
ఇంతకీ మహానటి ఎవరు?
ఆనాడు, ఈనాడు, ఏనాడు భారతీయ సినిమా మరువలేని మహానటి సావిత్రి. తమిళం, తెలుగు మొదలగు పలు భాషల్లో మరపురాని చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సావిత్రిని తమిళ ప్రజలు నట తిలకవతిగా అభిమానించారు. పాత్రలకు ఆమె వన్నెనా? ఆమెకు పాత్రలు బలమా? అన్న ప్రశ్నకు నిస్సందేహంగా సావిత్రినే పాత్రలకు వన్నె అని ఎవరైనా అంటారు. అప్పట్లో అత్యధిక పారితోషికం అందుకున్న తొలి నటీమణి సావిత్రినే. అదే విధంగా ఖరీదైన కారు, ఆడంబరమైన బంగ్లాలో జీవనం సాగించిన మొట్టమొదటి నటి సావిత్రి అంటారు. అలాంటి నట విశారద చివరి దశలో ఏమి లేకుండా జీవితాన్ని సాగించారు.
ఆ మహానటి జీవిత చరిత్రను వెండి తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యువ దర్శకుడు నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో రూపొందించడానికి సిద్ధమయ్యారు. ఇందులో సావిత్రి పాత్రను పోషించే నటి ఎవరన్నది ఇంత వరకూ ఒక స్పష్టత రాలేదు. అయితే ఆ పాత్రకు చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. నటి సమంత సావిత్రిగా నటించనున్నారనే ప్రచారం కొన్ని రోజులు సాగింది. ఆ తరువాత ఆమె వెనుకడుగు వేశారనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఆపై బాలీవుడ్ భామ విద్యాబాలన్, నిత్యామీనన్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా మరో ప్రచారం హల్‌చల్ చేస్తోంది. సావిత్రి జీవిత చరిత్రలో యువ క్రేజీ నటి కీర్తీసురేశ్ నటించనున్నారదే ఆ ప్రచారం. అదే విధంగా మరో కీలక పాత్రలో నటి సమంత నటించనున్నట్లు సమాచారం. ఈ ఇద్దరిలో సావిత్రిగా నటించే వారెవరన్నది ఇంకా క్లారిటీ లేదు.
పూర్తి వివరాలు అధికారిక పూర్వంగా ప్రకటించే వరకూ ఇలాంటి ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. కాగా సమంత తమిళంలో మూడు చిత్రాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇక కీర్తీసురేశ్ చేతిలోనూ మూడు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి సూర్యకు జంటగా నటిస్తున్న తానాసేర్నద కూటం, మరోకటి తెలుగులో నాని సరసన పక్కాలోకల్ చిత్రంతో పాటు, పవన్ కల్యాణ్‌తో ఆన 25వ చిత్రంలో నటించనున్నారు. ఇక విజయ్‌తో రొమాన్స్ చేసిన భైరవా చిత్రం సంక్రాంతికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.