విజయ్ మా బంగారు కొండ
‘‘పెళ్లి చూపులు’ చిత్రానికి ముందే విజయ్ దేవరకొండతో ‘ద్వారక’ కథతో సినిమా తీయాలనుకున్నాం. కాకపోతే.. ‘పెళ్లిచూపులు’ ముందు మొదలైంది. దాంతో ఫస్ట్ ఆ చిత్రం విడుదలై, హిట్ అయింది. మా చిత్రం ఆలస్యమైనా ఆ విజయం మాకు కలిసి వచ్చింది. అందుకే విజయ్ మాకు బంగారు కొండ’’ అన్నారు నిర్మాతలు ప్రద్యుమ్న చంద్రపాటి, గణేశ్ పెనుబోతు. విజయ్ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా రచయిత శ్రీనివాస్ రవీంద్రను దర్శకునిగా పరిచయం చేస్తూ ఆర్‌బీ చౌదరి సమర్పణలో ప్రద్యుమ్న, గణేశ్ నిర్మించిన ‘ద్వారక’ మార్చి 3న విడుదలవుతోంది. నిర్మాతలు చెప్పిన విశేషాలు..
► ఇప్పుడొస్తున్న రొటీన్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ‘ద్వారక’ ఉంటుంది. ప్రేమ, వినోదంతో పాటు సమాజానికి ఓ సందేశం ఉంటుంది. ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ తరహాలో ఎంటర్‌టైనింగ్‌గా సాగే సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు మా చిత్రంలో ఉంటాయి.
► ‘ద్వారక’ చిత్ర కథకు ముందు మేం పలు కథలు విన్నా, ఏవీ నచ్చలేదు. సీనియర్ రచయితశ్రీనివాస్‌గారు మంచి కథ తయారు చేశారు. తను కథ చెప్పగానే ‘ఈ సినిమా మనం చేస్తున్నాం’ అని ఫిక్స్ అయ్యాం.
► విజయ్‌లో మాకు నచ్చేది కథలు ఎంచుకునే విధానం. రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ అవుతున్నాడు. తనకు ‘పెళ్లి చూపులు’ చిత్రంతో ఎంత క్రేజ్ వచ్చిందో, ‘ద్వారక’తో అంతకు మించి రెట్టింపు క్రేజ్ వస్తుందనే నమ్మకం మాకుంది.
► ఈ చిత్రంలో విజయ్ అందరూ అనుకుంటున్నట్లు బాబా కాదు. తను ఓ దొంగ. డబ్బు సంపాదించడం కోసం బాబాలా మారతాడు. డబ్బులు చేతికొచ్చాక తనని మంచి వైపు కొందరు లాగుతుంటే, మరికొందరు చెడువైపు లాగుతారు. ఫైనల్‌గా తను ఎలాంటి మార్గం ఎంచుకున్నాడు? ఏం చేశాడు? అన్నది ఆసక్తిగా ఉంటుంది.
► ఈ చిత్రకథ నచ్చడంతో సీనియర్ నిర్మాత ఆర్.బి. చౌదరిగారు మాతో అసోసియేట్ అయ్యారు. ఆయన అనుభవం మాకు ఉపయోగపడింది.
► ప్రకాశ్‌రాజ్, మురళీ శర్మ, ‘థర్టీ ఇయర్స్’ పృధ్వీతో పాటు ఇతర నటులు కథకు అనుగుణంగా కుదిరారు. ∙పూజా ఝవేరి కథానాయిక పాత్రకి కరెక్ట్‌గా సరిపోయింది. మన కుటుంబంలో ఓ అమ్మాయిలా ఉంటుంది. చాలా డెడికేటెడ్. ‘ద్వారక’లో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర తనది.
► సినిమా అంటే మాకు ప్యాషన్. సమాజంపై బాధ్యతతో ఒక మంచి చిత్రం తీశామనే ఆత్మ సంతృప్తి ‘ద్వారక’తో మాకు కలిగింది.
► మా చిత్రానికి కథ, మాటలు, పాటలు, కెమెరా హైలెట్. సాయికార్తీక్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. సాహిత్యం కూడా బాగా కుదిరింది. పాటలకు ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వస్తోంది. శ్యాం కె.నాయుడు కెమెరా పనితనం, ప్రవీణ్ పూడి ఎడిటింగ్, బ్రహ్మ కడలి ఆర్ట్ సినిమాకే హైలెట్.
► ‘పెళ్లి చూపులు’తో విజయ్‌కి బాగా క్రేజ్ రావడంతో ఈ చిత్రం బిజినెస్ కూడా బాగా జరిగింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని ఏరియాల నుంచి సీనియర్ డిస్ట్రిబ్యూటర్లు మా చిత్రం కొనడం ఆనందంగా ఉంది. ఓ రకంగా అది మా అదృష్టం. వారి ద్వారా మంచి థియేటర్లు దక్కాయి. ఓవర్సీస్‌లో స్నేహితుల సపోర్ట్‌తో సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. అక్కడ ప్రమోషన్ పూర్తి చేశాం. ఓ మంచి సినిమా చూశామనే ఫీల్‌తో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకొస్తారు.