'వివేకం' మూవీ రివ్యూ | Vivekam Movie Review | Sakshi
Sakshi News home page

'వివేకం' మూవీ రివ్యూ

Published Thu, Aug 24 2017 12:42 PM | Last Updated on Tue, Sep 19 2017 12:20 PM

'వివేకం' మూవీ రివ్యూ

'వివేకం' మూవీ రివ్యూ

టైటిల్ : వివేకం
జానర్ : స్పై థ్రిల్లర్
తారాగణం : అజిత్ కుమార్, వివేక్ ఒబరాయ్, కాజల్ అగర్వాల్, అక్షర హాసన్
సంగీతం : అనిరుధ్
దర్శకత్వం : శివ
నిర్మాత : సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ వివేకం. వీరం, వేదలం లాంటి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందించిన అజిత్, శివ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావటంతో తమిళ నాట ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో తెలుగు నాట కూడా ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది.? చాలా కాలంగా తెలుగు మార్కెట్ మీద దృష్టి పెట్టిన అజిత్ అనుకున్నది సాధించాడా.? దరువు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన శివ, వివేకంతో మెప్పించాడా..?

కథ :
అజయ్ కుమార్ (అజిత్ కుమార్) కౌంటర్ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో పని చేస్తుంటాడు. తన నలుగురు స్నేహితులతో కలిసి 279 మిషన్ లను సమర్థవంతంగా పూర్తి చేసిన అజయ్, 280వ మిషన్ లో ఉండగా అదృశ్యమవుతాడు. కొంత కాలం తరువాత భారీ వినాశనానికి ప్రయత్నించిన ఓ అంతర్జాతీయ మూఠా ను మట్టుబెట్టిన సమయంలో అజయ్ ఉనికి వెలుగులోకి వస్తుంది. దీంతో ఎలర్ట్ అయిన కౌంటర్ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీం అజయ్ కోసం వెతకటం ప్రారంభిస్తుంది. అందుకోసం అజయ్ స్నేహితుల సాయం తీసుకుంటుంది.

తన భార్యతో కలిసి ఓ హోటల్ నడుపుతున్న ప్రశాంతంగా జీవిస్తున్న అజయ్.. సీక్రెట్ గా తన మిషన్ ను కొనసాగిస్తుంటాడు. ప్రపంచ వ్యాప్తంగా కృతిమ భూకంపాలను సృష్టించి భారీ ప్రాణ ఆస్తి నష్టాలను సృష్టించేందుకు అంతర్జాతీయ తీవ్రవాదులు ప్లాన్ చేస్తారు. అందుకోసం ప్లుటోనియం ఆయుధాలను శాటిలైట్ సాయంతో పేల్చేసేందుకు ప్లాన్ చేస్తారు.  ఈ ఆయుదాలను పేల్చాలనుకుంటుంది ఎవరు..? ఆ ప్రయత్నాలను అజయ్ కుమార్ ఎలా అడ్డుకున్నాడు..? అసలు అజయ్ రహస్య జీవితం ఎందుకు గడుపుతున్నాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాలో నటించిన అజిత్, సినిమా అంతా తన భుజాల మీదే మోశాడు. యాక్షన్, ఎమోషన్, స్టైల్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ను సమపాళ్లలో అందించి అభిమానులను అలరించాడు. యాక్షన్ సీక్వన్స్ లలో అజిత్ పడిన కష్టం ప్రతీ ఫ్రేమ్ లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. హీరోయిన్ గా కాజల్ ఆకట్టుకుంది. గ్లామర్ షోకు ఏ మాత్రం చాన్స్ లేని హుందా పాత్రలో తనదైన నటనతో అలరించింది. కీలక పాత్రలో కనిపించిన అక్షర హాసన్, తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా.. గుర్తుండిపోయే పాత్రలో తనని తానూ ప్రూవ్ చేసుకుంది. విలన్ గా వివేక్ ఒబరాయ్ మరోసారి ఆకట్టుకున్నాడు. చాలా సందర్భాల్లో క్రిష్ 3 సినిమాలోని వివేక్ నటన గుర్తుకు వస్తుంది. మిగిలిన పాత్రలేవి చెప్పుకొదగ్గ స్థాయిలో తెర మీద కనిపించవు.

సాంకేతిక నిపుణులు :
ఓ అంతర్జాతీయ స్థాయి కథను తమిళ సినిమాగా తెరకెక్కించే ప్రయత్నం చేసిన దర్శకుడు శివ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. సినిమా అంతా హాలీవుడ్ స్థాయిలో రూపొందించే ప్రయత్నం చేసిన శివ సక్సెస్ అయినా... లోకల్ ఆడియన్స్ ను మెప్పించటంలో తడబడ్డాడు. అజిత్ నుంచి ఫ్యాన్స్ ఆశించే మాస్ మసాలా ఎలిమెంట్స్ ఏవీ సినిమాలో లేకపోవటం నిరాశపరుస్తుంది. పూర్తిగా హాలీవుడ్ తరహా కథ కథానాలతో సాగటంతో యాక్షన్ చిత్రాలను ఇష్టపడే వారికి నచ్చినా.. సాధారణ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందన్నది అనుమానమే. ఏ మాత్రం లాజిక్ లేకుండా సాగిన కథా కథనాలు కూడా కాస్త నిరుత్సాహపరుస్తాయి. అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచింది. ముఖ్యంగా చేజింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ లో అనిరుథ్ మ్యూజిక్ ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది. వెట్రీ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్. సత్య జ్యోతి ఫిలింస్ నిర్మాణ విలువలు హాలీవుడ్ స్థాయి సినిమాను దక్షిణాది ప్రేక్షకులకు ముందుకు తీసుకువచ్చాయి.

ప్లస్ పాయింట్స్ :
అజిత్ నటన
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
గ్రాండ్ విజువల్స్
యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్ :
లాజిక్ లేని సీన్స్
పాటలు

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement