ముంబై: అలనాటి బాలివుడ్ నటుడు వినోద్ ఖన్నా సినీ జీవితం గురించే ఎక్కువ మందికి తెలుసు. కానీ ఆయన ఓషో రజనీష్ ఆశ్రమంలో ‘స్వామి వినోద్ భారతి’గా గడిపిన వివాదాస్పద జీవితం గురించి ఎవరికి ఎక్కువగా తెలియదు. అమితాబ్ బచ్చన్‌తో పోటాపోటీగా బాలివుడ్ సినిమాల్లో నటిస్తున్న కాలంలోనే ఆయన పుణెలోని రజనీష్ ఆశ్రయం పట్ల ఆకర్షితులయ్యారు.
ప్రతి వారంతంలో అక్కడికెళ్లి అక్కడే రెండు రోజులు గడిపి వచ్చేవారు. అందుకు వీలుగా ఆయన తన షూటింగ్‌లన్నీ పుణె చుట్టుపక్కలనే ఉండేలానే చూసుకునేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అంటే, 1975, డిసెంబర్ 31వ తేదీన సినిమాలకు గుడ్‌బై చెబుతున్నానని ఆయన బహిరంగంగా ప్రకటించినప్పుడు బాలివుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అప్పటి నుంచి ఆయన కొత్త సినిమాలను కాల్‌షీట్లు ఇవ్వకుండా షూటింగ్ దశలోవున్న సినిమాలను పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు.
‘కామిగాని వాడు మోక్షగామి కాలేడు. ఇదే జీవితానికి ముక్తి మార్గం’ అంటూ ప్రచారం. చేయడం ద్వారా స్వామి రజనీష్ తన ఆశ్రయాన్ని స్త్రీ, పురుషుల శృంగార లీలలకు నిలయంగా మార్చారు. అప్పటికే విలాస జీవితాన్ని గడుపుతున్న వినోద్ ఖన్నా అటువైపు పూర్తిగా ఆకర్షితులయ్యారు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఎంత చెప్పినా వినకుండా ఆయన 1982లో రజనీష్ ఆశ్రమానికి పూర్తిగా మకాం మార్చేశారు. అక్కడ ఆయన్ని సహచరులు ‘సెక్సీ స్వామీజీ’ అని పిలిచేవారట.
ఆశ్రమాన్ని మూసేయాల్సిందిగా మహారాష్ట్ర పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు పెరగడంతో రజనీష్ తన ఆశ్రమాన్ని అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రానికి మార్చారు. ఆయనతోపాటు వినోద్ ఖన్నా కూడా అమెరికా వెళ్లారు. అక్కడ తాను తోటకు నీళ్లుపోసే వాడినని, తన గురువైన స్వామీజీ రజనీష్ బట్టలు ఉతికే వాడినని వినోద్ ఖన్నా ఆ తర్వాత పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.
అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో ఓ దీవిని కొనుగోలుచేసి అందులోనే రజనీష్ తన ఆశ్రమాన్ని నడిపారు. దానికి రజనీష్‌పురం అని కూడా పేరు పెట్టారు. ఆశ్రమంలో ఎయిడ్స్ కారణంగా ఆరేడుగురు మరణించడంతో కోపగించిన అమెరికా ప్రభుత్వం బలవంతంగా రజనీష్ ఆశ్రమాన్ని 1985లో మూసివేసి రజనీష్‌ను భారత్‌కు పంపించింది. అప్పుడే వినోద్ ఖన్నా కూడా భారత్‌కు వచ్చారు. మళ్లీ పుణెలో రజనీష్‌తోపాటు రెండేళ్లు ఆశ్రమంలోవున్న వినోద్‌కన్నా 1987లో తిరిగి సినీరంగంలో అడుగుపెట్టారు. రజనీష్ మాత్రం 1990లో చనిపోయే వరకు ఆశ్రమంలోనే గడిపారు.
సమాజంలో కావల్సినంత డబ్బు, హోదా లభించడంతో ఇంకేం చేయాలో తోచకా, ఇంకా ఏదో చేయాలనే ఒకలాంటి తాత్విక చింతనతో రజనీష్ మాయలో పడిపోయానని వినోద్ ఖన్నా తన ఆశ్రమ జీవితం గురించి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. సరిగ్గా పీక్ టైమ్‌లో సినిమాలకు వినోద్ ఖన్నా దూరమవడంతో ఆయనకు రావాల్సిన అవకాశాలు కూడా అమితాబ్ బచ్చన్‌కే ఎక్కువ వచ్చాయి.
అమితాబ్ నటించిన ఎక్కువ సినిమాల్లో ఆయన పాత్ర పేరు విజయ్‌కాగా, వినోద్ ఎక్కువగా అమర్ అనే పేరుగల పాత్రల్లో నటించారు. అప్పట్లో వారికి అదో సెంటిమెంట్. 1960లో విడుదలైన ‘మొగల్ ఏ ఆజం’ సినిమాను వినోద్ ఖన్నా తన 14వ ఏటా చూశారు. అప్పుడే తాను హీరో కావాలని నిర్ణయించుకున్నారట. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో వినోద్ ఖన్నాను హాలివుడ్ నటుడు కిర్గ్ డగ్లస్‌తో పోల్చేవారు. ఇద్దరి గదుమ కింద సన్నటి సొట్ట కనిపించడమే అందుకు కారణం.