వివాదంలో విశాల్
తమిళసినిమా: నటుడు, దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కార్యదర్శి విశాల్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇంతకు ముందు గత దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కార్యవర్గ నిర్వాహకంపై విమర్శనాస్త్రాలు సంధించి వారి ఆగ్రహానికి గురైన విశాల్ ఆ తరువాత ఆ కార్యవర్గానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల తమిళ నిర్మాతల కార్యవర్గంపై విమర్శలు చేసి మరో సారి వివాదాల్లో చిక్కుకున్నారు.
పైరసీని అరికట్టడానికి తమిళ నిర్మాతల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఒక భేటీలో ఆరోపణలు గుప్పించారు. ఆ సంఘంలో ఏం జరుగుతుందో తెలియడం లేదని, నడిగర్ సంఘం తరహాలోనే ఆ సంఘాన్ని చేజిక్కించుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాల్ విమర్శలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న తమిళ నిర్మాతల మండలి కార్యవర్గం మంగళవారం స్థానిక ఫిలించాంబర్ ఆవరణలో సంఘం అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సమావేశంలో విశాల్ చర్యల్ని ఖండిస్తూ తీర్మానం చేశారు. అయితే నటుడు మన్సూర్ అలీఖాన్‌తో పాటు కొందరు మాత్రం విశాల్‌కు మద్దతుగా మాట్లాడడం విశేషం. విశాల్ తమిళ నిర్మాతల మండలిని అవమానించే విధంగా ఒక భేటీలో పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, వారంలోపు ఈ వ్యవహారంలో తన విచారాన్ని వ్యక్తం చేయాలని లేని ఎడల దీపావళికి విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఆయన నటిస్తున్న కత్తిసండై చిత్రంతో పాటు ఆయన నటించే ఏ చిత్రానికి తమిళ నిర్మాతల మండలి, తమిళ నిర్మాతలు సహకరించరని తెలిపారు.
ఈ వ్యవహారంపై విశాల్‌ను స్పందించాల్సిందిగా కోరగా తమిళ నిర్మాతల మండలి తరఫున ఇంత వరకూ తనను ఈ విషయమై వివరణ అడగలేదన్నారు. దీని గురించి వారు తనను అడిగినా, లేఖ పంపినా తగిన వివరణ ఇస్తానని అన్నారు. మొత్తం మీద ఈ అంశం కోలీవుడ్‌లో మంచి వేడినే పుట్టిస్తోందని చెప్పవచ్చు. ఈ వివాదం ఎటు దారి తీస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.