అతనిపై కోపంతో నేనే నిర్మాత అయ్యాను - విశాల్
‘‘సుశీంద్రన్ ఈ కథ చెప్పినప్పుడు ఉత్కంఠకు లోనయ్యాను. ముందు ఈ చిత్రం నిర్మాత వేరే వ్యక్తి. కానీ ఉన్నట్లుండి అతను తప్పుకున్నాడు. దాంతో అతనిపై కోపంతో నేనే నిర్మాతనయ్యా’’ అని విశాల్ అన్నారు. విశాల్ తమిళంలో నటించి, నిర్మించిన చిత్రం ‘పాండ్యనాడు’. సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘పల్నాడు’ పేరుతో విడుదల కానుంది. డి.ఇమ్మాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మంత్రి బాలరాజు ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని తమ్మారెడ్డి భరద్వాజ్, విశాల్‌కు అందించారు.
ఈ సందర్భంగా విశాల్ మరిన్ని విషయాలు చెబుతూ -‘‘హీరోగా నేను చాలా సినిమాలు చేశాను. కానీ హీరోగా చేస్తూ నిర్మించిన చిత్రం మాత్రం ఇదే. నా గత చిత్రాలతో పోల్చి చూస్తే ప్రతి విషయంలోనూ ఈ సినిమా గొప్పగా ఉంటుంది. బిడ్డ పట్ల తండ్రి ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తాడో, అంతే జాగ్రత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఏ సినిమాకీ తీసుకోనన్ని జాగ్రత్తలు ఈ సినిమాకు తీసుకున్నాను. అనుకున్నట్లే అవుట్‌పుట్ చాలాబాగా వచ్చింది. ఇందులో భారతీరాజా నా తండ్రి పాత్ర పోషించారు.
ఆయన కేరెక్టర్ సినిమాకే హైలైట్. ‘పందెంకోడి’ చిత్రం నాకెంత పేరు తెచ్చిందో, అంతే పేరు ఈ చిత్రం కూడా తెస్తుంది. నవంబర్ 1న దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. పూర్తి స్థాయిలో తెలుగు సినిమా చేయాలని నాకు ఎప్పట్నుంచో కోరిక. ‘పల్నాడు’ నిర్మాణ బాధ్యతలు కూడా నేనే తీసుకోవడం వల్ల తెలుగు సినిమా ప్రారంభించలేకపోయాను.
జనవరి నెలలో శశి దర్శకత్వంలో నా తెలుగు సినిమా మొదలవుతుంది’’ అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సి.కల్యాణ్, విక్రమ్‌గౌడ్, శశాంక్ వెన్నెలకంటి, సాహితి తదితరులు ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. లక్ష్మీమీనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో తులసి, విక్రాంత్, సూరీ ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ‘మిర్చి’ మది.