తమిళసినిమా: సినిమా చాలా పవర్‌ఫుల్ మాధ్యమం. ఇక్కడ నుంచే చాలా మంది రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు. ఇంకా ఆ పయనం కొనసాగుతూనే ఉంది. రజనీకాంత్, కమలహాసన్ వంటి సినీ ఉద్దండులు రాజకీయరంగంలో పునాదులు వేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇకపోతే ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి భావ స్వేచ్ఛ ఉంటుంది. సమాజంలో జరిగే సంఘటనపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంటుంది. కాగా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలపై స్పందిస్తున్న నటుల్లో విజయ్‌సేతుపతి ఒకరు. తమిళ సినీ పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన సామాజిక అంశాలపైనా దృష్టి సారిస్తున్నారు. ఆయన తూత్తుక్కుడి స్టెర్‌లైట్ పోరాటంలో గానీ, అంతకు ముందు జల్లికట్టు పోరాటం లాంటి సంఘటనపై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించారు. దీంతో విజయ్‌సేతుపతికి రాజకీయ మోహం ఏర్పడుతోందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
ఇదే విషయాన్ని ఇటీవల విజయ్‌సేతుపతి వద్ద ప్రస్తావిస్తూ మీకు రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా తాను రాజకీయాల్లోకి కచ్చితంగా రానని స్పష్టం చేశారు. కారణం తనకు ప్రజల మీద అక్కరే కానీ, రాజకీయాలపై ఆసక్తి లేదన్నారు. ఇంకా చెప్పాలంలే తనకు రాజకీయాలపై సరైన అవగాహన లేదని, రాజకీయ పరిజ్ఞానం లేదని చెప్పారు. రాజకీయ పరిజ్ఞానం లేకుండా ఆ స్థానంలో కూర్చోకూడదన్నది తన అభిప్రాయం అన్నారు. ఈ వ్యవస్థలో జరుగుతున్న సరి అని కొందరూ, తప్పు అని మరి కొందరు అంటున్నారన్నారు. ఆ విధంగా సరైన నిర్ణయాన్ని మనం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని పేర్కొన్నారు. అయితే నేటి యువత అలా కాదని, వారు చాలా వివేకం కలిగి ఉన్నారని అన్నారు. రాజకీయ పరిపక్వతతోనూ ఉన్నారని, వారే రాజకీయాల్లోకి రావాలని నటుడు విజయ్‌సేతుపతి పేర్కొన్నారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు ఎవరికి చురకలో అన్నది చర్చకు దారి తీస్తోంది. విజయ్‌సేతుపతి నటించిన జుంగా చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఆయన మణిరత్నం దర్శకత్వంలో సెక్క సివంద వానం చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో రజినీకాంత్‌తో కలిసి కార్తీక్‌సుబ్బరాజ్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment