
నేను అలాంటి సూపర్‌స్టార్‌ని కాను!
న్యూఢిల్లీ: సూపర్‌స్టార్ అంటే ప్రస్తుతం అర్థం మారిపోయిందని, ఆన్‌లైన్‌లో ఎక్కువ హిట్స్ తెచ్చుకోవడమే ఇప్పుడు సూపర్‌స్టార్ అన్నట్టుగా మారిపోయిందని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పేర్కొంది. తను చేసిన పని ఆధారంగానే పేరు తెచ్చుకుంటాను కానీ, సోషల్ మీడియాలో చేసే జిమ్మిక్కుల ఆధారంగా కాదని నేషనల్ అవార్డు గెలుచుకున్న ఈ నటి స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో సెన్సేషనలిజానికి పెద్ద పీట వేయడాన్ని చూస్తుంటే బాధ కలుగుతుందని, ఈ సెన్సేనలిజానికి పాల్పడే వారే ప్రస్తుతం సమాజానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని కంగన పేర్కొంది.
'సోషల్ మీడియాలో తన సామర్థ్యంతో ప్రజలను థ్రిల్ చేసేవారు, వారిని వెర్రివాళ్లను చేసేవారే ఇప్పుడు సూపర్‌స్టార్స్ అవుతున్నారు. ప్రస్తుత తరానికి ఆదర్శప్రాయంగా నిలిచే మంచి వ్యక్తులు కనబడకపోవడం బాధ కలిగిస్తోంది' అని 28 ఏళ్ల కంగన తెలిపింది. సీఐఐ-యంగ్ ఇండియా సదస్సులో ఆమె మాట్లాడుతూ 'ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నవాళ్లు, శరీరాన్ని బాగా ప్రదర్శించేవాళ్లు, ఏమీ చేయలేని వాళ్లు ఇప్పుడు సూపర్‌స్టార్లు అవుతున్నారు. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఓ ఖాతా తెరిచి.. ఏదైనా సెన్సేషనల్ చేస్తే.. నేను కూడా రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అవుతాను. నేను అలాంటి వ్యక్తినా? అలాంటి సూపర్ స్టార్‌ను కావాలనుకుంటున్నానా? కానే కాదు' అని కంగన పేర్కొంది. నిజజీవితంలో ఏదైనా సాధించి.. సమాజానికి సేవ చేసే నిజమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులనే ఆదర్శంగా తీసుకోవాలని ఆమె యువతకు సూచించారు.