రాజకీయ నేపథ్యంలో యమన్
యమన్ చిత్రం పోలిటికల్ థ్రిల్లర్ అని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు జీవాశంకర్. ఈయన ఇంతకుముందు సంగీత దర్శకుడు విజయ్‌ఆంటోని హీరోగా పరిచయం చేస్తూ నాన్ అనే హిట్ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. ఆ తరువాత అమరకావ్యం చిత్రం చేశారు. తాజాగా విజయ్‌ఆంటోని కథానాయకుడిగా తెరపై ఆవిష్కరించిన చిత్రం యమన్ . మియాజార్జ్ కథానాయకిగా నటించిన ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. యమన్ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ తాను దర్శకత్వం వహిస్తున్న తొలి పూర్తి కమర్షియల్ కథా చిత్రం ఇదన్నారు. అంతే కాదు యమన్ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం అని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ఈ చిత్ర కథ, కథనాలు ఉంటాయని తెలిపారు. రాజకీయ నాయకుల పాయింట్ ఆఫ్ వ్యూలో చిత్రంలో సంఘటనలు ఉంటాయన్నారు. ఒక పర్టిక్యులర్ ఇష్యూను వారు ఎలా హ్యాండిల్ చేస్తారన్న విషయాన్ని ఈ చిత్రంలో చూపినట్లు చెప్పారు. ఇందులో విజయ్ ఆంటోని నటన వైవిధ్యంగా ఉంటుందన్నారు. ఇక నటి మియా జార్జ్ విషయానికొస్తే తను ఈ చిత్రంలోనూ నటిగానే కనిపిస్తారన్నారు. రాజకీయ నాయకులకు, నటీనటులకు మధ్య అండర్‌స్టాండింగ్ ఉంటుందన్నది కూడా ఈ చిత్రంలో చూపించనున్నట్లు తెలిపారు. చిత్ర షూటింగ్ అధిక భాగాన్ని చెన్నై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు.
అదే విధంగా జైలు సెట్‌ను పుదుచ్చేరిలో వేసి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించామని, రెండు పాటల్ని ముంబై, జార్జీయాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. విజయ్‌ఆంటోని సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న యమన్ పిబ్రవరి నెలలో తెరపైకి రానుందని దర్శకుడు జీవాశంకర్ వెల్లడించారు. బ్లాక్‌బస్టర్ చిత్రం పిచ్చైక్కారన్, సైతాన్ తరువాత విజయ్‌ఆంటోని నటించిన తాజా చిత్రం యమన్ కావడం గమనార్హం.