టెర్మినేటర్ సిరీస్‌లో వస్తోన్న తాజా చిత్రం ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్’. హాలీవుడ్ యాక్షన్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ నటించిన ఈ చిత్రాన్ని హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ నిర్మించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నవంబరు 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను ఆవిష్కరించిన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘టెర్మినేటర్ సిరీస్‌లో వచ్చిన సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. నేను విడుదల చేసిన ఈ ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్’ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. తొలిసారి నేను హాలీవుడ్ మూవీ ‘300’ను తెలుగు డబ్బింగ్‌లో చూశాను. అప్పట్లో హాలీవుడ్ సినిమా తెలుగు డబ్బింగ్ విచిత్రంగా ఉండేది.
ఇప్పుడు ఈ విషయంలో బాగా క్వాలిటీ పెరిగింది. హాలీవుడ్ సినిమాలను మా చేత ప్రచారం చేయిస్తున్నారు. మా సినిమాలను కూడా యూఎస్‌లో ప్రమోట్ చేసేలా డిస్నీ సంస్థ ఆలోచించాలి. ఇలాంటి యాక్షన్ సినిమాలను ప్రభాస్ అన్నలాంటి హీరోలు చేస్తే బాగుంటుంది. ఇక పూరీగారి దర్శకత్వంలో నేను హీరోగా నటించాల్సిన ‘ఫైటర్’ సినిమా కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాల్సి ఉంది. హాలీడేకి వెళ్లి ఇప్పుడే తిరిగొచ్చాను. ఈ హాలీడేలో ఐదారు కేజీలు పెరిగాను. వర్కౌట్ స్టార్ట్ చేయాలి. ఈ సినిమాలో నేను సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తానా? అనే విషయం ఇప్పుడే చెప్పలేను’’ అన్నారు. ‘డిస్నీ సంస్థలో సూపర్‌హీరోస్ సినిమాలు వస్తుంటాయి. మీ లైఫ్‌లో ఉన్న సూపర్ హీరో ఎవరు?’ అన్న ప్రశ్నకు ‘‘మా అమ్మే నా సూపర్ హీరో’’ అన్నారు విజయ్. ‘‘ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన విజయ్ దేవరకొండకు థ్యాంక్స్. ‘అలాద్దీన్, అవెంజర్స్: ఎండ్‌గేమ్’ వంటి సినిమాలను దక్షిణాదిలో విడుదల చేసినప్పుడు ఎక్కువమంది ప్రేక్షకులు తమ ప్రాంతీయ భాషల్లో చూడటానికి ఇష్టపడ్డట్లు గమనించాం. అందుకే ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు డిస్నీ సంస్థ ప్రతినిధి విక్రమ్ దుగ్గల్.
Comments
Please login to add a commentAdd a comment