
గేమ్ ఛేంజర్ సినిమా (Game Changer Movie) రిజల్ట్‌పై హీరోయిన్ అంజలి (Anjali) తొలిసారి స్పందించింది. కొన్ని ఫలితాలను చూసినప్పుడు బాధగా అనిపిస్తుందని పేర్కొంది. ఈ సంక్రాంతికి అంజలి నటించిన రెండు సినిమాలు రిలీజయ్యాయి. ఒకటి గేమ్ ఛేంజర్ కాగా మరొకటి మదగజరాజ. పన్నెండేళ్లక్రితం అంజలి హీరోయిన్‌గా నటించిన మదగజరాజ ఎట్టకేలకు తమిళనాట విడుదలైంది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో జనవరి 31న రిలీజ్ చేస్తున్నారు.
అంతవరకే నా పని
ఈ సినిమా సమావేశంలో అంజలికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. గేమ్ ఛేంజర్ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఆ సినిమాకు మంచి ఫలితం వచ్చుంటే బాగుండేది కదా.. దానిపై మీ ఫీలింగ్ ఏంటి? అన్న ప్రశ్నకు.. ఒక నటిగా నా పాత్రకోసం నేను బాధ్యత తీసుకోగలను. నా పాత్రను ఎలా పోషించాలి? అందుకోసం వందశాతం ఎఫర్ట్స్ పెడుతున్నానా? లేదా? అన్నదే నా చేతిలో ఉంటుంది. అక్కడితోనే నా పనైపోతుంది. మా సినిమాను జనాలు ఆదరించాలన్నది మా తపన. అందుకోసం ప్రమోషన్స్‌కు వెళ్తుంటాము. ప్రేక్షకులకు మా సినిమా చూడమని చెప్తాము.
ఎవరూ సినిమా బాగోలేదని అనలేదు
అయినా గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడాలంటే దానికోసం ప్రత్యేక ఇంటర్వ్యూ పెట్టాలి. ఎందుకనేది మీ అందరికీ తెలుసు. కొన్ని సినిమాలపై నమ్మకం ఉంచి నటిస్తాము. నేను గేమ్ ఛేంజర్‌ను పూర్తిగా నమ్మాను. ఈ సినిమా చూసిన జనరల్ ఆడియన్స్ ఎవరూ గేమ్ ఛేంజర్ బాగోలేదని చెప్పలేదు. మంచి సినిమా అని కితాబిచ్చారు. సినిమా బాగుండటం వేరు, మంచి సినిమా వేరు.
బాధగా ఉంది
గేమ్ ఛేంజర్ మంచి సినిమా.. మీరు చాలా బాగా యాక్ట్ చేశారు అని నాతో చాలామంది అన్నారు. అది నాకు చాలు. అయినా సరే.. కొంత బాధగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. మదగజరాజ సినిమా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చుంటే ఒప్పుకునేవారా? అన్న ప్రశ్నకు.. అంజలి, వరలక్ష్మి (Varalaxmi Sarathkumar).. కథ ఎవరు చెప్తున్నారనేదాన్ని బట్టి తమ నిర్ణయం ఆధారపడి ఉంటుందన్నారు.
గేమ్ ఛేంజర్
ఇదిలా ఉంటే రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటించిన గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత విజయం రాబట్టలేకపోయింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. చరణ్ ద్విపాత్రాభినయం చేయగా అంజలి కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment