హిట్‌పై నమ్మకంతోనే శ్రమిస్తాం
హిట్ అవుతుందన్న నమ్మకంతోనే ఏ చిత్రానికైనా శ్రమిస్తామని యువ నటుడు విశాల్ పేర్కొన్నారు. నేటి తరం నటుల్లో విశాల్‌కు ఒక ప్రత్యేకత ఉంది. తనకు నచ్చిన పని చేయడాన్ని ఎవరు చెప్పినా ఆపరు. అలాగే తాను చెప్పదలచుకున్న విషయాన్ని నిర్భయంగా వెల్లడిస్తారు. తాజాగా నిర్మాతగా మారారు విశాల్. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై పాండినాడు అనే చిత్రాన్ని నిర్మిస్తూ హీరోగా నటిస్తున్నారు. ఆయన హీరోగా నటించిన మరో చిత్రం మదగజరాజ (ఎంజీఆర్) విడుదల హక్కులను తానే సొంతం చేసుకున్నారు. ఆ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పత్రికల వారితో విశాల్ శనివారం భేటీ అయ్యూరు.
ప్రశ్న :మదగజరాజా (ఎంజీఆర్) చిత్రం గురించి చెప్పండి?
జవాబు: 1980లో రజనీకాంత్ రాజాధిరాజా, కమలహాసన్ సకలకళా వల్లభన్ తరహాలో చిత్రం చేయాలని దర్శకుడు సుందర్.సి, నేను భావించాం. అలాంటి పుల్ జాయ్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ఈ మదగజరాజా. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ అంటూ అన్ని జనరంజక అంశాలున్న చిత్రమిది.
ప్రశ్న : చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
జవాబు: ఊటీలో కేబుల్ ఆపరేటర్‌గా నటిం చాను. ఆ పాత్ర ఎదుర్కొన్న సంఘటనల సమాహారమే చిత్రం.
ప్రశ్న: చిత్రంలో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ అంటూ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. వీరిలో ఎవరు బాగా సహకరించారు?
జవాబు: మరో హీరోయిన్గా సదా నటించారు. ఆమె చాలా బాగా సహకారం అందించారు.
ప్రశ్న : మదగజరాజ చిత్ర విడుదలలో జాప్యానికి కారణమేమిటి?
జవాబు : ఈ చిత్రాన్ని జెమినీ సర్క్యూట్ ఫిలిం సంస్థ నిర్మించింది. ఈ ప్రశ్న మీరు ఆ సంస్థను అడగాలి. ప్రతి చిత్రానికీ ఏదో సమస్య ఉం టుం ది. ఈ చిత్రానికి కాస్త ఎక్కువ ఉండొచ్చు. ప్రతి సినిమా హిట్ అవుతుందనే శ్రమిస్తాం. సమస్యలొస్తాయని ఎవరూ ఊహించరు.
ప్రశ్న : ఇప్పుడీ చిత్రాన్ని మీరే విడుదల చేస్తున్నారు కదా?
జవాబు : నేను నటించిన చిత్రాన్ని నేనే విడుదల చేయడానికి ముందుకు రాకపోతే ఎవరు వస్తారు? మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మదగజరాజ తొలి కాపీ చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాను. మొదటి నుంచి ఈ చిత్రంపై ప్రత్యేక ప్రేమ ఉంది. అందుకే మదగజరాజా చిత్రాన్ని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో నేనే విడుదల చేయనున్నాను. తెలుగులో నటరాజ తానే రాజ (ఎన్టీఆర్) అనే పేరును నిర్ణయించాం.
ప్రశ్న: తమిళంలో ఎంజీఆర్ అనే ఉపశీర్షికను తొలగించడానికి కారణం?
జవాబు : ఎంజీఆర్ అంటే ఎనలేని గౌరవం ఉంది. ఆ పేరును ఈ చిత్రానికి ఉపశీర్షికగా పెట్టి అవమానపరచడం ఇష్టం లేక తొలగించాం.
ప్రశ్న : మదగజరాజాను సెప్టెంబర్ 6న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ రోజుకు ఏమైనా ప్రత్యేకత ఉందా?
జవాబు : మదగజరాజా ఫెస్టివల్ చిత్రమని దర్శకుడు సుందర్.సి అంటుండేవారు. అదే విధంగా ఈ చిత్రాన్ని వినాయకచతుర్థి సందర్భంగా విడుదలకు సిద్ధం చేస్తున్నాం. మరో ముఖ్య విషయం ఏమిటంటే సరిగ్గా సెప్టెంబర్ ఆరుకి నేను పరిశ్రమకు వచ్చి దశాబ్దం పూర్తవుతుంది. ఈ సందర్భంగా నా సంస్థలో నేను నటించిన చిత్రం విడుదల కావడం విశేషంగా భావిస్తున్నాను.