది చూడాలన్న ఆసక్తి తనకు కలుగుతోందని అన్నారు.ఈ కార్యక్రమంలో జ్ఞానవేల్‌రాజా, టి.శివ, శశి, ఐన్ న్ కరుణాకరన్, కాట్రగడ్డ ప్రసాద్, రూపామంజరి, చిత్ర నాయకి మియాజార్జ్ పాల్గొన్నారు. -
రాజకీయ నేపథ్యంలో యమన్
యమన్ చిత్రం పోలిటికల్ థ్రిల్లర్ అని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు జీవాశంకర్. ఈయన ఇంతకుముందు సంగీత దర్శకుడు విజయ్‌ఆంటోని హీరోగా పరిచయం చేస్తూ నాన్ అనే హిట్ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. ఆ తరువాత అమరకావ్యం చిత్రం చేశారు. తాజాగా విజయ్‌ఆంటోని కథానాయకుడిగా తెరపై ఆవిష్కరించిన చిత్రం యమన్ . మియాజార్జ్ కథానాయకిగా నటించిన ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. యమన్ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ తాను దర్శకత్వం వహిస్తున్న తొలి పూర్తి కమర్షియల్ కథా చిత్రం ఇదన్నారు. అంతే కాదు యమన్ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం అని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ఈ చిత్ర కథ, కథనాలు ఉంటాయని తెలిపారు. రాజకీయ నాయకుల పాయింట్ ఆఫ్ వ్యూలో చిత్రంలో సంఘటనలు ఉంటాయన్నారు. ఒక పర్టిక్యులర్ ఇష్యూను వారు ఎలా హ్యాండిల్ చేస్తారన్న విషయాన్ని ఈ చిత్రంలో చూపినట్లు చెప్పారు. ఇందులో విజయ్ ఆంటోని నటన వైవిధ్యంగా ఉంటుందన్నారు. ఇక నటి మియా జార్జ్ విషయానికొస్తే తను ఈ చిత్రంలోనూ నటిగానే కనిపిస్తారన్నారు. రాజకీయ నాయకులకు, నటీనటులకు మధ్య అండర్స్టాండింగ్ ఉంటుందన్నది కూడా ఈ చిత్రంలో చూపించనున్నట్లు తెలిపారు. చిత్ర షూటింగ్ అధిక భాగాన్ని చెన్నై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. అదే విధంగా జైలు సెట్‌ను పుదుచ్చేరిలో వేసి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించామని, రెండు పాటల్ని ముంబై, జార్జీయాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. విజయ్‌ఆంటోని సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న యమన్ పిబ్రవరి నెలలో తెరపైకి రానుందని దర్శకుడు జీవాశంకర్ వెల్లడించారు. బ్లాక్‌బస్టర్ చిత్రం పిచ్చైక్కారన్, సైతాన్ తరువాత విజయ్‌ఆంటోని నటించిన తాజా చిత్రం యమన్ కావడం గమనార్హం.