అల్లుడు శీను అన్న టైటిల్ అందుకే! : వీవీ వినాయక్
‘‘గతంలో రామానాయుడుగారు ‘కలియుగ పాండ వులు’ సినిమాని అగ్ర సాంకేతిక నిపుణులతో ఎలా రూపొందించారో ఇప్పుడీ సినిమాను బెల్లంకొండ సురేష్ అలా రూపొందిస్తున్నారు. సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. నిర్మాత బెల్లంకొండ సురేశ్ తన తనయుడు సాయిశ్రీనివాస్‌ని హీరోగా పరిచయం చేస్తూ వినాయక్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘అల్లుడు శీను’.
ఇందులో సమంత కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా కోసం సాయి చాలా కష్టపడుతున్నాడు. సినీ రంగ ప్రవేశానికి అతనికిది మంచి వేదిక అవుతుంది. బ్రహ్మానందం, సాయి కలయికలో వచ్చే సన్నివేశాల్లో ‘అల్లుడు’ పదం ఎక్కువగా దొర్లుతుంది. అందుకే టైటిల్ ‘అల్లుడు శీను’ అని పెట్టాం. అడగ్గానే కాదనకుండా తమన్నా ఓ ప్రత్యేక పాట చేసింది. ఈ చిత్రంలో కామెడీ, యాక్షన్, లవ్.. ఇలా అన్ని అంశాలున్నాయి’’ అని చెప్పారు.
బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ -‘‘నా సంస్థ ద్వారా దర్శకునిగా పరిచయమైన వీవీ వినాయక్ ఇప్పుడు మా అబ్బాయి పరిచయ చిత్రానికి దర్శకుడు కావడం ఆనందంగా ఉంది. ‘మీ అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తాను’ అని ఐదేళ్ల క్రితం ఇచ్చిన మాటని ఆయన నిలబెట్టుకున్నారు. ఈ నెల 29న పాటలను, జూలై 24న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఒక విజయవంతమైన సినిమాకి కావల్సిన అన్ని హంగులూ ఉన్న సినిమా ఇదని, బ్రహ్మానందం కామెడీ చాలా ప్లస్ అవుతుందని రచయిత కోన వెంకట్ చెప్పారు. ఈ చిత్రానికి కథ: కె.యస్. రవీంద్రనాథ్, కోన వెంకట్, మాటలు: కోన వెంకట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఛోటా. కె. నాయుడు.