స్టార్ హీరోకు షాక్
తమిళసినిమా: తుప్పరివాలన్ చిత్రం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తూ విశాల్‌కు షాక్ ఇచ్చింది. విశాల్ కథానాయకుడిగా నటించి సొంతంగా నిర్మించిన తాజా చిత్రం తుప్పరివాలన్. మిష్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం పైరసీకి గురి కాకుండా విశాల్ పలు జాగ్రత్తలు తీసుకున్నా రు. తన అభిమానులను కొన్ని బృందాలుగా విభజించి రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో నిఘాను పెట్టారు.
ఎవరూ సెల్‌ఫోన్ లో చిత్రీకరించకుండా ఈ బృందాలు పర్యవేక్షిస్తుంటాయి. విశాల్ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆయనకు సవాల్ విసిరేలా తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్ తుప్పరివాలన్ చిత్రాన్ని శుక్రవారం ప్రసారం చేసి షాక్ ఇచ్చింది. దీంతో కొత్త చిత్రాలను అనధికారంగా ప్రసారం చేస్తున్న వెబ్‌సైట్‌లను కట్టడిచేసేందుకు విశాల్ పెద్ద పోరాటమే చేస్తున్నారు. అలాంటి వెబ్‌సైట్‌లపై తగిన చర్యలు చేపట్టాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒక సమయంలో తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్ అంతం చూస్తానని ఛాలెంజ్ చేశారు కూడా. కొత్త చిత్రాలు ఇంటర్నెట్‌లో అనధికారంగా ప్రచారం కాకుండా ఉండటానికి ఇంటర్నెట్ పరిజ్ఞాన నిపుణులతో ఆలోచనలు జరిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ్‌గన్ వెబ్‌సైట్ నిర్వాహకుడు గౌరీశంకర్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇప్పుడు తమిళ్‌రాకర్స్ వెబ్‌సైట్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై విశాల్ బృందం సుధీర్ఘాలోచనలో తలమునకలైంది.