తుప్పరివాలన్ ఫస్ట్‌లుక్ అదుర్స్
తుప్పరివాలన్ చిత్ర ఫస్ట్‌లుక్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కత్తిసండై చిత్రం తరువాత విశాల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తుప్పరివాలన్. నటి ఆండ్రియా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రసన్న, వినయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సీనియర్ నటుడు కే.భాగ్యరాజ్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు మిష్కన్ తెరకెక్కిస్తున్నారు. అరోల్ కరోలి సంగీతం, కార్తీక్ ఛాయాగ్రహణ అందిస్తున్నారు. తుప్పరివాలన్ చిత్రాన్ని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, మద్రాస్ ఎంటర్ ప్రైజెస్ ఎస్.నందకుమార్ కలిసి నిర్మిస్తున్నారు.
ప్రారంభం నుంచి ఇండస్ట్రీలో క్యూరియాసిటీ రేకెత్తిస్తున్న చిత్రం తుప్పరివాలన్. ఇప్పటికే రెండు షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ను ఈ నెలాఖరున చిత్రీకరించనున్నట్టు చిత్ర వర్గాల సమాచారం. కాగా తుప్పరివాలన్ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ పోస్టర్స్‌కు చిత్ర పరిశ్రమలో మంచి స్పందన వస్తోంది. ఇందులో ఉండీ లేనట్టున్న మీసం, నెత్తి మీద టోపీతో విశాల్ కొత్తగా కనిపిస్తుండడం ఆయన ఆభిమానులకు నూతనోత్సాహాన్ని కలిగి స్తోంది. అదే విధంగా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండడం విశేషం.