
అదరగొడుతున్న 'రాహుల్ - షారుక్' వీడియో
ముంబై:
బాలీవుడ్ 'కింగ్ ఆఫ్ రొమాన్స్' షారూక్ ఖాన్ 50 ఏళ్ల జీవితంలో బాల్యం నుంచి మొదలు కొన్ని ముఖ్య ఘట్టాలను, సినీ ప్రస్థానాన్ని వినూత్నంగా చిత్రీకరించి ఓ అభిమాని షారూక్ ను ఉత్తేజితుడిని చేశాడు. శాండ్ ఆర్టిస్ట్ రాహుల్ ఆర్య ఆకర్షణీయమైన వీడియోతో షారూక్‌పై తనకున్న అభిమానాన్ని, ప్రేమను చాటుకున్న వైనం పలువుర్ని ఆకట్టుకుంటోంది. '50 ఇయర్స్ ఆఫ్ ఎస్ఆర్‌కె' పేరుతో 200 సెకండ్ల నిడివితో అద్భుతంగా ఉన్న ఈ వీడియోను చూసితీరాల్సిందే.
బాలీవుడ్ బాద్షా షారూక్ తొలినాళ్లలో నటించిన 'ఫుజి' నుంచి తాజా చిత్రం 'ఫ్యాన్', ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న 'రయీస్' వరకు ఇసుక ఆర్ట్ తో కూడిన ఒక వీడియోను సృష్టించాడు. అటు హీరోని, ఇటు అభిమానులను.. ఇంకా పలువురిని మంత్రముగ్ధులను చేసిన ఈ వీడియో ఇపుడు నెట్‌లో చక్కర్లు కొడుతోంది. మరోవైపు రాహుల్ కళాత్మక వీడియోపై స్పందించిన షారూక్ కూడా రాహుల్ ని అభినందించాడు. ఈ వీడియో తన సింహావలోకనానికి ఉపయోగపడిందని... తాను చేయాల్సింది ఇంకా చాలా ఉందంటూ ట్వీట్ చేశాడు.
కాగా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తాజా చిత్రం 'ఫ్యాన్' రెండో అఫీషియల్ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో బాగానే పాపులర్ అయింది. దీనిపై ఆయన అభిమానుల స్పందన భారీగానే ఉంది. 'ఫ్యాన్' సినిమాలోని గౌరవ్ ప్లేస్‌లో తనను రిప్లేస్ చేస్తూ ఓ అభిమాని ఫ్యాన్ ట్రైలర్ ను తిరిగి రూపొందించిన మరో ప్రయత్నం షారూక్‌ను బాగా ఇంప్రెస్ చేసింది. దీంతో ఆ యువకుడికి తన గ్రాఫిక్స్ విభాగంలో చేరమని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.
Thank u. Makes me want to work harder when I see my life flashing past me and I still have enough to create more. https://t.co/XVILD0wicC
— Shah Rukh Khan (@iamsrk) March 21, 2016