
సినిమా: నటుడు విజయ్‌సేతుపతి నటించడానికి అంగీకరించిన ఆ చిత్రం వ్యవహారంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇంతకీ ఆ చిత్రం ఏదనేగా మీ ఆసక్తి. శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోగ్రపిను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో మురళీధరన్ పాత్రలో నటుడు విజయ్‌సేతుపతి నటించడానికి అంగీకరించారు. 800 వికెట్లను తీసిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించిన ముత్తయ్య మురళీధన్ బయోపిక్‌కు 800 అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. శ్రీపతి రంగస్వామి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం గురించి విజయ్‌సేతుపతి ఇంతకు ముందు మాట్లాడుతూ 800 వికెట్లను తీసి రికార్డు సృష్టించిన ముత్తయ్య మురళీధరన్ పాత్రలో నటించడం ఘనతగా పేర్కొన్నారు. అయితే ఆయన ఆ పాత్రలో నటించనుండటంపై తీవ్ర విమర్శలు వెల్లెవెత్తుతున్నాయి. వీసీకే పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారు ఇటీవల ఒక ప్రకటను విడుదల చేస్తూ శ్రీలంకలోని కండిలో పుట్టిన తమిళుడు అయినా సింహళుడిగానే పెరిగారన్నారు. ఎల్‌టీటీఈ పోరాటంలో ఆయన శ్రీలంకకు మద్దతుగా నిలిచి ద్రోహం చేశారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి పాత్రలో విజయ్‌సేతుపతి నటించడాన్ని శ్రీలంక తమిళులు అంగీకరించరని అన్నారు. ఇదే విధంగా సామాజిక మాధ్యమాల్లోనూ ముత్తయ్య మురళీధరన్ పాత్రలో విజయ్‌సేతుపతి పోషించనుండటాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంతే కాదు విదేశాల్లోని తమిళులు విజయ్‌సేతుపతి ఆ పాత్రలో నటించకూడదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో పునరాలోచనలో పడ్డ విజయ్‌సేతుపతి ముత్తయ్య మురళీధరన్ పాత్రలో నటించరాదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ఆయన ఇంకా బహిరంగంగా వెల్లడించలేదన్నది గమనార్హం. దీంతో 800 చిత్రం తెరకెక్కుతుందా? అన్న సందేహం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. దీని గురించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.