నటరాజు తనే రాజు
ఇన్నాళ్లూ యాక్షన్ హీరోగా అలరించిన విశాల్ ఈసారి ఫుల్‌కామెడీ పండించడానికి సిద్ధమవుతున్నారు. కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ సుందర్.సి దర్శకత్వంలో విశాల్ హీరోగా తమిళంలో ‘మదగజరాజా’, తెలుగులో ‘నటరాజు తనే రాజు’ చిత్రం రూపొందుతోంది. దీనికి విశాల్ నిర్మాత కావడం విశేషం.
ఇందులో అంజలి కథానాయిక. హీరో శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి మరో నాయికగా చేస్తున్నారు. విశాల్ మాట్లాడుతూ -‘‘ఆద్యంతం వినోదాత్మకంగా ఉండే సినిమా ఇది. సమస్యల్లో ఉన్న స్నేహితుడి కోసం ఏమైనా చేసి అతన్ని మెప్పించాలనే కాంక్షను కలిగిన వ్యక్తిగా ఇందులో నా పాత్రను దర్శకుడు ఆద్భుతంగా తెరకెక్కించారు.
షూటింగ్, డబ్బింగ్ పూర్తయింది. ఈ నెల 30న పాటలను, వచ్చే నెల ప్రథమార్ధంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. సోనూసూద్, సుబ్బరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా: రిచర్డ్స్, నిర్మాణ సారథి: వడ్డి రామానుజం.