Vishwaroopam 2 Review, in Telugu | ‘విశ్వరూపం 2‌’ మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

Published Fri, Aug 10 2018 12:36 PM | Last Updated on Fri, Aug 10 2018 1:08 PM

Vishwaroopam 2 Telugu Movie Review - Sakshi

టైటిల్ : విశ్వరూపం 2
జానర్ : యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌
తారాగణం : కమల్‌ హాసన్‌, శేఖర్ కపూర్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా
సంగీతం : గిబ్రాన్‌
దర్శకత్వం : కమల్‌ హాసన్‌
నిర్మాత : కమల్‌ హాసన్‌, చంద్ర హాసన్‌

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా స్వయంగా దర్శకత్వం వహిస్తూ తెరకెక్కించిన సూపర్‌ హిట్ సినిమా విశ్వరూపం. 2013లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సీక్వెల్‌గా విశ్వరూపం 2 ను తెరకెక్కించారు కమల్‌. వివిధ కారణాలతో ఆలస్యమైన ఈ సినిమాను ఫైనల్‌ గా ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. వరుస వాయిదాల తరువాత రిలీజ్ అవుతుండటంతో విశ్వరూపం 2పై ఆశించిన స్థాయిలో హైప్‌ క్రియేట్‌ అవ్వలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వరూపం 2 ప్రేక్షకులను ఏమేరకు అలరించింది.? కమల్‌ మరోసారి దర్శకుడిగా ఆకట్టుకున్నారా..?

కథ ;
కమల్ విశ్వరూపం 2 కథను తొలి భాగానికి పూర్తి స్థాయి కొనసాగింపుగా తయారు చేసుకున్నారు. చాలా సన్నివేశాలకు విశ్వరూపం తో లింక్‌ ఉండటంతో ఆ సినిమా చూసిన వారికే విశ్వరూపం 2 పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. తొలి భాగంలో న్యూయార్క్‌ మిషన్‌ పూర్తి చేసిన విసామ్ (కమల్‌ హాసన్‌),  మరో మిషన్‌ మీద లండన్‌ వెళ్తాడు.  లండన్‌లో భారీ విధ్వంసాని జరుగుతున్న కుట్రను తన భార్య నిరుపమా (పూజా కుమార్‌), ఆస్మితా సుబ్రమణ్యం (ఆండ్రియా)లతో కలిసి చేదిస్తాడు. అదే సమయంలో తొలి భాగం చివర్లో విసామ్‌ నుంచి తప్పించుకున్న అల్‌ ఖైధా తీవ్రవాది ఒమర్‌ ఖురేషీ (రాహుల్‌ బోస్‌) ఢిల్లీలో  సీరియల్‌ బ్లాస్ట్‌లకు ప్లాన్‌ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న విసామ్‌, ఒమర్‌ ప్లాన్‌ను ఎలా అడ్డుకున్నాడు అన్నదే విశ్వరూపం 2 కథ.

నటీనటులు :
లోకనాయకుడు కమల్‌ హాసన్‌ మరోసారి అద్భుతమైన నటనతో సినిమాను నడిపించాడు. ఈ వయసులోనూ యాక్షన్‌ సీన్స్‌లో మంచి ఈజ్‌ కనబరిచారు. ఆయన బాడీ లాంగ్వేంజ్‌, డైలాగ్‌ డెలివరీ నిజంగా ఓ ‘రా’ ఏజెంట్‌నే చూస్తున్నామా అన్నంత నేచురల్‌గా ఉన్నాయి. హీరోయిన్లుగా కనిపించిన పూజా కుమార్‌, ఆండ్రియాలకు రెండు భాగంలోనూ ప్రాధాన్యమున్న పాత్రలు దక్కాయి. ముఖ్యంగా ఆండ్రియా యాక్షన్‌ సీన్స్‌లోనూ అదరగొట్టారు. (సాక్షి రివ్యూస్‌) విలన్‌గా రాహుల్ బోస్‌ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో క్రూరమైన తీవ్రవాదిగా మెప్పించాడు. ఇతర పాత్రల్లో శేఖర్‌ కపూర్‌, జైదీప్‌, వాహీదా రెహమాన్‌ తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేషణ ;
విశ్వరూపం సినిమాతో హాలీవుడ్ స్థాయి స్పై థ్రిల్లర్‌ను దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం చేసిన లోక నాయకుడు కమల్‌ హాసన్‌ విశ్వరూపం 2తో అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయారు. ముఖ్యంగా తొలి భాగం రిలీజ్ అయి చాలా కాలం కావటం.. సీక్వెల్‌లో చాలా సన్నివేశాలు తొలి భాగంతో లింక్‌ అయి ఉండటంతో ప్రేక్షకులు పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేరు. అదే సమయంలో తొలి భాగంలో ఉన్న ఇంటెన్సిటీ కూడా ఈ సీక్వెల్‌లో మిస్‌ అయ్యింది. ఇంటర్వెల్‌ బ్లాక్‌ లాంటి ఒకటి రెండు సీన్స్ వావ్‌ అనిపించినా ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో కనెక్ట్‌ అవ్వటం కాస్త కష్టమే. ఫస్ట్‌ హాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్‌కు సంబంధించిన చాలా సన్నివేశాలు విశ్వరూపం తొలి భాగంలోని సీన్సే కావటం కూడా నిరాశకలిగిస్తుంది.

సంగీత దర్శకుడు గిబ్రాన్‌ ఓ స్పై థ్రిల్లర్‌కు కావాల్సిన మూడ్ క్రియేట్‌ చేయటంలో సక్సెస్‌ అయ్యాడు. తొలి భాగానికి ఏమాత్రం తగ్గ కుండా అంతర్జాతీయ స్థాయి సంగీతమందించాడు. సినిమాటోగ్రఫి కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంది. అయితే అక్కడక్కడ గ్రాఫిక్స్ మాత్రం నాసిరకంగా ఉండి ఇబ్బంది పెడతాయి. విశ్వరూపం 2కు ఓ రూపు తీసుకురావటంతో ఎడిటర్లు మహేష్‌ నారాయణ్‌, విజయ్‌ శంకర్‌ల కష్టం చాలా ఉంది. ఎక్కవుగా తొలి భాగానికి సంబంధించిన సీన్స్‌ను రిపీట్‌ చేస్తూ రూపొందించిన స్క్రీన్‌ప్లేకు తగ్గట్టుగా మంచి అవుట్‌పుట్‌ ఇచ్చారు ఎడిటర్లు. కమల్‌ నిర్మాతగానూ తన బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేర్చారు.

ప్లస్‌ పాయింట్స్‌ :
కమల్‌ హాసన్‌ నటన
ఇంటర్వెల్‌సీన్‌
నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ ;
స్లో నేరేషన్‌
పెద్దగా థ్రిల్స్‌ లేకపోవటం
క్లైమాక్స్‌

సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement