మేర్కు తొడర్చి మలై చిత్ర దర్శకుడు లెనిన్ భారతీతో విజయ్‌సేతుపతి
తమిళసినిమా: నేను నిర్మించిన చిత్రం నాకే నచ్చలేదు అన్నారు నటుడు విజయ్‌సేతుపతి. కథానాయకుడిగా వరుస విజయాలతో రైజింగ్‌లో ఉన్న ఈయన నిర్మాతగా మారి మేర్కు తొడర్చి మలై చిత్రాన్ని నిర్మించారు. తన చిరకాల మిత్రుడు లెనిన్‌భారతీని దర్శకుడిగా పరిచయం చేసిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. కాగా మేర్కు తొడర్చి మలై శుక్రవారం విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం థ్యాంక్స్ మీటింగ్‌ను చెన్నైలో నిర్వహించింది. కార్యక్రమంలో విజయ్‌సేతుపతి మాట్లాడుతూ తన చిత్రానికి లభిస్తున్న ప్రశంసలు, విమర్శలకు తాను కారణం కాదన్నారు. నిజం చెప్పాలంటే ఈ చిత్రం తనకు నచ్చలేదన్నారు. చిత్రాన్ని సకాలంలో విడుదల చేయలేకపోయానని చెప్పారు. ఎవరూ చిత్రాన్ని కొనడానికి రాకపోవడమే అందుకు కారణం అన్నారు. చివరికి రూ.70 లక్షలు తగ్గించుకుని అమ్మడానికి సిద్ధపడ్డానన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒకరు వచ్చి అడ్వాన్స్ ఇచ్చి, ఆ తరువాత ఏమనుకున్నారో ఏమో! చిత్రం వద్దంటూ ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసుకెళ్లిపోయారని చెప్పారు. ఆ తరువాతనే సరవణన్ ముందుకు వచ్చి చిత్రాన్ని విడుదల చేశారని తెలిపారు. చిత్రం విడుదలకావడానికి ఆయనే కారణం అని పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం తాను ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఇచ్చేశానని చెప్పారు. చిత్ర దర్శకుడు లెనిన్‌భారతీ నిజాయితీపరుడని, తాను జూనియర్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటి నుంచి తనకు మంచి మిత్రుడని తెలిపారు. చిత్రాన్ని చివరి వరకూ మోసింది దర్శకుడేనని చెప్పారు. చిత్రానికి లభించే అభినందనలు, విమర్శలు ఆయనకే చెందుతాయన్నారు. ఈ చిత్ర హీరో ఆంటని ప్రతిభావంతుడని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment