ఫ్రాన్సిస్ మెక్‌డొర్మాండ్, ∙సాలీ హాకిన్స్, ∙మెరిల్ స్ట్రీప్, ∙సీర్సా రోనాన్, ∙మార్గో రాబీ,
ఆస్కార్.. ఆస్కార్.. ఆస్కార్ అని హాలీవుడ్ అంతా జనవరి మొదట్నుంచీ ఒకే పాట పాడుతోంది. మార్చి 4న ఆస్కార్ అవార్డులను ప్రకటించేవరకూ ఈ పాట రిథమిక్‌గా మోగుతూనే ఉంటుంది. మన దగ్గరా హాలీవుడ్ సినిమా అభిమానులు ఈ పాటను అందుకుంటున్నారు. ఏ సినిమా బెస్ట్ పిక్చర్ అవుతుంది? బెస్ట్ యాక్టర్ ఎవరవుతారు? బెస్ట్ యాక్ట్రెస్‌గా ఎవరు అవార్డు అందుకుంటారు? అన్నీ చర్చలే! నామినేషన్స్ కూడా అనౌన్స్ అయ్యాక ఈ చర్చ ఇంకా తారాస్థాయికి చేరిపోయింది. బెస్ట్ యాక్ట్రెస్ (ఉత్తమ నటి)గా నామినేషన్స్ ఎవరెవరు దక్కించుకున్నారో, వారిలో ఎవరికి అవార్డు రావడానికి ఎక్కువ స్కోప్ ఉందో చూద్దాం..
సాలీ హాకిన్స్ (చిత్రం: ది షేప్ ఆఫ్ వాటర్)
‘ది షేప్ ఆఫ్ వాటర్’.. ఈ ఏడాది బెస్ట్ పిక్చర్ జాబితాలో అవార్డు అందుకునేందుకు గట్టి పోటీనిస్తోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో హాకిన్స్ నటన కూడా ది బెస్ట్ అనిపించుకుంది. ఒక్క డైలాగ్ కూడా ఉండదు హాకిన్స్‌కు ఈ సినిమాలో. ఒక గవర్నమెంట్ ల్యాబ్‌లో మూగ భాషతోనే చెప్పాలనుకున్న విషయాలు చెప్తుంది. ఈ పాత్రలో హాకిన్స్ నటన ‘అద్భుతం’ అన్న కితాబులు అన్ని వైపుల నుంచీ వచ్చాయి. నామినేషన్స్ దక్కించుకున్న ఐదుగురిలో ఒకరైన హాకిన్స్‌కు అవార్డు దక్కే అవకాశాలు చాలానే ఉన్నాయి. గతంలో ‘బ్లూ జాస్మిన్’ (2013) అనే సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ రోల్‌కు ఆస్కార్‌కు నామినేట్ అయింది హాకిన్స్. ‘ది షేప్ ఆఫ్ వాటర్’కి గనక ఆమె అవార్డు అందుకుంటే ఉత్తమ నటిగా అదే ఆమెకు మొదటి అవార్డు.
ఫ్రాన్సిస్ మెక్‌డొర్మాండ్
చిత్రం: త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి
‘త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి’.. ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా బెస్ట్ పిక్చర్‌గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్నాక మరింత పాపులర్ అయింది. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంటే గొప్పే అని అన్నవారంతా, ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చే సినిమాగా కూడా చూస్తున్నారు. ఇందులో ఫ్రాన్సిస్ మెక్‌డొర్మాండ్ వ్యవస్థపై పోరాడే ఓ తల్లి పాత్రలో కనిపించింది. కూతురును రేప్ చేసి, మర్డర్ చేస్తే, దానిపై తనకు కావాల్సిన సమాధానాల కోసం, జరగాల్సిన న్యాయం కోసం పోరాడే తల్లి పాత్రలో ఫ్రాన్సిస్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు ఆ పాత్రతోనే ఒక ప్రత్యేకమైన డెప్త్ వచ్చింది అంటారు హాలీవుడ్ సినీ పండితులు. ఫ్రాన్సిస్ గతంలో ‘మిసిస్సిపి బర్నింగ్’ (1999), ‘ఆల్మోస్ట్ ఫేమస్’ (2001), ‘నార్త్ కంట్రీ’ (2006) సినిమాలకు బెస్ట్ యాక్ట్రెస్ సపోర్టింగ్ రోల్‌లో ఆస్కార్‌కు నామినేట్ అయింది. ‘ఫార్గో’ (1997)కి ఉత్తమ నటిగా ఒక అవార్డు కూడా అందుకుంది. ఇప్పుడు 2018లోనూ ఆస్కార్ కొడితే ఆమెకిది రెండో ఆస్కార్!
మార్గో రాబీ (చిత్రం: ఐ, టోన్యా)
‘ఐ, టోన్యా’.. ఫిగర్ స్కేటర్ టోన్యా హార్డింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఆమె జీవితంలో కాంట్రవర్సీగా నిలిచిన కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ సాగే ఈ సినిమాలో టోన్యా పాత్రలో మార్గో రాబీ నటించింది. మార్గో నటనే ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతోనే మార్గో నటిగా ఓ గుర్తింపు కూడా తెచ్చుకుంది.
‘ఐ, టోన్యా’ ఆమెకు మొట్టమొదటి ఆస్కార్ నామినేషన్. బెస్ట్ యాక్ట్రెస్ నామినేషన్స్‌లో ఉన్న మిగతావారితో పోల్చితే మార్గోపై అంచనాలు తక్కువే ఉన్నా, మంచి పోటీ ఇచ్చే అవకాశమైతే ఉంది.
సీర్సా రోనాన్ (చిత్రం: లేడీ బర్డ్)
‘లేడీ బర్డ్’.. ఇటు బాక్సాఫీస్ పరంగా, అటు విమర్శకుల ప్రశంసల పరంగా 2017లో సూపర్ హిట్ అనిపించుకున్న సినిమాల్లో ఒకటి. ఇందులో ఒక హైస్కూల్ స్టూడెంట్ పాత్రలో రోనాన్ నటన అద్భుతం అనే కితాబులిచ్చారంతా. కమింగ్ ఆఫ్ ఏజ్ ప్రేమలు, వాళ్ల ఆలోచనల చుట్టూ కథ తిరుగుతుంది. రోనాన్ తప్ప ఇంకెవ్వరూ ఈ పాత్రలో నటించలేరు అన్నట్టుగా చేసిందామె. ఆస్కార్ అవార్డు నామినేషన్స్ పొందిన ఐదుగురిలో రోనాన్‌కు అన్ని విధాలా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకునే అర్హత, అవకాశం ఉన్నాయి. ఇది రోనాన్‌కు ఫస్ట్ ఆస్కార్ నామినేషన్. ఒకవేళ రోనాన్ ఆస్కార్ కొడితే, చిన్న వయసులో బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డు అందుకున్న క్యాటగిరీలో నాలుగో స్థానంలో చేరుతుందామె. ఆమె వయసు ఇప్పుడు 23 సంవత్సరాలు.
మెరిల్ స్ట్రీప్ (చిత్రం: ది పోస్ట్)
‘ది పోస్ట్’.. ఎంతోమంది దర్శకులకు ఇన్స్‌పిరేషన్ అయిన స్పీల్‌బర్గ్ తీసిన సినిమా. గత డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పట్నుంచీ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంది. స్పీల్‌బర్గ్ తన స్థాయికి తగ్గ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ‘ది పోస్ట్’. ఇక ఇందులో మెరిల్ స్ట్రీప్ నటన మేజర్ హైలైట్స్‌లో ఒకటి. వియత్నాం వార్ టైమ్‌లో ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సీక్రెట్స్‌ను బయటపెట్టే కథతో ఆసక్తికరంగా నడుస్తుంది ‘ది పోస్ట్’. ఇందులో మెరిల్ ఓ జర్నలిస్ట్‌గా కనిపిస్తుంది.
మెరిల్ ఇప్పటివరకూ చేసిన వాటిల్లో ది బెస్ట్ అనేంతగా విమర్శకులను మెప్పించిందీ పాత్రతో! ఇప్పటికే బెస్ట్ యాక్ట్రెస్‌గా రెండు, సపోర్టింగ్ రోల్‌లో ఒక ఆస్కార్ పొందిన మెరిల్, ఈ రెండు క్యాటగిరీల్లో మొత్తం 17 నామినేషన్స్ దక్కించుకున్నారు ఇప్పటివరకూ. ఆస్కార్ లిస్ట్‌లో అందరికీ గట్టి పోటీ ఇవ్వగల మెరిల్ స్ట్రీప్ ఆస్కార్‌ను కూడా సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ లిస్ట్ మొత్తంలో ఎక్కువ క్రేజ్ మెరిల్ స్ట్రీప్‌కే కనిపిస్తోంది. అయితే ఆస్కార్ రిజల్ట్ ఎలా ఉంటుందన్నది మార్చి 4 వరకూ చెప్పలేం!!
Comments
Please login to add a commentAdd a comment