
సర్కార్ చిత్రంలో ఓ దృశ్యం
సినిమా: ఇళయదళపతి విజయ్ అభిమానులకో శుభవార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం సర్కార్. ఈ పేరులోనే రాజకీయాలు తొణికి చూస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి ఏఆర్.మురుగదాస్ దర్శకుడు కావడంతో సర్కార్ నిజంగానే శివమెత్తుతుందనిపిస్తోంది. ఇందులో సమకాలీన రాజకీయాల అంశాలు ఉంటాయని చిత్ర వర్గాలు ముందుగానే వెల్లడించి మరింత వేడిని పెంచేశారు. నటి కీర్తీసురేశ్ నాయకిగా నటించింది. ఇక సంచలన తార వరలక్ష్మీశరత్‌కుమార్ రాజకీయ నాయకురాలిగా కనిపించనుంది. ఆమెతో పాటు రాధారవి నటించారు. సన్ పిక్చర్స్ పతాకంపై దయానిధి మారన్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో, టీజర్ ఇప్పటికే విడుదలై విశేష ప్రేక్షకాదరణను చూరగొంటున్నాయి. ముఖ్యంగా టీజర్ సుమ్మ అదిరిందనే టాక్‌తో రికార్డులు బద్దలు కొడుతోంది.
చిత్రంలో విదేశాల్లో పారిశ్రామిక వేత్తగా రాణిస్తున్న విజయ్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి తమిళనాడుకు రాగా, ఆయన ఓటు వేరే వారు వేయడంతో దిగ్భ్రాంతికి ఆయన రాజకీయనాయకులతో ఢీకొనడమే సర్కార్ చిత్ర ప్రధానాంశం అన్న విషయం బయటకు పొక్కేసింది. దీంతో మరోసారి సర్కార్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. ప్రతి పక్ష పార్టీకి చెందిన సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించడంతో సర్కార్ చిత్రంపై అంచనాలతో పాటు ఒక విధమైన ఆసక్తి నెలకొంది. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సర్కార్ చిత్రాన్ని దీపావళి సందర్భంగా నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ఇంతకు ముందు ప్రకటించారు. అయితే తాజాగా ఆ తేదీకి నాలుగు రోజుల ముందే అంటే నవంబర్ 2న చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి తాజాగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. దీపావళి పండగ సందర్భంగా వరుసగా సెలవులు రావడంతో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది విజయ్ అభిమానులకు నిజంగా శుభవార్తే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment