
మా మద్దతు రాజేంద్రప్రసాద్‌కే : నాగబాబు
రాజేంద్రప్రసాద్‌గారు ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడు ఎప్పుడో అవ్వాల్సి ఉంది. ‘మా’
‘‘రాజేంద్రప్రసాద్‌గారు ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడు ఎప్పుడో అవ్వాల్సి ఉంది. ‘మా’ అధ్యక్షుడిగా సేవ చేయాలని ఆయన భావిస్తున్నారు. తప్పకుండా మా మద్దతు ఆయనకే’’ అని నాగబాబు అన్నారు. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న నటుడు రాజేంద్రప్రసాద్‌కు మద్దతు పలుకుతూ నాగబాబు, శివాజీరాజా, ఏడిద శ్రీరామ్, ఉత్తేజ్ తదితరులు గురువారం ఓ సమావేశం ఏర్పాటు చేశారు. శివాజీరాజా మాట్లాడుతూ- ‘‘ఇది ఎవరి మీదా యుద్ధం కాదు. కొత్త వాళ్లను పెడదామని మురళీమోహన్‌గారే అన్నారు. అందుకే మేమే రాజేంద్ర ప్రసాద్‌గారిని సంప్రదించాం. 50 మంది పేద కళాకారులకు పింఛను, బీమా కట్టుకోలేని 50 నుంచి 60 మంది ఖర్చు తానే భరిస్తానని ఆయన ముందుకొచ్చారు’’ అని చెప్పారు.
పోటీకి సై అంటున్న జయసుధ
ఇదిలా ఉంటే.. ఈ సమావేశం జరిగిన కొన్ని గంటలకు ‘మా’ అధ్యక్ష పదవికి తాను పోటీ చేస్తున్నట్లు సీనియర్ నటి జయసుధ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్ ఆమెకు మద్దతు పలికారు. మొత్తం మీద ఈసారి ‘మా’ అధ్యక్ష పదవి వ్యవహారం రసవత్తరంగా సాగనుందని ఫిలింనగర్ వర్గాలు అనుకుంటున్నాయి. పైగా, గురువారం సాయంత్రం నటుడు ఒ. కల్యాణ్.. హడావిడిగా ఎన్నికలు నిర్వహించాలనుకోవడంలో ఆంతర్యమేమిటి? అనీ, ఎన్నికలు ఆపివేయాలనీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటనను ఆయన దాసరి నారాయణరావుకీ, ‘మా’ ఎన్నికలు నిర్వహించనున్న అధికారికీ పంపించారు. ఈ ప్రకటన ఎన్నికల కమిషన్ పరిధిలోకి రాదనీ, ఏదైనా ఉంటే ‘మా’తో చర్చించుకోవాలనీ అసిస్టెంట్ ఎన్నికల కమిషనర్ జీవీ నారాయణ రావు ఆయనకు మరో ప్రకటనలో తెలిపారు.