
మరో మెగా హీరోతో వినాయక్
మాస్ సినిమాల దర్శకుడు వినాయక్, ఖైదీ నంబర్ 150 సినిమాతో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అల్లుడు శీను, అఖిల్ సినిమాలు నిరాశపరచటంతో కష్టాల్లో పడ్డ వినాయక్, చిరు రీ ఎంట్రీ సినిమాతో ఫుల్ ఫాంలోకి వచ్చాడు. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న యంగ్ హీరోలకు మరోసారి వినాయక్ దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరిక కలిగించాడు. అందుకే ఇప్పటికే సక్సెస్పుల్ హీరోలుగా ప్రూవ్ చేసుకున్న యంగ్ హీరోలు వినాయక్ డైరెక్షన్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
దర్శకుడిగా సక్సెస్ అయిన తరువాత వినాయక్ ఎక్కువగా మెగా హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. చిరంజీవితో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్లతోనూ సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన ఈ మాస్ డైరెక్టర్ ఇప్పుడు మరో మెగా హీరోతో సినిమాకు రెడీ అవుతున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో సాయిధరమ్ తేజ్తో వినాయక్ సినిమా చేయబోతున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.
ఇప్పటికే మంచి ఫాంలో ఉన్న సాయి, వినాయక్ లాంటి మాస్ డైరెక్టర్తో కలిసి సినిమా చేస్తే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవచ్చని భావిస్తున్నాడు. అందుకే త్వరలో వినాయక్ దర్వకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.