ఇద్దరు భామలతో విజయ్ సేతుపతి రొమాన్స్
క్రేజీ ముద్దుగుమ్మలు నయనతార, త్రిష విజయ్‌సేతుపతితో రొమాన్స్ చేయనున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. నయనతార, త్రిష ఒకప్పుడు నువ్వా నేనా? అని పోటీ పడ్డా, ఈగోలకు పోయి విమర్శించుకున్నా, ఇప్పుడు మాత్రం క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఎంతగా అంటే పాత విషయాలే గుర్తుకు రానంతగా. కలిసి పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేయడం, ఆ పార్టీల్లో సెల్ఫీలు దిగి ప్రచారం పెంచుకోవడం, ఒకరిని ఒకరు పొగడ్తలతో ముంచెత్తుకోవడం లాంటి విషయాలతో హల్‌చల్ చేస్తున్నారు. అలాంటి నయనతార, త్రిష కలసి నటించబోతున్నారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. అయితే ఆ ప్రచారాన్ని త్రిష ఖండించారు. నయనతో నటించాలన్న కోరిక తనకూ ఉందని,అయితే అలాంటి చిత్రంలో నటించమని తననెవరూ అడగలేదని వివరించారు.తాజాగా ఈ నెచ్చెలిలు ఒక క్రేజీ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరందుకుంది.
ఈ ముద్దుగుమ్మలతో యువ నటుడు విజయ్‌సేతుపతి రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారనేది కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్న వార్త. లక్ అంటే ఈ నటుడుదే అనాలి. ఈ మధ్య క్రేజీ హీరోయిన్లతో నటించడంతో పాటు విజయాలను అందుకుంటున్నారు. ఇటీవల విడుదలైన సేతుపతి విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పటికే విజయ్‌సేతుపతితో నయనతార నానుమ్ రౌడీదాన్ చిత్రంలో నటించారు.ఈ చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్ తాజా చిత్రంలోనూ ఆ జంటే నటించనున్నారని సమాచారం. కాకపోతే అదనపు ఎట్రాక్షన్‌గా మరో సంచలన నటి, నయనతార స్నేహితురాలు త్రిష నటించనున్నారట. దీనికి కాత్తు వాంగుల రెండు కాదల్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించనున్నట్లు, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఒక క్రేజీ చిత్రానికి రంగం సిద్ధమైందన్నది తాజా సమాచారం.