బ్రహ్మానందానికి ఆఫర్లు తగ్గాయా?
హైదరాబాద్: అహ నా పెళ్లంట సినిమాతో 'అరగుండు' బ్రహ్మానందంగా తెలుగు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన హాస్యనటుడు బ్రహ్మానందానికి ఆఫర్లు ఏమైనా తగ్గాయా? ఇటీవల స్టార్ హీరోలతో పాటు దర్శక నిర్మాతలు కూడా ఈ స్టార్ కమెడియన్‌ను పక్కన పెడుతున్నారా? రెమ్యునరేషన్ భారీగా ఉండటంతో పాటు... స్క్రిప్టులో వేలు పెట్టడం లాంటివి చేస్తున్నారనే ఇలా ఆయనను దూరం పెడుతున్నట్లు సినీ జనాలు చెబుతున్నారు. కొందరు కొత్త దర్శకులైతే బ్రహ్మానందంతో పనిచేయాలంటే చాలా కష్టమని వాపోతున్నారట. దీంతో కొత్తతరం కమెడియన్లయితే బెటరని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. మరోవైపు తెలుగులో హర్రర్ కామెడీ సినిమాలకు బాగా ప్రాధాన్యం పెరిగిందని, అందుకే ఆ తరహా నటులకే మంచి ఆదరణ లభిస్తోందని సినీ పండితుల వాదన.
ఈ పరిణామాలపై ఇప్పటివరకు సైలెంటుగా ఉన్న ఖాన్ దాదా.. తన సన్నిహితుల వద్ద స్పందించినట్లు సమాచారం. తాను ఎప్పుడూ కథ, పాత్రల్లో వేలు పెట్టలేదని, తన గురించి ఇండస్ట్రీలో ఇలాంటి ప్రచారం జరగడం అన్యాయమని వాపోయినట్టు తెలుస్తోంది. ఇది తనను చాలా షాక్‌కు గురిచేసిందని, తాను ఎపుడూ అలా వ్యవహరించలేదని వివరణ ఇచ్చారట. కొందరు దర్శకులు, రచయితలతో రిపీటెడ్‌గా పనిచేయడమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారట.
కాగా ఇప్పటివరకు దాదాపు వెయ్యికి పైగా సినిమాల్లో తనదైన నటనతో తెలుగు సినీ చరిత్రలో కామెడీ డాన్‌గా అలరించిన నటుడు బ్రహ్మానందం. అరగుండుగా, ఖాన్ దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్‌దాదా ఆర్ఎంపీ, జిలేబీ, గచ్చిబౌలి దివాకర్, విద్యాబాలన్, జిల్‌బిల్ పాండే, బద్దం భాస్కర్, హంసరాజ్.... ఇలా వైవిధ్యమైన పాత్రల్లో అద్భుతమైన కామెడీని పండించిన నటుడాయన. అత్యధిక చిత్రాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్ బుక్ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు.